Sun Network
-
Ayalaan OTT Release: ఓటీటీలోకి 'అయలాన్'
తమిళ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన తమిళ్లో నటించిన రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అయలాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం..టాలీవుడ్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో రిలీజైంది. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఇప్పటికే తమిళ్ వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సన్ నెక్ట్స్ ఫిబ్రవరిలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి 'అయలాన్' తెలుగు వర్షన్ రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 19 నుంచి అయలాన్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. కేవలం తమిళ్ వర్షన్లో సుమారుగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. -
సీఎంఆర్ఎఫ్కు సన్ నెట్వర్క్ రూ.3 కోట్లు విరాళం
సాక్షి, హైదరాబాద్: సీఎం సహాయ నిధికి సన్ నెట్వర్క్ రూ.3 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. మంత్రి కేటీఆర్‌ను జెమినీ టీవీ బాధ్యులు పి.కిరణ్ శుక్రవారం ప్రగతిభవన్‌లో కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కోవిడ్ సమ యంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఈ విరాళం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ‘సన్’ ఉదారతను మంత్రి అభినందించారు. -
‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్!
ముంబై : టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో దక్షిణాది సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. జియో సినిమా.. సన్ టీవీ నెట్వర్క్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సన్ నెక్ట్స్ సహకారంతో దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. సన్ నెక్ట్స్తో భాగస్వామ్యం కావడం ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో యూజర్లకు అందించనుంది. తద్వారా జియో యూజర్లకు సన్ నెక్ట్స్ లైబ్రరీ నుంచి 4 వేల సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. కాగా జియో సినిమా యాప్‌లో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా లక్షకు పైగా టీవీ షో ఎపిసోడ్ల కంటెంట్‌ను కలిగి ఉంది. ఇక ప్రస్తుతం సన్ నెక్ట్స్ మూవీ కేటలాగ్‌తో అపరిమిత సినిమాలు చూసే వీలును దక్షిణాది ప్రేక్షకులకు కల్పించింది. కాగా దక్షిణ భారత స్టూడియోల నుంచి అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలకు సన్ నెక్ట్స్ పేరు గాంచింది. -
సీనియర్‌ను కోర్టుకీడ్చిన యాంకర్
చెన్నై : మీడియాలోనూ కీచకులు ఉన్నారని బయటపెడుతూ.. సోషల్ మీడియా వేదికగా మీటూ ఉద్యమం రగులుతోంది. న్యూస్రూమ్ల్లో, ఇంటర్వ్యూల్లో తాము ఎదుర్కొన్న భయానకమైన అనుభవాలను మహిళా జర్నలిస్ట్‌లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. బయటికి ఎంతో ప్రముఖంగా, హుందాగా వ్యవహరించే వారు సైతం, ఓ అమ్మాయితో ఇలా ప్రవర్తించారా? అనే రీతిలో మీటూ ఉద్యమం రగులుతోంది. అయితే ఈ మీటూ ఉద్యమం రాకమునుపే అంటే ఓ ఐదేళ్ల ముందే చెన్నైలో ఓ మహిళా జర్నలిస్ట్, ప్రముఖ మీడియా హౌజ్‌లో పనిచేసే తన సీనియర్‌ను కోర్టుకు ఈడ్చింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో, కోర్టులో కేసు దాఖలు చేసింది. ఆర్గనైజేషన్ నుంచి, తన కొలీగ్స్ నుంచి ఇసుమంతైనా సపోర్టు లేనప్పటికీ, ఒకతే ఎన్నోఏళ్లుగా ఆ కీచకుడిపై కోర్టులో యుద్ధం చేస్తోంది. అకిలా తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రముఖ మీడియా హౌజ్ సన్ టీవీలో న్యూస్ యాంకర్‌గా చేరింది. అయితే ఆ ఛానల్లో మాజీ చీఫ్ ఎడిటర్ అయిన వీ రాజ ఆమెను లైంగికంగా సహకరించాలంటూ వేధింపులకు దిగాడు. కానీ ఆమె దానికి ససేమీరా అనడంతో, అకిలతో మరింత క్రూరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. న్యూస్‌రూమ్‌లో వేధించడం, బదిలీ చేస్తానంటూ హెచ్చరించడం, పదే పదే ఉదయం సిఫ్ట్లు వేయడం చేశాడు. ఆ కీచకుడి వేధింపులు వేగలేక అకిలా, ఓ రోజు అతనిపై లైంగిక వేధింపుల కేసు ఫైల్ చేసింది. దీంతో అకిల ఆరోపణలపై సంస్థలోని హెచ్ఆర్ విభాగం కూడా దిగొచ్చి, రాజపై విచారణ ప్రారంభించింది. అయితే అకిలకు ఎవరూ సపోర్టు రాకుండా.. రాజ పకడ్బందీ ప్లాన్ వేశాడు. ఆమె స్నేహితులందరిని ప్రలోభాలకు గురిచేశాడు. దీంతో అకిల ఎవరైతే తన స్నేహితులని భావించిందో, వారందరూ కూడా రాజవైపు వెళ్లిపోయి, ఆమెకు వ్యతిరేకమయ్యారు. రాజపై లైంగిక వేధింపుల కేసు, పరువు నష్టం కేసుతో పాటు, వారిపై కూడా 2014లో పరువు నష్టం కేసు దాఖలు చేసింది అకిల. ప్రస్తుతం ఈ కేసుల విషయంలో అకిలా కోర్టులో పోరాటం చేస్తోంది. ఆ సంస్థలో ఉద్యోగం మానేసినప్పటికీ కూడా, కోర్టులో పోరాటం మాత్రం ఆపలేదు. అయితే రాజ తన తరుఫున ఒక న్యాయవాదిని నియమించుకోగా.. సన్ నెట్వర్క్ కూడా అతని కోసం మరో న్యాయవాదిని నియమించింది. ఎంత మంది న్యాయవాదులు, ఎంత పెద్ద సంస్థ రాజకు మద్దతుగా నిలిచినా.. అకిల ఏ మాత్రం జంకకుండా.. తనను లైంగికంగా వేధించిన అతనిపై సాహోసపేత పోరాటం చేస్తోంది. ప్రెగ్నెన్సీతో కూడా కోర్టుకు వచ్చా... ‘గత ఐదేళ్లుగా ఈ కేసుల విషయంలో పోరాడుతూనే ఉన్నా. న్యాయం బయటికి రాకుండా ఉండేందుకు నిందితుడు కోర్టు ప్రక్రియను జాప్యం చేస్తూ ఉన్నాడు. ఎన్ని సార్లు సైదాపేట్ కోర్టు మెట్లు ఎక్కి, దిగానో లెక్కలేదు. గర్భంతో ఉన్నా రాజపై పోరాటం మాత్రం ఆపలేదు. ఆ తర్వాత నా చిన్నారిని ఎత్తుకుని కూడా కోర్టు ట్రయల్‌కు వచ్చా’ అని అకిలా చెప్పింది. ప్రస్తుతం ఈ కేసులు తుది దశకు వచ్చాయి. మరో మూడు నెలల్లో న్యాయం గెలవబోతుందని అకిల చెప్పింది. తనకు ఎదురైన లైంగిక వేధింపుల కంటే, తన స్నేహితులు నిందితుడికి మద్దతుగా మారడమే ఎక్కువగా బాధించిందని అకిల అన్నారు. తన కేసులో ఓ మాజీ యాంకర్ తనకు సాక్ష్యంగా నిలిచిందని, తనతో కూడా రాజ అలానే చెడుగా ప్రవర్తించాడని చెప్పిందని తెలిపారు. కోర్టులో తను పోరాడుతున్న సమయంలో, మరికొంత మంది యాంకర్లు కూడా అకిలకు మద్దతుగా నిలిచారు. ఇంటర్వ్యూ చేసే సమయంలో, తమను రాజ లైంగికంగా సహకరించాలంటూ డిమాండ్ చేశాడని చెప్పారు. వీరు కూడా ప్రస్తుతం వారి ఫిర్యాదులను కోర్టు దృష్టికి తీసుకొస్తున్నారు. వేధింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి ఏ మాత్రం భయపడవద్దని, చాలా ధైర్యంగా పోరాడాలని అకిల సూచించింది. ఒకవేళ ఆ ధైర్యం లేకపోతే, అందరి ముందు గట్టిగా నాలుగు చెంప దెబ్బలు కొట్టండని సలహా ఇచ్చింది. మీరు నిశ్శబ్దంగా ఉంటే, వారు మరింత రెచ్చిపోతారని తెలిపింది. మీటూ ఉద్యమం రగులుతున్న ఈ క్రమంలో, ఎవరైనా మహిళ లైంగిక వేధింపులు గురయ్యాయని చెబితే, వాటిని కొట్టి పడేయకుండా.. ఆమె వేదనను అర్థం చేసుకోవాలని కూడా సూచించింది. -
కలలా ఉంది!
కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. సూపర్ స్టార్‌తో యాక్ట్ చేసే హీరోయిన్ ఎవరో కన్ఫార్మ్ అయింది. రజనీకాంత్ నెక్ట్స్ సినిమాలో ఆయన సరసన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటూ? కొన్ని రోజులుగా గందరగోళం ఏర్పడింది. తలైవర్‌తో డ్యాన్స్ చేసేది త్రిష అని కొంతమంది అంటే.. కాదు మాళవికా మోహనన్ అని కొందరు వాదించారు. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేశారు సన్ నెటవర్క్ సంస్థ ప్రతినిధులు. రజనీకాంత్ సరసన నటించనున్న హీరోయిన్ త్రిష అని అఫీషియల్‌గా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సిమ్రాన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి జోడీగా నటించబోతున్నది త్రిష అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు సన్ నెటవర్క్ ప్రతినిధులు. ‘‘కొన్ని సార్లు నిద్రలేచినా కూడా ఇంకా కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ వార్త నాకు అలాంటిదే’’ అని త్రిష ఆనందాన్ని పంచుకున్నారు. అన్నట్లు.. కొన్ని రోజుల క్రితం రజనీతో త్రిష జోడీ కుదిరింది అని ‘సాక్షి’ ప్రచురించిన సంగతి గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. -
సన్ నెట్‌వర్క్‌కు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ : ప్రముఖ టెలివిజన్ సన్ నెట్‌వర్క్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్లపై న్యాయస్థానం శుక్రవారం తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన 742 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. అటాచ్ చేసిన వాటిలో దయానిధి మారన్, ఇతరులకు చెందిన రూ. 7.47కోట్ల ఎఫ్డీలు, కళానిధి మారన్‌కు చెందిన రూ. 100 కోట్ల ఎఫ్డీలు, రూ. 2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే, కళానిధి భార్య కావేరికి చెందిన రూ. 1.3 కోట్ల విలువైన ఎఫ్డీలు, రూ. 1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. దీనిపై మారన్ సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
యూకే,యూరప్‌లో యప్ టీవీ... సన్ నెట్వర్క్
హైదరాబాద్ : యూకే, యూరప్‌లలో సన్ టీవీ నెట్వర్క్ చానల్స్ అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్లో అగ్రగామిగా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా కూడా వీక్షకులకు అత్యున్నత స్థాయి కంటెంట్‌ను అందించేందుకు కొనసాగిస్తున్న ప్రయాణంలోభాగంగా యప్ టీవీ ప్రతిష్టాత్మక సన్ నెట్‌వర్క్‌కు చెందిన ప్రజాదరణ పొందిన చానల్స్‌ను యూకే, యూపరప్లోని వీక్షకుల కోసం ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నెట్పై భారతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లను పొందగలిగేలా చేయడం లక్ష్యంగా యప్ టీవీ ప్రస్తుతం అత్యుత్తమ నెట్వర్క్ ఆఫర్లను ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో యూకే, యూరప్ అంతటా ఉన్న వీక్షకుల కోసం అందిస్తోంది. ఈ సందర్భంగా యప్ టీవీ సీఈఓ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ ఆసియాకు చెందిన అతిపెద్ద, అత్యంత అభిమానపాత్రమైన టెలివిజన్ నెట్‌వర్క్‌లలో సన్ టీవీ నెట్వర్క్ కూడా ఉందని, భారతీయ వీక్షకులు అత్యత్తమంగా భావించే చానళ్లను ఇప్పుడు యూకే, యూరప్ అంతటా అందించటం ఆనంద దాయకమన్నారు. ఆసియాకు చెందిన అమిత ప్రజాదరణ గల సన్ టీవీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వివిధ రకాల టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు బహుభాషల్లో కలిగి ఉంది. సన్ టీవీ నెట్ వర్క్ సోప్ ఒపెరాలు, గేమ్ షోలు, మూవీలు, కామెడీ, వార్తా ప్రసారాలు, వినోద కార్యక్రమాలతో సహా విస్తృత శ్రేణి షోలను ప్రసారం చేస్తోంది. యప్ టీవీ దక్షిణాసియా కంటెంట్, లైవ్ టీవీ, క్యాచ్ అప్ టీవీ, ఆన్ డిమాండ్ మూవీ సొల్యూషన్స్‌కు సంబంధించి యప్ టీవీ ప్రపంచపు అగ్రగామి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కంటెంట్ ప్లేయర్‌గా ఎదిగింది. జార్జియాలోని అట్లాంట ప్రధాన కేంద్రంగా పని చేస్తోంది. యప్ టీవీ 200కు పైగా టీవీ చానళ్లు, 4500 వీడియోలు, అపరిమిత మూవీలు, లైవ్ ఈవెంట్స్ ఇంకా మరెన్నో అందిస్తోంది. -
మనవళ్ల వంతు!
