మనవళ్ల వంతు! | 2G spectrum scam Sun Network CBI charge sheet | Sakshi
Sakshi News home page

మనవళ్ల వంతు!

Published Mon, Jun 9 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

2G spectrum scam Sun Network CBI charge sheet

సాక్షి, చెన్నై: దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో డీఎంకే నేతల ప్రమేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ వ్యవహారం ఆ పార్టీ అధినేత కరుణానిధి గారాలపట్టి కని మొళి, మాజీ మంత్రి ఏ రాజా మెడకు చుట్టుకుంది. కేంద్రంలో అధికారం మారడంతో ఈ కేసుల విచారణ వేగం పుంజుకుంది. ఈ సమయంలో మరో కేసు  వేగం పుంజుకుంది. కనెక్షన్లు : కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న కాలంలో కరుణానిధి మనవడు దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
 
 వ్యక్తిగతంగా 363 కనెక్షన్లను కలిగిన మారన్, వాటిని మరో మనవడు కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ నెట్ వర్క్‌కు ఉపయోగించుకుంటూ వచ్చినట్టు, రూ.440 కోట్ల మేరకు ప్రభుత్వానికి గండి పడ్డట్టుగా వెలుగు చూసింది. 2007లో బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లలో ఈ బ్రదర్స్ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చినా, అధికారం చేతిలో ఉండడంతో దాన్ని డీఎంకే పెద్దలు తొక్కి పెట్టారు. కేంద్రంలోని యూపీఏపై ఒత్తిడి తెచ్చి ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు. అయితే, 2013లో సీబీఐ కోర్టులో దాఖలైన చార్జ్ షీట్ మేరకు విచారణ మరింత వేగవంతం చేయడానికి అధికాారులు సిద్ధం అయ్యారు.
 
 విచారణ వేగవంతం: ఆ చార్జ్ షీట్ ఆధారంగా సీబీఐ తన విచారణ చేపట్టింది. యూపీఏ పుణ్యమా నత్తనడకన సాగిన ఈ విచారణ అధికార మార్పుతో వేగం పుంజుకుంది. రూ.440 కోట్ల అవినీతి, అధికార దుర్వినియోగాన్ని అస్త్రంగా చేసుకుని సీబీఐ నాలుగు రోజులుగా చెన్నైలో తిష్ట వేసి ఉన్నట్టు వెలుగు చూసింది. డీఎస్పీ రాజేష్ మహేంద్రన్ నేతృత్వంలోని నలుగురు అధికారుల బృందం, సన్‌గ్రూప్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది మీద నిఘా పెట్టారు. మారన్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆ సంస్థలో పనిచేసిన ప్రధాన అధికారులను విచారిస్తున్నారు. ఆ సంస్థకు చెందిన శరత్‌కుమార్, మాజీ అధికారి హన్సరాజ్ సక్సేనాల్ని రెండు రోజుల పాటు విచారించినట్టు తెలిసింది. శరత్‌కుమార్ మాత్రం ఆ సమయంలో తాను ఆ సంస్థలో లేనని చెప్పినట్లు సమాచారం. సక్సేనా, సన్ గ్రూప్ మధ్య ఇటీవల వివాదం రేగడంతో, మారన్ మంత్రి గా ఉన్న సమయంలో ఆ సంస్థలో సక్సేనా పని చేస్తున్నందు వల్ల ఆయన ఎలాంటి వాంగ్మూ లం ఇచ్చి ఉంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
 
 సమన్లు: తన విచారణను వేగవంతం చేసిన సీబీఐ బృందం దృష్టిని మారన్ బ్రదర్స్‌పై పెట్టింది. ఆ ఇద్దరినీ విచారించేందుకు కసరత్తులు పూర్తి చేసింది. తమ విచారణకు రావాలంటూ దయానిధి మారన్, కళానిధి మారన్‌కు సమన్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.  సీబీఐ ఉన్నతాధికారులు సంతకాలు చేయడం తో మరో రెండు మూడు రోజుల్లో ఈ సమన్లు ఆ బ్రదర్స్‌కు చేరనున్నాయి.  ఒక దాని తర్వాత మరొకటి గారాల పట్టి కనిమొళి కేసు, ఇటు మనవళ్ల వ్యవహారం డీఎంకే అధినేత ఎం కరుణానిధికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పార్టీ, ఈ కేసుల రూపంలో మరింతగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement