నూరు దెబ్బలు తిన్న జీవితం | A Book Written On Telangana Freedom Fighting By Nalla Narsimhulu | Sakshi
Sakshi News home page

నూరు దెబ్బలు తిన్న జీవితం

Published Mon, May 27 2019 1:10 AM | Last Updated on Mon, May 27 2019 1:10 AM

A Book Written On Telangana Freedom Fighting By Nalla Narsimhulu - Sakshi

తెలంగాణ సాయుధ పోరాటం: నా అనుభవాలు రచయిత నల్లా నరసింహులు

ప్రతిధ్వనించే పుస్తకం

పోరాటంలో గొప్ప నాయకులుగా పేరొందినవాళ్ల జీవిత చరిత్రలు ఒక రకమైన దృష్టికోణాన్ని ఇస్తాయి. నల్లా నరసింహులు క్షేత్రస్థాయిలో పనిచేసినవాడు కాబట్టి ఆ అనుభవాలు ఇవ్వగలిగే తీవ్రత వేరే. ‘కడవెండి గ్రామాన నల్లోల నర్సిమ్మ/ పేర్జెప్పి గుంజికొట్టెరా దొరగాడ/ నీకైన మొనగాడురా’ అని ఆ ప్రాంతపు జనం పాడుకునేవారు. ‘జనగామ సింహం’ నల్లా నరసింహులు (2 అక్టోబర్‌ 1926 – 5 నవంబర్‌ 1993) వరంగల్‌ జిల్లా కడవెండిలో జన్మించారు. ఏడవ తరగతి చదువుకున్నారు. వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. ‘పోరాటం ముగిసిన తర్వాత’ ఆయన మీద పడిన మరణ శిక్ష, యావజ్జీవ శిక్షలు రద్దయినాక 1959లో జైలు నుంచి విడుదలైనారు. 1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవం సందర్భంగా యోధులు తమ అనుభవాలు నివేదించాలన్న కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు నివేదిక బదులు పుస్తకమే రాశారు.  ‘తెలంగాణ సాయుధ పోరాటం: నా అనుభవాలు’ 1989లో ప్రచురితమైంది. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ: సౌజన్యం: విశాలాంధ్ర.

‘దొరసాని (విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ) దగ్గర పనిచేసే 20 మంది జీతగాళ్లతో సహా ఆ గ్రామంలో జీతగాళ్లందరిని సంఘటిత పర్చి ఒక రోజు సమ్మె జరిపించినాము. 3 రోజుల తర్వాత రైతులు సంప్రదింపులకు దిగారు. రైతులు ఇచ్చే రేటు తాను కూడా ఇస్తానని దొరసాని తన ఏజెంటును సంప్రదింపులకు పంపించింది. 3 కుంచాల జొన్నలకు బదులు నాలుగు కుంచాలకు నెలజీతం పెంచబడింది. తూమెడుకు బదులు ఇద్దు ధాన్యం సంవత్సరానికి భిక్షం పేర అదనంగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. సంవత్సరానికి 15 రోజులు సెలవు కూడా అంగీకరించారు.’

‘ఒకనాడు భూస్వామి రామచందర్‌రావు గ్రామంలో ఒక బజారు వెంట వస్తుండగా పొరపాటున ఒక రైతు తన ఇంటిముందు అరుగుమీద కూర్చున్నాడు. రైతు భూస్వామి వచ్చి వెళ్లిన విషయాన్ని కనిపెట్టలేదు. ఇంకేముందీ ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువగాదన్నట్లు’ మొత్తం గ్రామములోని ప్రజల ఇంటిముందరి అరుగులన్ని మూలమట్టంగా కూలగొట్టించాడు.’ ‘భూస్వాములకు, పోలీసులకు వ్యతిరేకంగా అలజడి చేస్తారా? సాధారణ యువకుడవు నీవు చెప్పితే ఇన్ని వందల ప్రజలు ఒక్కమాట మీద ఆగి మామీదికి రాకుండా చేయగలిగిన సత్తా ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పమని ఒక సాకుతో బోర్ల పండబెట్టి ఒక జవాన్‌ నడుంమీద కూర్చోని అరికాళ్లు పైకి లేపి పట్టుకున్నాడు.

మరొక జవాను కర్రతో అరికాళ్లపై కనీసం 100 దెబ్బలైనా కొట్టాడు. రక్తం ఎర్రగా కమిలి రెండు రోజులు లేవకుండా అడ్డం పడిపోయాను. పోలీసులు మాకు మూత్రం త్రాగించడం, వారి వృషణాలను నోటిలో చొప్పించడం లాంటి కిరాతకాలకు పాల్పడ్డారు.’ ‘(నల్లగొండ) జైలు ప్రధాన ద్వారంలో అడుగుపెట్టిన తక్షణమే కుడికాలికి ఒక ఇనుప కడియం తగిలించారు. చెప్పులు కూడా లోపల తొడగటానికి వీలు లేకుండా ఆఫీసులో పడవేయించారు. ఆ రాత్రి ఎలాగో కాలం గడిపాము. తెల్లవారి ముఖాలు కడుక్కున్నంక రొట్టెలు ఇచ్చారు. అవి ఇనుప కంచాలు. కొద్దిగా ఆలస్యం జరిగితే వాటిలో పోసిన పులుసుకు చిలుము వచ్చి తినడానికి వీల్లేకుండా డోకు వచ్చేది.’

‘(మహబూబ్‌నగర్‌ జైలు నుండి జంపుఖానాను నిలువుగా చించి, వాటిని జోడించి, ఆ పొడవు సరిపోక ధోవతి కూడా దానికి కట్టి, గోడ దూకి పారిపోయాక) అంతకు క్రితం సాయంత్రం 6 గంటలకు భోజనం చేసిన మేము పరుగులెత్తడం, దూరం ప్రయాణించడం వలన ఆకలి వేసింది. 25 ఏళ్ల ప్రాయం గల ఆ రైతు వేరుసెనగ కాల్చి మాకు పెట్టాడు. మేము కడుపు నిండా తిని నీరు తాగాం. మొలకు పంచ లేదని, ఏదైనా ఒక పాత పంచె ఇవ్వమని ఆ యువకున్ని కోరినాం. తన వద్ద పంచెలు లేవని చెప్పాడు. నా మొలకు కట్టుకున్న కొత్తచొక్కా తీసుకుని ఏదైనా ఒక పాతపంచ తీసుకువచ్చి ఇవ్వమని కోరినాను. అతడు గ్రామంలోకి వెళ్లి పాతపంచె తెచ్చాడు. దానిని నేను మొలకు కట్టుకుని నా చొక్కా అతనికిచ్చి వేశాను.’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement