ఆ కోపం... వెన్నెల కిరణం!
అమ్మానాన్నల కోపం అమృతం పొంగులాంటిది. దానిలో అక్కసు, కార్పణ్యం వంటివి ఉండవు. తల్లిదండ్రులు కోపంతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేని పిల్లలు ఘాతకులు. అమ్మానాన్నల కోపం వెనుక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. వారి కోపం వారి స్వార్థ ప్రయోజనాలకోసం కాదు. బిడ్డలు వృద్ధిలోకి రావాలని తప్ప మరో ప్రయోజనం వారికుండదు. అందుకే కోప్పడినా కూడా దానిని ప్రసాదంగా తీసుకోవలసింది ఒక్క అమ్మానాన్నల కోపం విషయంలోనే. అది దిద్దుబాటుకే తప్ప బిడ్డల నాశనం కోరి మాత్రం కాదు.
అందుకే అమ్మకు బిడ్డల విషయంలో ఎంత కోపమొచ్చినా, నోటివెంట ఒక్క అపశకునపు, అమంగళకరమైన మాటలు వారి నోటివెంట రానేరావు. బిడ్డల విషయంలో వారి హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. వారి కోపం అమృతపు చిలకరింతే. లోకంలో ఏతల్లి అయినా, ఏ తండ్రి అయినా బిడ్డల విషయంలో ఒకే ఆర్తితో ఉంటారు, సర్వకాలాల్లో వాళ్ళ క్షేమమే ఆకాంక్షిస్తారు.
అటువంటిది ఈ మధ్య వారి కోపాన్ని వక్రీకరించి చూపి ‘‘మేం పెద్ద వాళ్ళమయ్యాం. మీరెవరు మమ్మల్ని కోప్పడ్డానికి’’ అనే పెడసరపు ధోరణిని సాహసంగా చిత్రీకరించి జనంలోకి వదలడం సమాజానికి చాలా ప్రమాద హేతువు.
ఎంత వయసొచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లే. అమ్మ మాటల్లో తప్పుపట్టడానికి, ఆ మాటల్లోని అధికారాన్ని ప్రశ్చించడానికి బిడ్డలకు అర్హత , అధికారం, హక్కు లేనే లేవు. ఆమె అంతటి దైవస్వరూపం కాబట్టే ఉద్ధరణ హేతువుగా ఆమెకు తొలి నమస్కారంచేయించింది వేదం. అటువంటి అమ్మలు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. కాబట్టి తల్లిని సంతోష పెట్టడం, ప్రేమతో, గౌరవంతో పూజించుకోవడం కన్నామించిన దేవతార్చన లేదు. జీవితంలో అభ్యున్నతిని పొందడానికి అంతకన్నా మార్గంలేదు.
యశోదా దేవి కోరిక మేరకు ఆమెకు కుమారుడిగా వచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు ఎక్కడుంటాడో వకుళమాత కూడా అక్కడే ఉంటుంది. అమ్మ ఎప్పుడూ బిడ్డ దగ్గరే ఉండాలి. అమ్మ మురిసిపోవాలి. ఆ అమ్మ తన చేతి అన్నం తింటాడని వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మకు పరబ్రహ్మం అంతటివాడు కట్టుబడిపోయాడు. రాముడు కట్టుబడిపోయాడు. ’కౌసల్యా సుప్రజారామా, పూర్వాసంధ్యా ప్రవర్తతే...’’ అంటే చాలు చటుక్కున లేచి కూర్చుంటున్నాడు. అమ్మ అన్నమాట అంత గొప్పది. మళ్ళీ ఆ అమ్మ వైభవం ప్రకాశించి అమ్మని పరమ పూజనీయంగా చూసుకునే రోజులు రావాలి. వృద్ధాశ్రమాల్లోకి అమ్మలని పంపడమన్నమాటే లేకుండా బిడ్డల దగ్గరే అమ్మలు, అమ్మల దగ్గరే బిడ్డలు ఉండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. అదే ఆ బిడ్డలకు, ఆ కుటుంబానికి, సమాజానికి కూడా శ్రేయస్కరం.
(వచ్చే భాగం నుండి పితృదేవోభవ...) - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు