చెన్నై : ‘మోసం చేయడానికే ఇక్కడికి వచ్చావా? నీ అంతుచూస్తా. అసలు నువ్వేమైనా చెక్ చేస్తున్నావా? చాలా మంది పాసులు లేకుండానే లోపలికి వెళ్తున్నారు. వీఐపీలు వస్తే వీరిని చూస్తూ అలాగే ఉండిపోవాలా? సీనియర్ ఐపీఎస్ అధికారులు, ముఖ్యమైన మంత్రులు వస్తున్నారు. నీ పని అయిపోయిందిక. నువ్వు ఈరోజే సస్పెండ్ అవుతావు. ఏం జరుగుతుందో చూస్తా. మీకు చాలా పొగరు. మీ ఐజీ ఎక్కడ. ఇక్కడికి రమ్మను. సారీ ఎందుకు చెబుతున్నావు’ అంటూ కాంచీపురం కలెక్టర్ ఓ ఎస్సైపై మండిపడ్డారు. అనుమతి లేకున్నా వీఐపీ లైన్లలో సాధారణ భక్తులను దర్శనానికి ఎలా అనుమతిస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల తీరే ఇంత అంటూ రాష్ట్ర పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురం జిల్లా అత్తివరదరాజ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. కాగా ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉన్న అత్తివరదరాజు స్వామి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ప్రతీ 40 ఏళ్లకు ఒకసారి తెరుస్తారన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యమంత్రులు కూడా ఆలయానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను అదుపుచేయడం అక్కడ ఉన్న సిబ్బందికి కష్టతరంగా మారింది. అదే విధంగా రద్దీ కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ వృద్ధ జంట చాలా సేపటి వరకు వేచి చూసినా దేవుడి దర్శనం కాలేదు. దీంతో అక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేశ్ అనే ఎస్సై(తిరువళ్లూరు జిల్లా) వారిని వీఐపీ లైన్లోకి అనుమతించారు. ఈ విషయాన్ని గమనించిన కాంచీపురం జిల్లా కలెక్టర్ రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమించమని అడిగినప్పటికీ శాంతించక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కలెక్టర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన కలెక్టర్.. ప్రజల క్షేమం కోసమే తాము, పోలీసులు కలిసి పనిచేస్తామని, ఆరోజు రద్దీ వల్ల భక్తులు, వీఐపీలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మాత్రమే అలా అన్నానని వివరణ ఇచ్చారు. కాగా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం కలెక్టర్ ప్రవర్తించిన తీరును విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment