చెన్నపట్టుణం చిరునామా! | Cennapattunam address! | Sakshi
Sakshi News home page

చెన్నపట్టుణం చిరునామా!

Published Sat, Jan 17 2015 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

చెన్నపట్టుణం చిరునామా!

చెన్నపట్టుణం చిరునామా!

చెన్నై సెంట్రల్ - తెలుగువారి కబుర్లు

మొదట్లో మా తాతగారు కాంచీపురంలో ఒక ఆసామి దగ్గర పనిచేసేవారు. 1911లో కింగ్ జార్జి - 5, చెన్నపట్టణానికి వచ్చినప్పుడు, ఆయనను పట్టు శాలువాతో సత్కరించి మన సంప్రదాయాన్ని  నిలబెట్టాలనుకున్నారు. ఆ శాలువా నేసే బాధ్యత మా తాతగారైన నల్లి చిన్నస్వామి చెట్టికి అప్పచెప్పారు.
 
ఆయన... ఒక ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయమయ్యేలా చేశారు. అరణ్యాన్ని సుందర సంపద వనంలా మార్చారు. కింగ్‌జార్జి - 5 కి పట్టు శాలువా కప్పిన తాతకు మనుమడయ్యారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి దగ్గర నుంచి అందరు గాయనీమణులకు కొంగుబంగారమయ్యారు. అనేక పుస్తకాలు రచించారు... అనేక సంగీత సంస్థలకు విరాళాలిచ్చారు. ఇస్తూనే ఉన్నారు. తాతగారు నల్లి చిన్నస్వామిచెట్టి ప్రారంభించిన నల్లి సిల్క్స్‌ను సుమారు 60 ఏళ్లుగా ఒంటిచేత్తో అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన నల్లి కుప్పుస్వామి వంశీయులు సాక్షాత్తు తెలుగువారు. చెన్నైకి పేరు తీసుకురావడం వెనుక ఉన్న విషయాల గురించి ఆయన చెప్పారు.
 
అతిథిని పట్టు శాలువాతో సత్కరించడం భారతీయుల సంప్రదాయం. చెన్నపట్టణం ఒక కుటుంబం ద్వారా ఆ ఘనత దక్కించుకుంది. మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది. తరతరాలుగా ఎన్నో జంటలను తన ముహూర్తం పట్టు చీరల ద్వారా ఒకటి చేస్తోంది. ఇంతటి ఘన కీర్తికి కారణం కాంచీపుర వాసులైన ‘నల్లి’ కుటుంబీకులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారిగా అడుగుపెట్టి, చెన్నపట్టణానికి సేవ చేసిన తెలుగు కుటుంబం నల్లి వారిది.

ఒకప్పుడు సరస్సులతో నిద్రాణంగా, పేదరికంతో ఉన్న టి.నగర్ కి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. కోట్లాది రూపాయల వ్యాపారం జరిగేంత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. పట్టువస్త్రాలు, రత్నాలు, వజ్రాలు, బంగారు నగల వ్యాపారానికి రాజధానిని చేశారు. చెన్నపట్టణంలో టి.నగర్‌ను అతి పెద్ద వ్యాపార కేంద్రంగా మలచిన ఘనత వారిది. ఇంత ఘనత వెనుక ఉన్న వ్యక్తి డా. నల్లి కుప్పుస్వామి చెట్టి. తాతగారు నల్లి చిన్నస్వామి చెట్టి, తండ్రి నారాయణ స్వామి చెట్టి గార్ల నుంచి ఈ అతి పెద్ద బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని వారిని మరపిస్తూ పట్టు చీరల వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
మొదట్లో మా తాతగారు కాంచీపురంలో ఒక ఆసామి దగ్గర పనిచేసేవారు. 1911లో కింగ్ జార్జి - 5, చెన్నపట్టణానికి వచ్చినప్పుడు, ఆయనను పట్టు శాలువాతో సత్కరించి మన సంప్రదాయాన్ని  నిలబెట్టాలనుకున్నారు. ఆ శాలువా నేసే బాధ్యత మా తాతగారైన నల్లి చిన్నస్వామి చెట్టికి అప్పచెప్పారు. అనుకోకుండా జార్జి పట్టాభిషేకం అదే సమయంలో జరుగుతూండటం బాగా కలిసి వచ్చింది. తాతగారు కొరొనేషన్ బార్డర్‌తో శాలువా నేశారు. అందులో కెమికల్ డై వాడారు. అలా వాడిన మొట్టమొదటి వ్యక్తి మా తాతగారే.

ఆ రంగులను వాడడానికి అందరూ జంకుతున్న సమయంలో మా తాతగారు ఉపయోగించడం ఆ రోజుల్లో సంచలనమే. ఈ రంగుల వల్ల పట్టుకి మెరుపు పోతుందని వారంతా భావించారు. అలా పట్టు రంగంలో విప్లవం తీసుకువచ్చిన ఘనత తాతగారిది. కాంచీపురంలో మెయిన్ రోడ్డు దగ్గర స్వయంగా పట్టుచీరల దుకాణం ప్రారంభించారు. బస్సు దిగిన వారంతా తాతగారి షాపులో పట్టు చీరలు కొనుక్కుని వెళ్లేవారు. కొన్నాళ్ల తర్వాత పట్టు చీరలను చెన్నపట్టణంలో అమ్మడం ప్రారంభించారు. చెన్నపట్టణంలో చీరలకు డిమాండ్ పెరగడంతో, 1928 నాటికి కాంచీపురం విడిచి, చెన్నపట్టణం రావడానికి నిశ్చయించుకున్నారు. చెన్నపట్టణం ముఖద్వారంగా ఉన్న మాంబళం రైల్వేస్టేషన్ దగ్గర శాశ్వతంగా ఒక దుకాణం తీసుకుని, చీరల వ్యాపారం ప్రారంభించారు.
 
1939 లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, చెన్నపట్టణం మీద బాంబు వేస్తారనే వదంతులు వ్యాపించడంతో కొన్ని వందల కుటుంబాలు చెన్నపట్టణం విడిచిపెట్టి వెళ్లిపోయాయి. 21 రోజుల పాటు అందరికీ నల్లి వారి షాపు అందుబాటులో ఉండి, ఆ కష్టకాలంలో ఆదుకోవడంతో, వ్యాపారంలో నల్లి అగ్రస్థానాన నిలిచింది. మా తాతగారు టి నగర్ వచ్చినప్పుడు ఒకసారి ఒక నక్క మా తలుపు తట్టిందట. అటువంటి అరణ్యాన్ని సంపదలవనంగా మార్చిన ఘనత ఆయనది.
 
తాతగారి తరవాత నాన్నగారు నారాయణస్వామి చెట్టి, ఆ తరవాత నేను వారసత్వం అంది పుచ్చుకున్నాను. నేను చెన్నై వచ్చేనాటికి అమ్మ పొత్తిళ్లలో ఉన్నాను. అలా పెరిగి పెద్దవాడనై ఇప్పుడు వ్యాపారంలో నిలబడ్డాను. దేశవిదేశాలలో  మా షోరూమ్‌లు ప్రారంభించాను. అయితే ఇంకా ఏదో చేయాలనే తపన ఉండటంతో, సంగీత సాహిత్యాలకు, సమాజసేవకు కూడా పాటుపడుతున్నాను. విద్యాసంస్థలు స్థాపించాను. పెళ్లిళ్లకు పూర్తిస్థాయి వస్త్రాలు అందించిన మొట్టమొదటి షాపు మాది కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది.

కస్టమర్ల గురించి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఎంతో ఆప్యాయంగా వారి చేత కొనిపించడం నాన్న నారాయణస్వామిచెట్టి దగ్గర నుంచి నేర్చుకున్నాను. నాన్నగారు బ్రాంచీలు ప్రారంభించడానికి సుముఖత చూపలేదు. అయినప్పటికీ కస్టమర్ల విశ్వాసాన్ని దృఢంగా సంపాదించుకున్నారు. 750 కోట్ల టర్నోవర్. నా 15వ ఏట బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన మరుసటిరోజునే నాన్నగారి అకాల మరణంతో నేను నల్లి బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. నాన్నగారు ఏర్పాటుచేసిన మంచి టీమ్ కారణంగా ఏ ఇబ్బందీ లేకుండా వ్యాపారం సాగించగలిగాను. నా మీద ఆర్‌కె మిషన్ స్కూలు ప్రభావం బాగా ఉంది.

సంప్రదాయ పద్ధతుల నుంచి ఆధునిక తరాలకు అనుగుణంగా వస్త్రాలు తయారుచేయించడం ప్రారంభించాను. 1985 వరకు ఒకే బ్రాంచిగా ఉన్న నల్లి, సింగపూర్, అమెరికాలలో కలిపి 30 బ్రాంచీల స్థాయికి ఎదిగింది. 85 సంవత్సరాలుగా నిజాయితీకి మారుపేరుగా నిలబడింది. మాకు ఎందరు పోటీ వచ్చినా మా సంస్థకు మాత్రం డిమాండ్ దగ్గలేదు. నేటికీ నేను ఉదయాన్నే షాపుకి వెళ్లి అకౌంట్స్ చూసుకుంటాను. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడను.
 
మా చిన్నప్పుడు కృష్ణగానసభలో జరిగే కచేరీలు ఇంటి దగ్గర నుంచి వినేవాడి ని. ఎంఎస్‌సుబ్బులక్ష్మి వంటివారికి అభిమానినయ్యాను. పానగల్ పార్క్‌లో రేడియోలో నుంచి వచ్చే వార్తలు వినేవాడిని. ఒకసారి కృష్ణగాన సభ సెక్రటరీ నా దగ్గర 1000 రూపాయల అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను తిరస్కరించాను. సంగీతం పట్ల అది నా బాధ్యత అన్నాను. అలా మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఏటా మార్గళిలో చెన్నైలో జరిగే సంగీత ఉత్సవాలలో యేటా నా వంతుగా ఎంతో కొంత ఇస్తుంటాను. చాలా సభలకు అధ్యక్షుడిగా ఉన్నాను. నాకు టి నగర్ ఇంత పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. నేను టి. నగర్ మీద పుస్తకం రాసి నా ఋణం తీర్చుకున్నాను. ఇంకా ఇతర పుస్తకాలు కూడా రచించాను. విద్యాసంస్థలు స్థాపించాను. నా జీవితం టినగర్‌లోనే ప్రారంభమైంది, ఇక్కడే అభివృద్ధి చెందాను. నన్ను, టి. నగర్‌ని విడివిడిగా చూడలేను. సమయపాలన, క్రమశిక్షణ, నాణ్యత... ఇవి నేను పాటించే సూత్రాలు.
 
సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై
 ఫొటో: వన్నె శ్రీనివాసులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement