s\o. బ్రహ్మమూర్తి ... ఆస్తే విలువ | Brahmi replaced of prakasraj in designe S\o sathyamurthi | Sakshi
Sakshi News home page

s\o. బ్రహ్మమూర్తి ... ఆస్తే విలువ

Published Mon, May 18 2015 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

s\o. బ్రహ్మమూర్తి ... ఆస్తే విలువ

s\o. బ్రహ్మమూర్తి ... ఆస్తే విలువ

 కొత్త అవతార్
 
సన్నాఫ్ సత్యమూర్తిలో ప్రకాష్‌రాజ్‌కి బదులు బ్రహ్మానందం ఉంటే!

 
అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేసరికి మేనేజర్ తిడుతూ బయటికి వెళుతున్నాడు. తండ్రి బ్రహ్మానందాన్ని చూసి,అర్జున్ - ‘‘ఎందుకు నాన్నా వాడు బీప్ సౌండ్‌తో తిడుతున్నాడు’’. బ్రహ్మా - ‘‘అడిగినప్పుడు డబ్బులివ్వకపోతే వాడేంటి నువ్వు కూడా తిడతావు.’’‘‘ఇవ్వచ్చు కదా.’’ ‘‘వాడి భార్య ఆస్పత్రిలో ఉందని ఇప్పటికి ఆరుసార్లు చెప్పాడు. ఒకే భార్య ఎన్నిసార్లు ఆస్పత్రిలో ఉంటుంది?’’ ‘‘అంటే ఇప్పటికి ఆరుసార్లు డబ్బులిచ్చావా?’’ ‘‘ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈ బ్రహ్మమూర్తి దేన్నీ నమ్మడు. బ్రహ్మను కూడా నమ్మడు. నీకు నాన్నా పులి కథ తెలుసా? ఏదో కొడుకు కదాని రెండుసార్లు నమ్మాడు. మూడోసారి నమ్మకపోవడం వల్ల బతికిపోయాడు. నమ్ముంటే కొడుకుతో పాటు తండ్రిని కూడా పులి తినేసేది. కథ కంచికి... పులి అడవికి.’’

‘‘ఏంటి నాన్నా, కథ కొత్తగా చెపుతున్నావ్?’’

 ‘‘బాగున్నప్పుడు కథలు చెప్పి, బాగా లేనప్పుడు నాటకాలు ఆడేవాడు కాదురా ఈ బ్రహ్మమూర్తి. ఏ కథైనా మొదట విన్నప్పుడు కొత్తగా ఉంటుంది. తరువాత రోతగా మారుతుంది. నేనో అమ్మాయిని చూశాను. అమ్మాయి ఆస్తి నాకు నచ్చింది. నీకు అమ్మాయి నచ్చకపోయినా పెళ్లి చేసుకో. ప్రపంచంలో సగం మంది నచ్చకుండానే పెళ్లి చేసుకుంటారు. మిగిలిన సగం మందికి పెళ్లయింతరువాత ఒకరికొకరు నచ్చరు. పెళ్లికి ముందు నచ్చి, పెళ్లికి తరువాత నచ్చితే వాళ్ల క్యారెక్టర్‌లో ఏదో మచ్చ ఉందని అర్థం. ఒక్క విషయం గుర్తుంచుకో. ఈ లోకంలో వస్తువులకే తప్ప మనుషులకు విలువలుండవు. ఆస్తికి విలువుంటుంది కానీ, విలువల వల్ల ఆస్తి రాదు, చిప్ప మాత్రం వస్తుంది.’’

‘‘బ్రహమూర్తి కొడుకుగా నాకే విలువా లేదా?’’

‘‘నాకు మూడొందల కోట్లు ఆస్తి ఉంది కాబట్టే నీకు విలువ. మూడొందల కోట్లు అప్పులున్నాయని తెలిస్తే నీకూ నాకూ శిలువ. ఒకవేళ నేను పోయినా ఎవరికీ రూపాయి అప్పు తీర్చద్దు.’’
 
‘‘తీర్చకపోతే ఎలా నాన్నా?’’
 
‘‘వొరే పిచ్చినాన్నా, ఈ దేశానికి లక్షల కోట్లు అప్పుంది. మన రాష్ట్రానికి అప్పుంది. చివరికి చెత్త ఊడ్చే మునిసిపాలిటీలు కూడా వరల్డ్ బ్యాంక్‌లో అప్పులు తీసుకుంటున్నాయి. అప్పు చేయడం దేశభక్తితో సమానం. మేరీ దేశ్ కీ ధర్తీ అని పాట పాడుతూ అప్పుజెయ్యి. అప్పుచేసేవాడు అప్‌కి వెళతాడు. తీర్చేవాడు డౌన్‌కి పోతాడు.’’
 
‘‘గ్రేట్ వాల్యూస్ నాన్నా నీవి?’’
 
‘‘గ్రేట్ కాదు, రేట్ వాల్యూస్. చూడు మనం ఎంతటి లంకానగరం నిర్మించినా, లంకిణిని కాపలా పెట్టినా, ఏదో ఒకనాడు తోక తిప్పుకుంటూ ఆంజనేయుడు వస్తాడు. వాడి తోకకి నిప్పు పెట్టడం నేర్చుకో. అర్థం కాలేదా ఆంజనేయుడంటే ఆదాయపు పన్నువాడు.’’
 
‘‘సన్ ఆఫ్ బ్రహ్మమూర్తంటే గర్వంగా ఉంది నాన్నా.’’


‘‘నువ్వు సన్‌వి కాదు, గన్ ఆఫ్ బ్రహ్మమూర్తి. రివాల్వర్‌లో ఇమిడిపోయే ఫిరంగి గుండువి.’’
 - జి.ఆర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement