అవకాశం మనిషిని అదృష్టవంతుడిని చేస్తుంది. అలాంటి అవకాశాన్ని వెదుక్కోవడం కాదు.. అవకాశాలను సృష్టించుకోవాలి.. అని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరు వివేక వంతులు ఈ వాక్యాన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకడు చార్లిమెక్ డొనాల్. ఎంటర్‌టైన్ మెంట్ కోసం చేసే పని నుంచి ఈ యువకుడు మిలియనీర్‌గా ఎదిగిన విధానంబెట్టిదనిన...
యూట్యూబ్.. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొంటే.. అరుదైన వీడియోలు చూడొచ్చు, అవసరమైన సినిమాలను చూడొచ్చు... కావాల్సినంత వినోదం పొందవచ్చు. అందుకే చాలా మంది యూ ట్యూబ్‌ను ఇష్టపడుతుంటారు. అయితే చార్లీకి కూడా యూట్యూబ్ అంటే ఇష్టమే.. వీడియోలను చూడటానికో.. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికో కాదు.. వీడియోలను అప్‌లోడ్ చేయడానికి! దాని ద్వారా వచ్చే గుర్తింపు కోసం, ఫలితంగా వచ్చే డబ్బు కోసం యూ ట్యూబ్‌ను ఇష్టపడ్డాడు చార్లీ. ఇంగ్లండ్‌కు చెందిన చార్లీ ప్రస్తుత వయసు 23 సంవత్సరాలు.
రెండు సంవత్సరాల కిందటి వరకూ చార్లీ అంటే ఒక సాధారణ యువకుడు. ఇప్పుడు అసాధారణ యువకుడు. యూత్‌లో యూట్యూబ్ ఫీవర్‌ను తన పవర్‌గా మార్చుకొన్నవాడితను. charlieissocoolike అనే యూట్యూబ్ చానల్ ద్వారా పేరు పొందినవాడు చార్లీ. ప్రస్తుతం ఈ యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య దాదాపు 20 లక్షలు! ఈ చానల్‌లో చార్లీ పోస్టు చేసే ఏ వీడియోనైనా వారందరినీ చేరుతుంది.
2007 చార్లీ చానల్ తొలిసారి యూట్యూబ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. తొలి రోజునుంచే చార్లీ చానల్ పాపులర్ అయ్యింది. యూట్యూబ్ వ్యూయర్స్ ఫేవరెట్ అయ్యింది. యూట్యూబ్‌లో పాపులర్ కావడం ఎలా అనే వీడియోను తొలిగా పోస్టుగా పెట్టాడు చార్లీ. ఈ వీడియోను యూట్యూబ్ సైట్ వారు మెచ్చి దాన్ని.. హోమ్‌పేజ్‌లో డిస్‌ప్లే చేశారు. దీంతో చార్లీ చానల్‌కు మంచి క్రేజ్‌వచ్చింది. రెండో రోజు కల్ల్లా చార్లీ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య నాలుగువేలకు పెరిగింది. సరదాగా కంపోజ్ చేసి, అప్‌లోడ్ చేసిన వీడియోకు అంత ఆదరణ దక్కేసరికి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు చార్లీ. దాన్ని అంతటిలో వదలకూడదని.. కొంచెం సీరియస్‌గా చానల్ పని మీద దృష్టిపెట్టాడు.
యూట్యూబ్‌లో పోస్టు చేసే వీడియోలను వీడియోబ్లాగ్‌పోస్ట్స్ అని అంటారు. దీన్నే షార్ట్‌ఫామ్‌లో వ్లోగ్స్ అని కూడా అంటారు. ఇలాంటి వ్లోగ్స్‌తో యూట్యూబ్‌లో చార్లీ పేరు మార్మోగిపోయింది. ఇతడి చానల్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. సొంత క్రియేటివిటీని ఉపయోగించి తనకు వీలున్నప్పుడల్లా కూర్చిన వీడియోలను చార్లీ అప్‌లోడ్ చేసేవాడు. 2008 ప్రారంభం కల్లా చార్లీ నుంచి రెగ్యులర్‌గా అప్‌లోడ్స్ అందుకునే వారి సంఖ్య 25,000కు చేరింది.
యూట్యూబ్‌లో లభించిన పాపులారిటినీ కమర్షియల్‌గా మార్చుకోవడం గురించి ప్లాన్ వేసిన చార్లీ సమాజం గురించి వీడియో రూపంలోని విశ్లేషణ ప్రారంభించాడు. యూత్‌ను టార్గెట్‌గా చేసుకొని ‘ఫైవ్ ఆసమ్ గర్ల్స్,’‘ఫైవ్ ఆసమ్ బాయ్స్’ అనే విశ్లేషణాత్మకమైన వీడియోలను అప్‌లోడ్ చే శాడు. వాటికి మంచి గుర్తింపు వచ్చింది. చార్లీ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య లక్షల్లోకి వచ్చింది. 2011లో పదిలక్షల మార్కును, 2013 మేలో ఇరవై లక్షల మార్కును రీచ్ అయ్యింది చార్లీ యూట్యూబ్ చానల్. ఇప్పుడు చార్లీచానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మిలియన్లలోకి చేరింది.
అదే విధంగా అతడి ఆదాయం కూడా! యూట్యూబ్‌లో ఒక చానల్ పోస్ట్‌అయిన వీడియోల మధ్య డిస్‌ప్లే, ప్లే అయ్యే అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా వచ్చే సొమ్ములో కొంత మొత్తాన్ని ఆ చానల్ యజమానికి ఇస్తుంది గూగుల్. యూట్యూబ్ చానల్‌లోకి ఒరిజినల్, ఓన్ వీడియోలను అప్ లోడ్ చేసే వారికి ఇదే ఆదాయమార్గం. గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ ద్వారా డబ్బు వస్తుంది. ఈ మార్గం ద్వారా చార్లీకి గత రెండు సంవత్సరాల నుంచి అనునిత్యం భారీస్థాయిలో డబ్బు వచ్చి పడుతూనే ఉంది. ఇతడు పోస్టు చేసిన వీడియోను కనీసం 20 లక్షలమంది క్లిక్ చేస్తారు.
అన్నే సార్లు యాడ్స్ కూడా ప్లే అవుతాయి. వాటి ఫలితంగా యూట్యూబ్‌కు డబ్బు వస్తుంది. అందులోంచి గూగుల్ చార్లీకి వాటా ఇస్తుంది. ఈ విధంగా యూట్యూబ్ చానల్ ద్వారా మిలియనీర్ అయిన వారిలో చార్లీ ఒకడు. చార్లీకి ప్రత్యేకంగా టీమ్ అంటూ ఏమీ లేదు. చార్లీ, అతడి సృజనాత్మకత.. అంతే. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా అవకాశాన్ని సృష్టించుకొన్నాడు, దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొన్నాడు. చార్లీకే కాదు ఇప్పుడు యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉంది కదా మరి..!
చార్లీ చానల్‌తో... అయ్యాడు మిలియనీర్!
Published Sun, Oct 20 2013 11:25 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
Advertisement
Advertisement