మూడు తరాల కలల రాణి | cini artist jhothi laksmi died | Sakshi
Sakshi News home page

మూడు తరాల కలల రాణి

Published Tue, Aug 9 2016 11:07 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

మూడు తరాల కలల రాణి - Sakshi

మూడు తరాల కలల రాణి

నివాళి @ జ్యోతిలక్ష్మి (1948 - 2016)

 

‘లే... లే... లేలేలే నా రాజా.. లేవనంటావా... నిద్దుర లేపమంటావా’ (ఏయన్నార్ ‘ప్రేమ్‌నగర్’) అంటూ తెరపై హీరోను కవ్వించిన శృంగార నృత్యతార జ్యోతిలక్ష్మి (68) బ్లడ్ క్యాన్సర్‌ని జయించలేక ప్రశాంతంగా సుదీర్ఘ నిద్రలోకి వెళ్లిపోయారు. దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి, రెండు మూడు తరాలకు కలల రాణిగా వెలిగిన మొట్టమొదటి శృంగార తార జ్యోతిలక్ష్మి. 1960ల నుంచి రెండు దశాబ్దాల పైగా ‘వ్యాంప్’ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. నలుపు-తెలుపు చిత్రాల నుంచి రంగుల చిత్రాల వరకూ దాదాపు 300 పైచిలుకు చిత్రాల్లో నటించిన జ్యోతిలక్ష్మి సుమారు వెయ్యి పాటలకు పైగా డ్యాన్స్ చేశారంటే అప్పట్లో ఆమె పాపులారిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఎటు చూసినా ఆమే! నాటి తరం కుర్రకారు ‘జ్యోతిలక్ష్మి పాట ఉందా?’ అని అడిగి మరీ సినిమాకి వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ తరం వరకు నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది.


జ్యోతిలక్ష్మి పూర్వీకులది తంజావూరు. తమిళ అయ్యంగార్ల కుటుంబంలో 1948లో జ్యోతిలక్ష్మి పుట్టారు. ఆమె తండ్రి పేరు టి.కె. రామరాజన్, తల్లి పేరు శాంతవి. వారికి ఎనిమిది మంది సంతానం. ముగ్గురు అబ్బాయిలు. అయిదుగురు అమ్మాయిలు. వారిలో జ్యోతిలక్ష్మి పెద్ద అమ్మాయి. చివరి అమ్మాయి - తరువాతి కాలంలో మరో శృంగార నృత్యతారగా వెలిగిన జయమాలిని. అప్పట్లో వారి తండ్రి ఇతరులతో భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించేవారు. కాగా, పెద్ద కుమార్తె అయిన జ్యోతిలక్ష్మిని ఆయన తన సోదరి ఎస్.పి.ఎల్. ధనలక్ష్మికి దత్తత ఇచ్చేశారు. ప్రముఖ దర్శకుడు టీఆర్ రామన్న, జ్యోతిలక్ష్మికి సమీప బంధువు. ‘తమిళ సినిమా తొలి డ్రీమ్‌గర్ల్’ టీఆర్ రాజకుమారి స్వయానా అత్త వరుస.


బేబీ జ్యోతిగా తెరపైకి...
సినిమాల్లో యాక్ట్ చేయిస్తానని బంధువైన టీఆర్ రామన్న ఐదేళ్ళ వయస్సులో ఆమెతో తమిళ చిత్రం ‘గూండుక్కిళి’(’54)లో యాక్ట్ చేయించారు. ఆ సినిమాకి దర్శకుడూ ఆయనే. ఎంజీఆర్, శివాజీ గణేశన్ స్నేహితులుగా నటించిన ఆ చిత్రంతో చిన్నారి జ్యోతి తెరపై మెరిసింది. తర్వాత  శివాజీ గణేశన్, సావిత్రి జంటగా రామన్నే రూపొందించిన ‘కాత్తవరాయన్’(’58)లో డ్యాన్స్ చేసింది.


ఎక్కడకి వెళ్లినా హిట్టే!
టీనేజ్‌లో ఉండగానే ‘పెరియ ఇడత్తు పెణ్’ (’63) అనే తమిళ చిత్రంతో బేబీ జ్యోతి కాస్తా జ్యోతిలక్ష్మిగా తెరపైకి వచ్చి, ఇక ఆ పేరుతోనే వెలిగారు. మలయాళంలో విన్సెంట్ దర్శకత్వంలో టాప్‌స్టార్ ప్రేమ్ నజీర్ నటించిన ‘మురప్పెణ్ణు’ (’65)లో నటించారు. అదీ హిట్. ఆ చిత్రానికి తృతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో అవార్‌‌డ చిత్ర నటి అయ్యారు. హిందీలో కిశోర్‌కుమార్‌తో ‘పాయల్ కీ ఝంకార్’ (’68)లో చాన్స్ దక్కించుకున్నారామె. అదీ హిట్టే. తెలుగులోకీ వచ్చారు. ‘పెద్దక్కయ్య’ (67) లో హరనాథ్ సరసన చేసిన పాటతో ఇక్కడా హిట్ సాధించారు. శోభన్‌బాబు నటించిన ‘ఇదాలోకం’ (’73)లో చేసిన ‘గుడి ఎనకా నా సామి గుర్రమెక్కి కూసున్నాడు..’ పాట పెద్ద హిట్. అంతే.. ఐటమ్ సాంగ్స్‌కి ఆమె అడ్రస్ అయ్యారు.

 
అచ్చమైన శాస్త్రీయ నర్తకి!

తెరపై శృంగార తారగా వెలిగిన జ్యోతిలక్ష్మి అసలు శాస్త్రీయ నర్తకి అంటే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు ప్రసిద్ధ నాట్యాచార్యుడు తంజై రామయ్యదాస్ పిళ్లై వద్ద భరతనాట్యం నేర్చుకున్నారామె. తెరపై చేసినవన్నీ అందుకు భిన్నమైన శృంగార నృత్యాలే అయినా, వాటిలో రాణించడానికి భరతనాట్య శిక్షణే ఉపకరించిందని చెప్పేవారు. 1970లలో జానపదం, కౌబాయ్, సాంఘికం - ఇలా ఏ సినిమా అయినా ఆమె పాట తప్పనిసరి. 

 
చెల్లెలితోనే పోటాపోటీ!

తెలుగు వారైన కెమేరామ్యాన్ సాయిప్రసాద్ (ప్రముఖ ఛాయాగ్రాహకుడు దేవరాజ్ సోదరుడు)ని పెళ్లి చేసుకున్నాక కూడా జ్యోతిలక్ష్మి సినిమాలు కొనసాగించారు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలోనే జ్యోతిలక్ష్మి చెల్లెలు జయమాలిని తెరపైకి దూసుకు వచ్చారు. అప్పటికే హలం వంటి డ్యాన్సర్లున్నా ఆ ఇద్దరితో కన్నా అక్కాచెల్లెళ్ల మధ్యే ఎక్కువగా పోటీ ఉండేది. ఇద్దరి మధ్య వృత్తిపరమైన అసూయ ఉండేదని కూడా చెప్పుకునేవాళ్లు. అయితే ఒకర్ని మించి మరొకరు బాగా డ్యాన్స్ చేయాలనే పోటీ ఉండేదే తప్ప అసూయ ఉండేది కాదని జ్యోతిలక్ష్మి స్పష్టం చేశారు. అయితే, కుటుంబపరమైన గొడవల కారణంగా కొన్నాళ్లు జ్యోతిలక్ష్మి, జయమాలిని మాట్లాడుకోలేదట. తర్వాత ఇద్దరూ కలసి పలు పాటల్లో డ్యాన్స్ చేశారు. పెళ్లి చేసుకున్నాక జయమాలిని సినిమాలు మానుకున్నారు. యాభై ప్లస్ ఏజ్‌లోనూ ఐటమ్ సాంగ్ చేయడం జ్యోతిలక్ష్మికే చెల్లింది. రాజశేఖర్ నటించిన ‘శేషు’లో ఆమె నర్తించారు. తర్వాత ‘కుబేరులు’ కోసం తన పాత హిట్ పాట ‘గుడి ఎనకా...’ని రీమిక్స్ చేస్తే, దానికీ నర్తించారు.

 
బుల్లితెరపై...

నటనపై మక్కువతో జ్యోతిలక్ష్మి ఏ మంచి అవకాశం వచ్చినా వదులుకోలేదు. గత పదిహేనేళ్లల్లో తెలుగులో ‘శేషు’, ‘కలుసుకోవాలని’, ‘దొంగరాముడు అండ్ పార్టీ’ తదితర చిత్రాల్లో నటించారు. ‘వల్లి, మా ఇంటి మహాలక్ష్మి, ఓం నమో వెంకటేశాయ’ లాంటి సీరియల్స్ చేశారు.
 

కూతురు కూడా....
జ్యోతిలక్ష్మి కూతురు జ్యోతిమీనా కూడా తల్లి బాటలో నటి అయ్యారు. కానీ, నిలదొక్కుకోలేక సినిమాలకు దూరమయ్యారు. కూతురు పెళ్ళి చేసుకొని, స్థిరపడినా, జ్యోతిలక్ష్మి మాత్రం చనిపోయే వరకు నటనకు దూరం కాలేదు. ఇప్పుడు హఠాత్తుగా భౌతికంగా అందరికీ దూరమయ్యారు. కానీ, నాట్యతారగా దక్షిణాది సినీరంగంలో ఆమె స్థానాన్ని మాత్రం ఎవరూ దూరం చేయలేరు!
 

జనం ఈలలేసి... గోల చేసినవి
‘‘ఐటమ్ గర్ల్ కాబట్టే నాలుగు దశాబ్దాల పాటు నన్ను ఆదరించారు. హీరోయిన్ అయితే ఇన్నాళ్లు చూసేవారా?’’ అని జ్యోతిలక్ష్మి అనేవారు. ఆమె హిట్ సాంగ్స్‌లో కొన్ని... 

లే.. లే.. లేలేలే... నా రాజా... (ప్రేమ్ నగర్)
గుడి ఎనక నా సామి గుర్రమెక్కి.. (ఇదా లోకం)
తీస్కో కోకాకోలా ఏస్కో రమ్ముసారా... (రౌడీలకు రౌడీలు)
జ్యోతిలక్ష్మి చీర కట్టింది.. (సర్దార్ పాపారాయుడు)
చిచ్చుబుడ్డి లాంటి దాన్నిరా.... (బెబ్బులి)
పరువాల లోకం.. పడుచోళ్ల మైకం.. (కొత్తపేట రౌడీ)


వ్యాంపే కాదు... హీరోయిన్ కూడా!
తొలి రోజుల్లో దాదాపు పాతిక పైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది. తమిళంలో ఎంజీఆర్ హీరోగా నటించిన ‘తలైవన్’ (1970)లో వాణిశ్రీ ఓ కథానాయికగా, జ్యోతిలక్ష్మి రెండో నాయికగా చేశారు. తెలుగులో కృష్ణ సరసన ‘హంతకులు - దేవాంతకులు’, ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త’, హరనాథ్‌తో ‘పుణ్యవతి’, రామకృష్ణ సరసన ‘పిల్లా? పిడుగా? చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు ధరించారు. ప్రముఖ దర్శకుడు కేయస్‌ఆర్ దాస్ సినిమాల్లో జ్యోతిలక్ష్మి తప్పనిసరిగా ఉండేవారు. ఆ క్రమంలో ఆమె ఎక్కువగా దాస్ చిత్రాల్లో, హీరో కృష్ణ సినిమాల్లో నటించారు. కౌబాయ్, గూఢచారి సినిమాల్లో ఫైట్ సీన్స్‌లో డూప్ లేకుండా నటించేవారు.

 

ప్రేమించి... పారిపోయి... పెళ్ళి
క్లబ్ సాంగ్‌‌సతో బిజీగా ఉన్న రోజుల్లోనే కెమేరామ్యాన్ సాయిప్రసాద్‌తో జ్యోతిలక్ష్మి ప్రేమలో పడ్డారు. షూటింగులకు ఆమె తల్లి వస్తుండేవారు. కూతురిపై ఓ కన్నేసి ఉంచేవారు. అమ్మకు తెలియకుండా రహస్యంగా సైగలు చేసుకుంటూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఓ రోజున పక్కింటి అమ్మాయితో సినిమాకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి, ఇంటి నుంచి ఆమె బయటపడ్డారు. ముంబయ్ వెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement