తిండి గోల
లవంగాలు మనవి కావట!
నోరు వికారంగా అనిపిస్తే వంటింటి డబ్బాలన్నీ వెతికి ఓ లవంగం తెచ్చిస్తుంది అమ్మ. కడుపు ఉబ్బరంగా అనిపిస్తే బామ్మ నోట, పంటి నొప్పి వస్తే నాన్న బుగ్గన లవంగం ఉండటం తెలిసిందే! ఆరోగ్య ప్రదాయినిగా, నొప్పి నివారిణిగా పేరుకొట్టేసిన లవంగ అంతమేరకే ఊరుకోలేదు. కోడి కూర, వేట కూర, చేపల పులుసు, బిర్యానీ.. శాకమైనా, మాంసమైనా వంటకాలు ఘుమ ఘుమలాడటానికి ‘నేనుండాల్సిందే’ అని తన ఘాటు మన నషాలానికంటించేస్తోంది లవంగ. మనకెప్పుడో పరిచయమైన లవంగ క్రీ.పూ. 330 ఏళ్ల క్రితమే చైనీయులు నోటి దుర్వాసనకు వాడారని, ఈజిప్టు వాళ్లు క్రీ.పూ 100 ఏళ్ల క్రితమే ఉపయోగించారని, రోమన్ల ద్వారా క్రీ.పూ 400 ఏళ్ల క్రితమే యూరప్ దేశాలకు వచ్చిందని.
లవంగం గురించి చరిత్ర విస్తారంగా చెబుతోంది. అక్కడా ఇక్కడ విస్తరించి అరబ్బు మర్చెంట్స్ ద్వారా ఇండియాకు పరిచయం అయ్యి, మన కిచెన్ షెల్ఫ్ ఎక్కి దర్జాగా కూర్చుంది. డచ్ దేశాల్లో విస్తారంగా పండించే లవంగ పంటను మన దేశంలో కేరళ, కర్నాటక.. వంటి కొన్ని శీతల ప్రాంతాలలో మనం చూడవచ్చు. అయినప్పటికీ మనదగ్గర దీని దిగుబడి తక్కువేనట. లవంగ నూనె కోసం దీని చెట్టు ఆకులు, బెరడు, కొమ్మలు కూడా వాడతారు.