వీళ్లకు క్యారెక్టర్‌ ఉంది | Character Makeup Makeover in movies | Sakshi
Sakshi News home page

వీళ్లకు క్యారెక్టర్‌ ఉంది

Published Sat, Jun 2 2018 12:04 AM | Last Updated on Sat, Jun 2 2018 8:35 AM

Character Makeup Makeover in movies - Sakshi

ఒక్కర్నీ గుర్తుపట్టలేం!అందుకేనేమో అంత గుర్తింపు వచ్చింది.మేకప్‌ మేకోవర్‌..!ఇదో పెద్ద గేమ్‌. మనకు మన హీరో కనపడడు. రాసినవాళ్ల క్యారెక్టర్‌ కనబడుతుంది. మనల్ని మైమరిపించడానికిఈ గోల్డెన్‌ పాత్రలు సిల్వర్‌పూతలు పూయించుకుంటాయి. అదేనండీ.. సిల్వర్‌స్క్రీన్‌ పూతలు.మేకప్‌మేన్‌లు, టెక్నీషియన్‌లు..సైంటిస్టులు.. వీళ్లందరి ‘కళ’పూతమనకు అతుక్కుంటుంది.. మరచిపోలేని క్యారెక్టర్‌తో!!

సాఫ్ట్‌గా కనిపించే కుర్రాడు... వైల్డ్‌గా మారిపోయాడు! తెల్లని మేని ఛాయతో తళుకులీనే భామ నీలంలో నిగనిగలాడింది! నెత్తిన కొమ్ములొచ్చిన వ్యక్తి ఒకరైతే... ఒళ్లంతా దద్దుర్లతో ఇంకొకరు.. అంతా మాయ... మేకప్‌ మాయ...

బఫూన్‌ విలన్‌
చాక్లెట్‌ బాయ్‌ అని కొంతమంది కుర్రాళ్లను అంటుంటారు. అంటే ఏంటి? ఎప్పుడూ చేతిలో చాక్లెట్‌ ఉంటుందనా? ఊహూ.. ‘చాలా హ్యాండ్‌సమ్‌’గా ఉండేవాళ్లను అలా అంటుంటారు. ఫర్‌ ఎగ్జాంపుల్‌ హాలీవుడ్‌ యంగ్‌ స్టార్స్‌లో ‘బిల్‌ స్కార్స్‌గార్డ్‌’ అలాంటివాడే. ఎవరైనా ఇతన్ని హీరోగానే ఊహించుకోవాలే తప్ప ‘బఫూన్‌’లా ఊహించుకోవడం కష్టం. కానీ ఈ చాక్లెట్‌ బాయ్‌ గతేడాది రిలీజైన ‘ఇట్‌’ సినిమాలో ‘పెన్నీవైస్‌ ది డ్యాన్సింగ్‌ క్లౌన్‌’ క్యారెక్టర్‌ చేశాడు. బఫూన్‌లా కనిపించే విలన్‌ అన్నమాట. ఈ క్యారెక్టర్‌లోకి మారడం కోసం కేజీల కేజీల ఫౌండేషన్‌ పూసుకోవాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలు మేకప్‌కి పట్టేది. బుగ్గలకు ఎర్ర చార గీతలు, సాగిపోయిన పెదాలు, రంగు మారిన పళ్లు, నీరు లేక ఎండిపోయిన భూమిలా నుదురు మీద పగుళ్లు... స్కార్స్‌ భయంకరంగా మారిపోయాడు. సినిమాలో బాగా భయపెట్టాడు. తనకు ఈ మేకప్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఓ భయంకరమైన అనుభవం అంటాడు స్కార్స్‌. కానీ ఈ అనుభవం బాగుందని కూడా అంటాడు. 

ఒళ్లంతా పెయింట్‌తో...
హాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జెన్నీఫర్‌ లారెన్స్‌ పేషెన్స్‌ని టెస్ట్‌ చేసిన సినిమా ‘ఎక్స్‌–మెన్‌: ఫస్ట్‌ క్లాస్‌’. రాబోయే కాలంలో ఎలాంటి శక్తుల వల్ల మానవులకు ప్రమాదం వాటిల్లుతుందో ముందే గ్రహించి, తొమ్మిది శక్తుల గల వ్యక్తులతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తుని ఎలా రూపకల్పన చేస్తారు? అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. ఆ తొమ్మిది శక్తుల్లో మిస్టిక్‌ ఒకటి. అది జెన్నీఫర్‌ చేశారు. పసుపు రంగు కళ్లు, కొబ్బరి పీచుని తలపించే జుత్తు, నీలం రంగు ఒళ్లు.. మిస్టిక్‌గా మారడానికి జెన్నీఫర్‌కి 8 గంటలు పట్టింది. ఒళ్లంతా బ్లూ కలర్‌ పెయింట్‌ చేయించుకున్నారు. మేకప్‌ తీసేశాక ఒంటి మీద వచ్చిన ‘ర్యాషెస్‌’ ఈ సినిమా మిగిల్చిన తీయని గుర్తు అంటారు జెన్నీఫర్‌. అయితే ఇదే సినిమా సిరీస్‌లో వచ్చిన తదుపరి చిత్రాలు ‘ఎక్స్‌–మెన్‌: డేస్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పాస్ట్‌’, ‘ఎక్స్‌–మెన్‌: అపోకలిప్స్‌’లకు మాత్రం ఆమె అంతలా కష్టపడలేదు. అప్పటికి బ్లూ కలర్‌ బాడీ సూట్‌ రావడంతో పెయింటింగ్‌ చేయించుకునే బాధ తప్పింది. ‘బతికిపోయాను రా బాబూ’ అని జెన్నీఫర్‌ అనుకునే ఉంటారు.

బ్లూ టు గ్రీన్‌
గమోరా.. ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ’లో  జోయీ సాల్డానా చేసిన పాత్ర ఇది. ఈ పాత్ర కోసం కంప్యూటర్‌ గ్రాఫిక్స్, పెర్ఫార్మెన్స్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వాడదాం అనుకున్న దర్శక–నిర్మాతలతో ‘నో ప్రాబ్లమ్‌.. మేకప్‌కే వెళ్దాం’ అని అభయమిచ్చారట. ఒంటి నిండా గ్రీన్‌ కలర్‌ పూసుకున్నారామె. విశేషం ఏంటంటే గ్రీన్‌ కలర్‌ కంటే లోపల మరో రెండు మూడు లేయర్స్‌ మేకప్‌ ఉండేదట. శరీరం మొత్తం పచ్చగా మారటానికి సుమారు మూడు గంటలకు పైనే పట్టేదట. బుగ్గలు ఉబ్బెత్తుగా, నుదురు కొంచెం పెద్దదిగా కనిపించడం కోసం సిలికాన్‌ ప్రోస్థెటిక్స్‌ వాడారు. అయినా ఇలా రంగుల్లో మునిగిపోవడం జోయీకి కొత్తేం కాదు. ఆల్రెడీ ‘అవతార్‌’లో నీలంగా నెయిత్రీలా మారిపోయిన విషయం తెలిసిందే.

అరగుండు అయినా ఓకే..
నెబూలా పైశాచికత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌. అసూయ, ద్వేషం, పగ... వీటిని, నెబూలాని వేరు చేసి చూడలేం. అందుకే ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ’ సినిమాలో నెబూలా క్యారెక్టర్‌ని చాలెంజ్‌గా తీసుకున్నారు కరేన్‌ గిల్లన్‌. ఈ పాత్ర కోసం పొడవాటి తన జుట్టుని త్యాగం చేశారు. పోతే పోయింది.. పాత్రకన్నా ఎక్కువా? అనుకున్నారు. ఈ క్యారెక్టర్‌ కోసం కళ్లకు 22 మిల్లీమీటర్‌ కాంటాక్ట్‌ లెన్సులు వాడారు. ‘గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ’ పార్ట్‌ 2 మాత్రం కరేన్‌కి కొంచెం రిలీఫ్‌ ఇచ్చింది. టెక్నాలజీ త్వరగా డెవలప్‌ అవుతోంది కాబట్టి.. మేకప్‌కి 2 గంటలు కేటాయిస్తే సరిపోయింది. ఫస్ట్‌ పార్ట్‌కి గుండు చేయించుకున్న కరేన్‌ సెకండ్‌ పార్ట్‌కి అర గుండు చేయించుకున్నారు.
 
సూట్‌ అంత సులువుగా రాదు
బ్లాక్‌ పాంథర్‌ కామిక్స్‌ పరిచయం లేని వాళ్లు ఎవరైనా సడెన్‌గా ఎరిక్‌ కిల్‌మాంగర్‌ పాత్రను చూస్తే గగుర్పాటుకు గురి కావొచ్చు. ఒళ్లంతా దద్దుర్లతో కొంచెం జుగుప్సగా కనిపిస్తాడు. తాను చంపిన ఒక్కొక్కరి గుర్తుగా ఆ మార్క్‌ని పెట్టుకున్నారంటే అతనెంత క్రూయలో ఈపాటికి అర్థం అయిపోయుంటుంది. ‘బ్లాక్‌ పాంథర్‌’లో మైఖేల్‌ బి.జోర్డాన్‌ ఈ పాత్ర చేశారు. దీని కోసం  స్పెషల్‌ సూట్‌ తయారు చేయించారు. ఆ సూట్‌ వేసుకోవడం, తీయడం అంత సులువు కాదు. సూట్‌ ఒంటికి అతుక్కుపోవడానికి వాడిన గమ్‌ ఓ పట్టాన ఒంటి నుంచి సూట్‌ని వేరు చేయనిచ్చేది కాదట. రిమూవ్‌ చేసిన తర్వాత ఒంటికి అంటుకుపోయిన జిగురు పోవడానికి కాసేపు ఆవిరి తొట్టెలో కూర్చునేవారట. 

ఏదైనా జిమ్‌ క్యారీ చేసేస్తా
కారెక్టర్‌ ఏదైనా, ఆ క్యారెక్టర్‌ది ఎలాంటి బాడీ లాంగ్వేజ్‌ అయినా సరే ఈజీగా క్యారీ చేస్తా అంటారు జిమ్‌ క్యారీ.  అలాంటి ప్రయోగమే చేశారు ‘హౌ ది గ్రించ్‌ స్టోల్‌ క్రిస్మస్‌’ సినిమా కోసం. అందులో ఆయన పచ్చని రంగులో ఉన్న ఓ వింత జంతువు రూపంలో కనిపిస్తారు. ఈ పాత్రలా మారడానికి  సుమారు మూడు గంటలు పట్టేదట.  కదలకుండా మూడు గంటలు పాటు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేదట. విశేషం ఏంటంటే సినిమాలో మేకప్‌ కోసమే జిమ్‌ కదలకుండా ఖాళీగా కూర్చున్న సమయాన్ని లెక్కేస్తే సుమారు 92 రోజులట. 

చిత్రాతిచిత్రంగా...
ఆ ముఖం ఎరుపు, నలుపు రంగుల డిజైన్‌తో విచిత్రంగా ఉంటుంది. కొమ్ములు తిరిగిన మొనగాడు డార్త్‌ మౌల్‌. విచిత్రమైన కాంటాక్స్‌ లెన్స్‌తో చిత్రాతిచిత్రంగా కనిపిస్తాడు. ‘స్టార్‌ వార్స్‌: ఎపిసోడ్‌ 1 – థి ఫ్యాంథమ్‌ మెనేస్‌’ సినిమాలోని ఈ క్యారెక్టర్‌ రే పార్క్‌కి పెద్ద సవాల్‌. నటించడానికి కాదు.. మేకప్‌ ఓ పెద్ద చాలెంజ్‌. నిజానికి ఈ పాత్ర రూపం ఎలా ఉండాలనే విషయంపై యూనిట్‌తర్జన భర్జనలు పడిందట. ఫైనల్లీ ఒక పేపర్‌ మీద ఇంక్‌ జల్లి ఫోల్డ్‌ చేసి, తీసి చూసినప్పుడు డిజైన్‌ అటూ ఇటూ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి.. డార్త్‌ ముఖం అలానే ఉండాలనుకున్నారట. లెఫ్ట్, రైట్‌.. ఎరుపు, నలుపు డిజైన్‌తో ముఖాన్ని డిజైన్‌ చేశారు. 

వైల్డ్‌ ఏలియన్‌.. బోలెడన్ని లేయర్లు
ఏలియన్స్‌ ఎలా ఉంటారు? విచిత్రంగా కనిపిస్తారు. ఒక మనిషి ఏలియన్‌లా మారాలంటే మామూలు విషయం కాదు. మూడు నాలుగు గంటలు ఈజీగా పట్టేస్తుంది. ‘స్టార్‌ ట్రెక్‌ బియాండ్‌’లో చేసిన పవర్‌ఫుల్‌ ఏలియన్‌ వార్‌ లార్డ్‌ క్యారెక్టర్‌ కోసం ఇడ్రిస్‌ ఎల్బా ఏలియన్‌గా మారారు. ఒక లేయర్‌.. ఆ పైన ఇంకో లేయర్‌.. ఇంకోటి... మరోటి.. ఇలా బాడీ మొత్తం మేకప్‌ లేయర్లే. నిజానికి ఇతగాడికి ‘క్లాస్ట్రోఫోబియా’ ఉంది. అంటే.. నిర్భంధిత పరిస్థితుల్లో ఉండలేకపోవడం. ఇక్కడ లేయర్ల చాటున నిర్భంధ స్థితిలో శరీరం ఉంటే.. అది ఏమాత్రం గుర్తుకు రానివ్వకుండా కెమెరా ముందు నటించడంలో ఇడ్రిస్‌ సక్సెస్‌ అయ్యారు. తన ఫోబియాని మరచిపోయేలా చేసిన ఘనత మేకప్‌దే అంటారు ఇడ్రిస్‌.

మేమేం తక్కువ కాదు
గుర్తు పట్టలేనంతగా మారిపోవడం హాలీవుడ్‌ నటులకే కాదు.. ఇండియన్‌ స్టార్స్‌కి కూడా సాధ్యమే. ‘భీష్మ’లో ఎన్టీఆర్‌ గురించి చెప్పుకున్నాం. భారతీయ నటుల్లో ముఖ్యంగా చెప్పాల్సింది కమలహాసన్‌ గురించి. ప్రయోగాలకు చిరునామా ఆయన. ‘ఇంద్రుడు–చంద్రుడు’ లో ఎత్తు పళ్లు, బాన పొట్టతో, ‘కల్యాణ రామన్‌’లో ఎత్తు పళ్లతో, ‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా, ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, ‘భారతీయుడు’లో వృద్ధ గెటప్‌లో... ఇలా మేకప్‌తో పూర్తిగా మారిపోయిన పాత్రలెన్నో కమల్‌ చేశారు. ఆయన చేసినన్ని ప్రయోగాలు రజనీకాంత్‌ చేయకపోయినా ‘రోబో’ సినిమా కోసం ఆయన మేకప్‌కి చాలా గంటలు వెచ్చించాల్సి వచ్చింది. చిట్టి క్యారెక్టర్‌ కోసం ప్రోస్థెటిక్‌ మేకప్‌ చేయించారు. ఈ సినిమా సీక్వెల్‌ ‘2.0’కి కూడా ఎక్కువగా మేకప్‌ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి జనరేషన్‌లో విక్రమ్‌ని చెప్పుకోవచ్చు. ‘కాశీ’లో అంధుడిగా, ‘శివపుత్రుడు’లో లోకం తెలియని అమాయకుడిగా... ఇవన్నీ ఒక ఎల్తైతే ‘ఐ’లో చేసిన పాత్ర మరో ఎత్తు అవుతుంది. ఆ సినిమాలో హెవీ ప్రోస్థెటిక్‌ మేకప్‌తో విచిత్రమైన ఆకారంలో కనిపించి, భేష్‌ అనిపించుకున్నారు విక్రమ్‌. ‘గజిని’ ఫేమ్‌ సూర్య అయితే ‘పేరళగన్‌’ అనే తమిళ సినిమాలో గూని ఉన్న వ్యక్తిగా మౌల్డ్‌ అయ్యారు. ‘24’లో విలనీ షేడ్‌ ఉన్న పాత్ర గెటప్‌ కూడా డిఫరెంట్‌గా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇక, స్లిమ్‌గా ఉండే ‘అల్లరి’ నరేశ్‌ బండ బాబులా కనిపించిన చిత్రం ‘లడ్డూ బాబు’. క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో ‘మగధీర’లో రావు రమేశ్‌ చేసిన మాంత్రికుడి పాత్ర కూడా చెప్పుకోదగ్గదే.. ‘బాహుబలి’లో ప్రభాకర్‌ చేసిన కాలకేయుడు క్యారెక్టర్‌ మేకప్‌నీ విస్మరించలేం. రీసెంట్‌గా రిలీజైన ‘మహానటి’లో కీర్తీ సురేష్‌ ప్రోస్థెటిక్‌ మేకప్‌ చేసుకోవాల్సి వచ్చింది. సావిత్రి బాగా లావైన తర్వాత వచ్చే సీన్స్‌కి కీర్తీ ఈ మేకప్‌ చేసుకున్నారు. బాలీవుడ్‌ గురించి చెప్పాలంటే... ‘పా’ మూవీలో ప్రొజేరియా వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడిగా అమితాబ్‌ నటించారు. ఆ సినిమాలో అమితాబ్‌ 12 ఏళ్ల పిల్లవాడైనా.. చూడ్డానికి ఐదింతలు ఎక్కువ వయసున్న వ్యక్తిలా కనిపిస్తాడు. తక్కువ శారీరక  ఎదుగుదల, వృద్ధ లక్షణాలు కనిపించడం కోసం అమితాబ్‌కి ప్రోస్థెటిక్‌ మేకప్‌ చేశారు. మరో హిందీ నటుడు అక్షయ్‌ కుమార్‌ ‘2.0’లో క్రౌమేన్‌గా కనిపించడం కోసం తీసుకున్న రిస్క్‌ తక్కువేం కాదు. ఈ సినిమాలో అతను పక్షి ప్రేమికుడు. అందుకని గెటప్‌ కూడా పక్షిని పోలినట్లే ఉంటుంది. ఈ గెటప్‌ కోసం మూడు నాలుగు గంటలు మేకప్‌కి కేటాయించారు. ఇలా ఇండియన్‌ మూవీస్‌లో ప్రయోగాలు చేస్తున్న తారలు చాలామందే ఉన్నారు. మంచి క్యారెక్టర్‌ కుదిరితే ‘మేమేం తక్కువ కాదు..’ అంటున్నారు.

ఎన్టీఆర్‌ భీష్మ
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు... ఇలా పౌరాణిక పాత్రలతో పాటు సాంఘిక పాత్రలను అలవోకగా చేసిన నటుడు నందమూరి తారక రామారావు. సాంఘిక చిత్రాల్లో వేసిన మారువేషాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. అయితే మారువేషంలో ఉన్నది ఎన్టీఆర్‌ అనీ, పౌరాణిక గెటప్స్‌లో ఉన్నప్పుడు అది ఎన్టీఆరే అని స్పష్టంగా తెలిసిపోయేది. ‘భీష్మ’ సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ సినిమాలో భీష్మ గెటప్‌లో ఉన్నది ఎన్టీఆర్‌ అని అప్పట్లో ఎవరూ గుర్తు పట్టలేకపోయారన్నది అక్షర సత్యం.. అది మేకప్‌ మహత్యం. నిజానికి తెరపై కనిపించే నటుల గురించి చెప్పుకుంటాం కానీ, వారలా కనిపించడానికి తెరవెనక కృషి చేసే మేకప్‌ నిపుణులను కూడా అభినందించాల్సిందే. 
– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement