సన్ నెట్వర్క్కు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ : ప్రముఖ టెలివిజన్ సన్ నెట్వర్క్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ అటాచ్మెంట్లపై న్యాయస్థానం శుక్రవారం తాత్కాలికంగా స్టే ఇచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన 742 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
అటాచ్ చేసిన వాటిలో దయానిధి మారన్, ఇతరులకు చెందిన రూ. 7.47కోట్ల ఎఫ్‌డీలు, కళానిధి మారన్‌కు చెందిన రూ. 100 కోట్ల ఎఫ్‌డీలు, రూ. 2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే, కళానిధి భార్య కావేరికి చెందిన రూ. 1.3 కోట్ల విలువైన ఎఫ్‌డీలు, రూ. 1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. దీనిపై మారన్ సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.