
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘బకాసుర రెస్టారెంట్’.. ఆగష్టు 8న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఎస్‌జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటించాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ముఖ్యపాత్రల్లో నటించారు.
‘బకాసుర రెస్టారెంట్’ హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్ట్తో స్టోరీ ఉంటుంది. అయితే, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ, ఓటీటీ ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 12న 'సన్‌నెక్స్ట్' (Sun NXT)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది. మన స్నేహితుడు అనివార్య కారణాల వల్ల మనకు దూరమైతే ఎంతటి బాధ ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఆపై కామెడీ ఎటూ ఉండటంతో ఓటీటీ ప్రేక్షకులకు మంచి కాలక్షేపాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు.

కథేంటంటే..
పరమేశ్వర్(ప్రవీణ్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నలుగురు స్నేహితులతో కలిసి ఓ రూమ్‌లో ఉంటూ ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఆ జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ రెస్టారెంట్ పెట్టాలనేది ఆయన కోరిక. ఓ సారి తన కోరికనే స్నేహితులతో పంచుకోగ.. డబ్బుల కోసం యూట్యూబ్ లో ఘోస్ట్ వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లే మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఓ హోస్ట్ హౌస్‌కి వెళ్తారు. అక్కడ వీరికి ఒక తాంత్రిక పుస్తకం దొరుకుతుంది. దాన్ని వాడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. అందులో రాసి ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా.. నిమ్మకాయలోకి 200 ఏళ్ల క్రితం నాటి ఆత్మ వస్తుంది. ఆ ఆత్మకు ఆకలి ఎక్కువ. ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా తినేస్తుంది.
ఆ నిమ్మకాయలో ఉన్న ఆత్మను కట్టడి చేసేందుకు ప్రయత్నించగా.. పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు(ఫణి) శరీరంలోకి వెళ్తుంది. అంజిబాబు శరీరాన్ని ఆవహించిన ఆత్మను పొగొట్టేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలు ఏంటి? బక్క సూరి(వైవా హర్ష) ఎవరు? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.