సాక్షి, చెన్నై: దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో డీఎంకే నేతల ప్రమేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ వ్యవహారం ఆ పార్టీ అధినేత కరుణానిధి గారాలపట్టి కని మొళి, మాజీ మంత్రి ఏ రాజా మెడకు చుట్టుకుంది. కేంద్రంలో అధికారం మారడంతో ఈ కేసుల విచారణ వేగం పుంజుకుంది. ఈ సమయంలో మరో కేసు వేగం పుంజుకుంది. కనెక్షన్లు : కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న కాలంలో కరుణానిధి మనవడు దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగతంగా 363 కనెక్షన్లను కలిగిన మారన్, వాటిని మరో మనవడు కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ నెట్ వర్క్‌కు ఉపయోగించుకుంటూ వచ్చినట్టు, రూ.440 కోట్ల మేరకు ప్రభుత్వానికి గండి పడ్డట్టుగా వెలుగు చూసింది. 2007లో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లలో ఈ బ్రదర్స్ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చినా, అధికారం చేతిలో ఉండడంతో దాన్ని డీఎంకే పెద్దలు తొక్కి పెట్టారు. కేంద్రంలోని యూపీఏపై ఒత్తిడి తెచ్చి ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు. అయితే, 2013లో సీబీఐ కోర్టులో దాఖలైన చార్జ్ షీట్ మేరకు విచారణ మరింత వేగవంతం చేయడానికి అధికాారులు సిద్ధం అయ్యారు. విచారణ వేగవంతం: ఆ చార్జ్ షీట్ ఆధారంగా సీబీఐ తన విచారణ చేపట్టింది. యూపీఏ పుణ్యమా నత్తనడకన సాగిన ఈ విచారణ అధికార మార్పుతో వేగం పుంజుకుంది. రూ.440 కోట్ల అవినీతి, అధికార దుర్వినియోగాన్ని అస్త్రంగా చేసుకుని సీబీఐ నాలుగు రోజులుగా చెన్నైలో తిష్ట వేసి ఉన్నట్టు వెలుగు చూసింది. డీఎస్పీ రాజేష్ మహేంద్రన్ నేతృత్వంలోని నలుగురు అధికారుల బృందం, సన్‌గ్రూప్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది మీద నిఘా పెట్టారు. మారన్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆ సంస్థలో పనిచేసిన ప్రధాన అధికారులను విచారిస్తున్నారు. ఆ సంస్థకు చెందిన శరత్‌కుమార్, మాజీ అధికారి హన్సరాజ్ సక్సేనాల్ని రెండు రోజుల పాటు విచారించినట్టు తెలిసింది. శరత్‌కుమార్ మాత్రం ఆ సమయంలో తాను ఆ సంస్థలో లేనని చెప్పినట్లు సమాచారం. సక్సేనా, సన్ గ్రూప్ మధ్య ఇటీవల వివాదం రేగడంతో, మారన్ మంత్రి గా ఉన్న సమయంలో ఆ సంస్థలో సక్సేనా పని చేస్తున్నందు వల్ల ఆయన ఎలాంటి వాంగ్మూ లం ఇచ్చి ఉంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. సమన్లు: తన విచారణను వేగవంతం చేసిన సీబీఐ బృందం దృష్టిని మారన్ బ్రదర్స్‌పై పెట్టింది. ఆ ఇద్దరినీ విచారించేందుకు కసరత్తులు పూర్తి చేసింది. తమ విచారణకు రావాలంటూ దయానిధి మారన్, కళానిధి మారన్‌కు సమన్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. సీబీఐ ఉన్నతాధికారులు సంతకాలు చేయడం తో మరో రెండు మూడు రోజుల్లో ఈ సమన్లు ఆ బ్రదర్స్‌కు చేరనున్నాయి. ఒక దాని తర్వాత మరొకటి గారాల పట్టి కనిమొళి కేసు, ఇటు మనవళ్ల వ్యవహారం డీఎంకే అధినేత ఎం కరుణానిధికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పార్టీ, ఈ కేసుల రూపంలో మరింతగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో వ్యక్తమవుతోంది.