అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తొలి చిత్రం 'మహారాజ్' విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. జూన్ 14న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర నిర్మాణ సంస్థకు గుజరాత్ హైకోర్ట్ షాకిచ్చింది. ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ తాజాగా మధ్యంతర స్టే విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సంగీత కె విషెన్ ఉత్తర్వులు జారీ చేశారు.
'మహారాజ్' అనేది 1862 నాటి మహారాజ్ లిబెల్ కేసుపై ఆధారపడి ఉందని పిటిషనర్లు ఆరోపించారు. బొంబాయి సుప్రీంకోర్టులోని ఆంగ్ల న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన ఈ కేసులో హిందూ మతంతో పాటు శ్రీకృష్ణుడిపై దూషించే వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రజలను ప్రభావితం చేయడమే కాకుండా హిందూ మతానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించగలవని వారు పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న నెట్‌ఫ్లిక్స్‌ను బ్యాన్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. 'మహారాజ్' చిత్రానికి సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా, ఆదిత్య చోప్రా నిర్మించారు. ఇందులో జైదీప్ అహ్లావత్ కూడా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment