డాడీ కావాలంటే... ఇగో వద్దు! | Children do not think that males are a problem for a wife | Sakshi
Sakshi News home page

డాడీ కావాలంటే... ఇగో వద్దు!

Published Thu, Feb 7 2019 1:24 AM | Last Updated on Thu, Feb 7 2019 1:24 AM

Children do not think that males are a problem for a wife - Sakshi

పిల్లలు పుట్టలేదంటే మగవాళ్లు అదేదో భార్యకు ఉండే సమస్య అనుకుంటారు.భార్యకు పరీక్షలు చేయించాలంటే అది చాలా ఖర్చుతో కూడిన పని. అదే మగాడి ప్రాథమిక పరీక్షలు ?రూ. 500/–లకు మించవు. అలాంటప్పుడు ‘ఇగో’ మాని ‘డాడీ’ అయితే..హ్యాపీ కదా!...చాలా చాలా హ్యాపీ కదా!!

సంతానలేమికి కారణాలు మహిళల్లో ఎన్ని ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయి. నిజంగా చెప్పుకోవాలంటే సంతానలేమి అనే సమస్యలో తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. పురుషుల్లో  కారణాలు కనుగొనడం చాలా సులువు. అది తక్కువ ఖర్చుతోనే జరిగిపోతుంది. మహిళల్లో సమస్యల కోసం మొదటే వెళ్తే, వాటికి సంబంధించిన పరీక్షల ఖర్చులు పురుషుల పరీక్షలతో పోలిస్తే చాలా ఎక్కువే. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో ఏమీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం వృథా అవుతాయి. అందుకే తొలుత పురుషులు పరీక్ష చేయించుకోవడం మేలు. 

కారణాలను కనుగొనడం యాండ్రాలజిస్ట్‌ల పని 
పురుషుల్లోని లైంగికతకు సంబంధించిన అంశాలనూ, సంతానలేమికి గల కారణాలను పరిష్కరించే వైద్య విభాగానికి యాండ్రాలజీ అని పేరు. మొదట ఈ పేరును దుర్వినియోగం చేస్తూ చాలామంది నకిలీ డాక్టర్లే సమాజంలో చెలామణీ అవుతున్నారు. అందుకే ముందుగా క్వాలిఫైడ్‌ యాండ్రాలజిస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇక యాండ్రాలజిస్ట్‌ అని పిలిచే ఆ డాక్టర్‌ కూడా తన రోగిని భయపెట్టకుండా, ఆందోళనకు గురిచేయకుండా సాంత్వన పరుస్తూ చికిత్స చేస్తారు. ఏ పరీక్షలూ చేయకుండానే ‘మీలో ఏదో లోపం ఉందం’టూ ఒక డాక్టర్‌ చెబితే దాన్ని నమ్మడం అంత సబబు కాదు. ఆందోళన చెందకుండా రెండో ఒపీనియన్‌కు మరో డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి. 

మాటల తర్వాతి దశ... భౌతిక పరీక్ష 
పురుషులతో మాట్లాడటం ముగిశాక తర్వాతి దశ... ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌ అని పిలిచే భౌతిక అంశాల పరీక్షలు. ఇందులో భాగంగా పేషెంట్‌లోని సెకండరీ సెక్సువల్‌ క్యారెక్టర్స్‌ సరిగానే ఉన్నాయా అని చూడటం. సెకండరీ సెక్సువల్‌ క్యారెక్టర్స్‌ అంటే... అతడిలో మీసాలు గడ్డాలు బాగానే పెరిగి ఉన్నాయా, అతడికి ప్రైవేట్‌ పార్ట్స్‌ దగ్గర వెంట్రుకలు బాగానే వచ్చాయా, పురుషాంగం పరిమాణం ఉండాల్సినంతగా ఉందా, వృషణాల సైజ్‌ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్‌ ఎగ్జామినేషన్స్‌లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాకే ఆ తర్వాత పరీక్షల దశకు వెళ్లాలి. కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సాధారణ ఫిజికల్‌ ఎగ్జామినేషన్స్‌తోనే కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వృషణాల సైజు చాలా చిన్నగా ఉన్నప్పుడూ, వ్యాస్‌ సరిగా లేకపోయినా, పెద్ద పెద్ద పరీక్షలు చేయించినా లాభమే ఉండదు. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే... అప్పుడు కేవలం 200 నుంచి 500 రూపాయలు మాత్రమే ఉండే మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. 

