
చిట్ చాట్ / ప్రవీణ్, హాస్యనటుడు
నవ్వంటే... మహత్తర శక్తి!
గోదావరి యాసతో ప్రవీణ్ చేసే ‘కామెడీ’ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ‘నవ్వితే పోయేదేమీ లేదు...మనసులో బాధ తప్ప’ అంటున్న ఈ ‘కొత్త బంగారు లోకం’ (ఇది ప్రవీణ్ తొలిచిత్రం) కురాడ్రు చెప్పే కబుర్లు... దొంగలకు దొంగలు సన్నిహితులవుతారు. తాగుబోతులకు తాగుబోతులు సన్నిహితులవుతారు. అలాగే నవ్వంటే ఇష్టపడే వాళ్లకు, నవ్వించే వాళ్లకు అలాంటి వాళ్లే పరిచయం అవుతారు. మా అంతర్వేదిలో నాకు అలాంటి మిత్ర బృందమే ఉంది. నవ్వడం, నవ్వించడం, నవ్వులను పంచుకోవడం మా పని. నేను హాస్య పాత్రలు పోషించడానికి మూలాలు అక్కడ ఉన్నాయన్నమాట!
దర్శకుడిగానే కాదు.. రచయితగా కూడా జంధ్యాల అంటే తెగ ఇష్టం నాకు. ఈవీవీ సినిమాలు కూడా చాలా ఇష్టపడతాను. కామెడీ సినిమా అంటే సినిమా చూస్తున్న ఆ సమయానికి, ఆ రోజు వరకు మాత్రమే నవ్విస్తే సరిపోదు. సంవత్సరాలైనా సరే ఆ సినిమాలోని దృశ్యాలు మన పెదాలపై నవ్వులై మెరవాలి. ఆ స్థాయిలో సినిమాలు తీయగల శక్తి జంధ్యాల, ఈవీవీలకు ఉంది. నాకు బాగా నచ్చిన సినిమా ఈవీవి ‘ఆ ఒక్కటి అడక్కు’. ఈ సినిమాను ఆ ఒక్కసారి చూస్తే మాత్రమే సరిపోదు. చూస్తున్నకొద్దీ... మన నవ్వులు రెట్టింపు అవుతూనే ఉంటాయి. కమెడియన్లు అందరూ ఇష్టమే. ఆనాటి తరంలో రమణారెడ్డి మొదలు ఈనాటి బ్రహ్మానందం, సునీల్ వరకు అందరి హాస్యాన్ని ఇష్టపడతాను. నవ్వే కదా అని నవ్వును తేలిగ్గా తీసుకోవద్దు. దానికి మహత్తరమైన శక్తి ఉంది. ఆ శక్తితో ఒత్తిడి నుంచి బయట పడొచ్చు, కొత్త శక్తితో ఉత్తేజితం కావచ్చు.