ఇప్పుడు చేయించాల్సింది వీర్యపరీక్ష... 
వీర్యపరీక్షలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు తెలుస్తాయి. ఈ వీర్యపరీక్ష చేయించడానికి ముందుగా కనీసం మూడు రోజుల పాటు సెక్స్‌ లేదా హస్తప్రయోగం చేయకూడదు. ఆ పరీక్ష చేసే ల్యాబ్‌ టెక్నీషియన్‌ కూడ మంచి తర్ఫీదు పొంది ఉండాలి. ఒక్కోసారి ఒక వీర్యపరీక్షకూ మరో వీర్యపరీక్షకూ కూడా పొంతన ఉండకపోవచ్చు. అందుకే మొదటి పరీక్షలోనే వీర్యకణాల గురించి ఏదైనా ప్రతికూల ఫలితం కనిపిస్తే కుంగిపోకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోతుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు బాగా వస్తాయి.

ఇలా ఉండటం మన మామూలు ఆరోగ్యానికీ అవసరం. మనం ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నప్పుడు వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చాలా బాగుంటాయి. సిగరెట్‌ స్మోకింగ్, ఆల్కహాల్‌ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్ర ఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్‌ ఆ దంపతుల సెక్స్‌ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే  ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. 

తొలి అవగాహన దంపతులదే... 
సంతానలేమితో బాధపడే దంపతుల్లో చాలామందికి సెక్స్‌ పట్ల సరైన అవగాహన ఉండదు. సంతానం కోసం పరితపించే దంపతుల్లో చాలామందికి సంతానం కోసం సెక్స్‌లో ఎప్పుడు పాల్గొనాలో కూడా తెలియదంటే అది అతిశయోక్తి కాదు. సాధారణంగా మహిళకు రుతుస్రావం వచ్చిన 11వ రోజు నుంచి 18వ రోజు వరకు ఏదో ఒక రోజున అండం విడుదలయి ఉంటుంది. అందుకే ఆయా రోజుల్లో దంపతులు తప్పనిసరిగా కలవాలి.  కలయిక ముగిసిన వెంటనే మహిళ పైకి లేవకూడదు, శుభ్రపరచుకోకూడదు. మూత్రవిసర్జన చేయకూడదు. శుక్రకణాలతో కూడిన వీర్యం యోనిలోకి పూర్తిగా వెళ్లేలా చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఒకవేళ మహిళల్లో అర్జెంటుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వచ్చేలాంటి మూత్రసమస్య ఏదైనా ఉంటే అలాంటి మహిళలు సెక్స్‌కు ముందే మూత్రవిసర్జనకు వెళ్లిరావడం మంచిది. సెక్స్‌ అయ్యాక వీర్యం వెంటనే బయటకు రాకుండా ఉండేందుకు గాను మహిళలు తమ ఎడమవైపునకు లేదా కుడివైపునకు ఒరిగిపోయి పూర్తిగా ముడుచుకుపోయినట్లుగా  కాసేపు పడుకొని ఉండటం మంచిది.  అది శుక్రకణాలన్నీ బయటకు రాకుండా లోపలివైపునకు వెళ్లేందుకు దోహదపడుతుంది. పురుషుడికి స్ఖలనం కాగానే... వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తుందని అపోహ పడే దంపతులూ చాలామందే ఉంటారు. నిజానికి వీర్యానికి సంబంధించి ఎంతో కొంత ద్రవం బయటకు వస్తుంది.

కానీ వీర్యంలో ఉండే ద్రవమంతా వీర్యకణాలు కాదు. ఇంత ద్రవరాశిలో మొత్తం వీర్యకణాల సంఖ్య దాదాపుగా 60 లక్షల నుంచి 1.20 కోట్ల వరకు ఉంటుంది. వీర్యం ద్రవం కాస్తంత బయటకు వచ్చినా దంపతులు ఆందోళన పడకూడదు. ఎందుకంటే... వీర్యం యోనిలోకి ప్రవేశించగానే... శుక్రకణాలన్నీ తమ ఇన్‌స్టింక్ట్‌ మేరకు అండంతో కలిసేందుకు ముందుకు వెళ్తూ ఉంటాయి. నిజానికి ఈ అంశాలన్నింటినీ యూరాలజిస్ట్‌/యాండ్రాలజిస్ట్‌ దంపతులకు వివరిస్తూ వారిలో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన పెంచేలా కౌన్సెలింగ్‌ రూపంలో వారికి తెలియజేయాలి. అప్పుడు వారిలో ఉండే ఆందోళన చాలావరకు తగ్గుతుంది. 

తర్వాత చేయించాల్సినవి హార్మోన్‌ పరీక్షలు... 
వీర్యరాశిలో వీర్యకణాల సంఖ్య అంతా సక్రమంగా ఉండి, ఆ దంపతుల కలయికలు కూడా బాగానే ఉన్నప్పటికీ గర్భం రాకపోతే అప్పుడు తర్వాత చేయాల్సిన పరీక్షల గురించి ఆలోచించాలి. అప్పుడు వాటిలో మొదట చేయాల్సినవి హార్మోన్‌ పరీక్షలు. ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్‌ (ఇవి మహిళలకూ చేస్తారు) ఈ నాలుగు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్‌ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి  తెలుస్తుంది. ఈ పరీక్షలు కూడా అంత ఖర్చుతో కూడినవేమీ కాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ముందుగా చెప్పినట్లుగా పురుషుల్లో తక్కువ పరీక్షలతో, తక్కువ ఖర్చుతోనే కారణాలేమిటో నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు.

అందుకని పురుషులతోనే మొదట పరీక్షలు మొదలుపెట్టాలి. ఒకవేళ హార్మోన్‌ పరీక్షలు కూడా నార్మల్‌గా ఉంటే వీర్యకణాల సంఖ్య కూడా నార్మల్‌గా ఉంటే కొన్ని రోజులు విటమిన్‌ టాబ్లెట్స్‌ ఇచ్చి మళ్లీ వీర్యకణాల టెస్ట్‌ చేయించడం మంచిది. అప్పుడు దంపతులు ఆందోళన చెందకూడదు. కొన్నిసార్లు కలయిక సరిగా లేకపోవడం వల్ల గర్భధారణకు రెండుమూడేళ్లు ఆలస్యం కావచ్చు. ఇందుకు ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. ఎందుకంటే ప్లానింగ్‌ తర్వాత రెండుమూడేళ్ల సమయం అంత పెద్దదేమీ కాదు. 

వీర్యరాశిలో అసలు వీర్యకణాలే లేకపోతే... 
ఇక్కడ మనం ఒక విషయాన్ని విపులంగా తెలుసుకోవాలి. వీర్యం అన్నది వీర్యకణాలు జీవించి ఉంటూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక మీడియం. ఈ వీర్యాన్ని ప్రొస్టేట్‌ గ్రంథి తయారు చేస్తుంది. వీర్యకణాలు వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ ఉత్పత్తి అయిన ఆ కణాలు, వాస్‌ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యరాశి వరకు చేరి, అక్కడ ఈదుతూ ఉంటాయి. ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో వీర్యకణాలు అస్సలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. కచ్చితంగా ఇది క్లిష్టమైన సమస్య. ఎందుకంటే... కోటికణాలు ఉన్నచోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు కదా.

కారణాలను కచ్చితంగా కనుగొంటే... ఈ సమస్యను కూడా అధిగమించడానికి ఆధునిక వైద్య శాస్త్రంలో మార్గాలున్నాయి. రోగికి వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు మొదటి నెల విటమిన్‌ మాత్రలు ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి పరీక్ష చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవనే రిపోర్ట్‌ వస్తే అప్పుడు టెస్టిక్యులార్‌ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందా లేదా అని ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. 

ఇదొక ఆశారేఖ... 
వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్‌ కూడా కొందరిలో ఉంటుంది.  ఇలాంటి సందర్భాల్లో పేషెంట్‌కు మేలు చేసేందుకు డాక్టర్లకు అవకాశం ఉంటుంది. నిజంగానే వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉంటే... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్‌ను) రిపేర్‌ చేసి వీర్యకణాలు మామూలుగా బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది చాలా సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ.

నూటిలో కేవలం 10 మందికి మాత్రమే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ చేయించుకోవడం వల్ల నష్టమైతే ఉండదు. ఇలాంటి సంక్లిష్టమైన పరీక్షలు యూరాలజిస్ట్‌/యాండ్రాలజిస్ట్‌ల్లో బాగా నైపుణ్యం ఉన్నవారు చేస్తేనే సత్ఫలితాలు ఇస్తాయి. పేషెంట్‌కు డాక్టర్‌ చేసే పరీక్ష ఏమిటో, దాని పరిణామాలు ఏమిటో తెలుసుకోవల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఇదంతా వృషణాల్లో వీర్యకణాల తయారీ ఉంటేనే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి. 

ఇది మరో ప్రత్యామ్నాయం... 
ఒకవేళ వీర్యకణాల తయారీ బాగుంటే పేషెంట్‌కు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదేమిటంటే... కొన్ని వీర్యకణాలను సేకరించి, వాటిని ల్యాబ్‌లోని  ఫిజ్‌లో (క్రయో ప్రిజర్వేషన్‌ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగించవచ్చు. గైనకాలజిస్ట్‌ ఆధ్వర్యంలో నడిచే ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌లో యూరాలజిస్ట్‌ సహాయంతో వృషణాల నుంచి కనీసం 100 వీర్యకణాలను సేకరించి, కోల్డ్‌ స్టోరేజీలో పెట్టుకొని, టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియకు వెళ్లడం అనేది కూడా మరో మంచి ప్రత్యామ్నాయం. అయితే ఇందులో కూడా 10% – 20% మాత్రమే సక్సెస్‌ రేట్‌ ఉంటుంది. అందుకని పేషెంట్‌ గానీ, డాక్టర్‌గానీ వీర్యంలో వీర్యకణాలు లేనప్పుడు కౌన్సెలింగ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

నాళాన్ని (వాస్‌ను) రిపేర్‌ చేసే సర్జరీకి దాదాపు లక్షరూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇది గనక విజయవంతం అయితే ఒకే బిడ్డ కాకుండా, ఆ తర్వాత బిడ్డలు నార్మల్‌గానే పుట్టే అవకాశం ఉంది. కానీ సక్సెస్‌ 10% – 20% అని మాత్రమే పేషెంట్‌ గుర్తెరగాలి. అలాగే టెస్ట్‌ట్యూబ్‌ బేబీలో 30% వరకు సక్సెస్‌ ఉన్నప్పటికీ ప్రతిసారీ దాదాపు లక్ష వరకు ఖర్చవుతుంది. కాబట్టి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పేషెంట్, డాక్టర్‌ల మధ్య పరస్పర చర్చలు, నమ్మకం, ప్రక్రియల పట్ల అవగాహన చాలా ముఖ్యం. ఇక టెస్ట్‌ట్యూబ్‌ బేబీ ప్రక్రియకు వస్తే కేవలం కొన్ని సెంటర్స్‌ మాత్రమే చేస్తాయి. ఇదొక టీమ్‌వర్క్‌. 

ఇందులో యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్‌ మాత్రమే కాకుండా అత్యాధునికమైన ఎక్విప్‌మెంట్‌కు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకని సంతానం లేని దంపతులు అందరూ ఇలాంటి క్లిష్టమైన పద్ధతులను ఎంచుకునే ముందు రెండుమూడేళ్లు మంచి ఆహారం తీసుకుంటూ, రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొంటూ, పిల్లల కోసం కాకుండా, వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తుంటే పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిరాశపడకండి... ఎప్పుడూ ఆనందంగా ఉల్లాసంగా ఉండండి. పిల్లలు వారంతట వారే మీ జీవితంలోకి వస్తారు. 


ఒకవేళ వీర్యకణాల సంఖ్య తగ్గితే... 
ఒకవేళ వీర్యరాశిలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్‌గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాప్లర్‌ అల్ట్రా సౌండ్‌ స్క్రోటమ్‌ అనే స్కానింగ్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం నొప్పి లేని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్‌ అనే సమస్య ఉందా లేదా తెలుస్తాయి. వేరికోసిల్‌ అంటే... వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను చాలా సాధారణ శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాల్సి ఉంటుంది.

వేరికోసిల్‌ ఆపరేషన్‌ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్‌ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం పెరుగుతుంది. అయితే కొంతమందిలో మళ్లీ స్కాన్‌ చేసి చూపినప్పుడు కొంత వేరికోసిల్‌ సమస్య మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. 

మాట్లాడటమే మొదటి ఔషధం... 
పురుషుల్లో ఉండే సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి డాక్టర్‌ తొలుత చేయాల్సింది పేషెంట్‌తో మాట్లాడటమే. భౌతిక పరీక్షల కంటే ముందర ఇదెంతో ప్రధానం. ఎందుకంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక విజ్ఞానం కాస్త తక్కువే. పైగా సమస్యలూ, వాటి పరిష్కారాల కోసం ఓపెన్‌గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే పేషెంట్‌ పూర్తిగా మనసు విప్పి మాట్లాడేలా సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత ఆ దంపతుల సెక్స్‌ జీవితంపై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అవి...  పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభనలు సరిగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

 ఒక నెలలో మహిళకు రుతుస్రావం అయిన 11వ రోజు నుంచి 18వ రోజుల్లో తప్పకుండా కలుస్తూ... ఆ మిగతా రోజుల్లో కూడా క్రమం తప్పకుండా సెక్స్‌ చేయగలుగుతున్నారా అని కూడా తెలుసుకోవాలి. కలయిక బాగానే జరుగుతున్నప్పుడు పురుషుడి వీర్యం, మహిళ యోనిలోకి సక్రమంగానే వెళ్తోందా, లేదా అని కూడా అడిగి తెలుసుకోవాలి. పురుషుడు సెక్స్‌ సరిగా చేయలేకపోయినా, వీర్యం సక్రమంగా యోనిలోకి ప్రవేశించకపోయినా... మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్‌ మొదట తెలుసుకోవాలి. పేషెంట్‌ నమ్మకం చూరగొని ఐదు పది నిమిషాలు మాట్లాడితే చాలా సమస్యలు తెలుస్తాయి. ఆ మాటల్లోనూ కొన్నిసార్లు కొన్ని కారణాలు తెలిసే అవకాశాలుంటాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement