కోలన్ క్యాన్సర్‌కు ఫుల్‌స్టాప్ సాధ్యమే! | Colon cancer is possible to Treatment | Sakshi
Sakshi News home page

కోలన్ క్యాన్సర్‌కు ఫుల్‌స్టాప్ సాధ్యమే!

Published Mon, Feb 2 2015 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

కోలన్ క్యాన్సర్‌కు  ఫుల్‌స్టాప్ సాధ్యమే!

కోలన్ క్యాన్సర్‌కు ఫుల్‌స్టాప్ సాధ్యమే!

పెద్దపేగు క్యాన్సర్...

మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు... పేరుకు తగ్గట్లే కీలకమైన విధులు నిర్వహిస్తుంటుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను అది గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. ఇంతటి కీలకమైన పెద్దపేగును వైద్యపరిభాషలో ‘కోలన్’ అంటారు. పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, మలద్వారం నుంచి రక్తం పడటం వంటివి కోలన్ క్యాన్సర్‌కు ప్రధాన లక్షణాలు. అయితే మలద్వారం నుంచి రక్తం పడుతూ, ప్రక్షాళన సమయంలో చేతికి బుడిపెలాగా తగులుతుంటే చాలావరకు అది మొలల సమస్యే కావచ్చు. కానీ ఎందుకైనా మంచిది... నిశ్చయంగా అవి మొలలే అని ఒకసారి నిర్ధారణ చేసుకుంటే ఇక నిశ్చింతగా వాటికి చికిత్స తీసుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే మొలలు చాలావరకు ఇబ్బంది కలిగిస్తాయి కానీ... పెద్దగా ప్రాణాంతకం కాదు.

కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఒక్కసారి అది పెద్దపేగు క్యాన్సర్ అయ్యేందుకు ఏమైనా అవకాశం ఉందా అని ఆలోచించి, కాదని నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ అవుననే నిర్ధారణ అయినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు దశల్లో అయితే దీనికి చికిత్స పూర్తిగా సాధ్యం. చాలామంది పెద్దపేగు క్యాన్సర్‌ను అనుమానించకపోవడం వల్ల వ్యాధి ఎక్కువగా ముదిరాక డాక్టర్‌ను సంప్రదించడం వల్లనే సమస్య. అదే ముందే ఈవ్యాధిని రూల్ అవుట్ చేసుకున్నా లేదా ఉందని తెలుసుకుని చికిత్స తీసుకున్నా అది ప్రయోజనకరమైన చర్య. మీ వయసు 50 దాటి ఉంటే అది చాలా అవసరమైన చర్య.
 
లక్షణాలు...
 
పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారికి కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉండటం.

కొద్దిరోజులు విపరీతమైన మలబద్దకం ఉండటం... మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటడం... ఈ రెండు కండిషన్లూ ఒకదాని తర్వాత మరొకటి వస్తూ (రిపీటవుతూ) ఉండటం కూడా ఒక లక్షణమే.

ఉంటే ఎప్పుడూ అజీర్తిగా అనిపించడం లేదా ఎప్పుడూ విరేచనాలు అవుతూ ఉండటం. (అంటే నార్మల్ విసర్జన అలవాటు లేకుండా ఉండటం అన్నమాట).

పొట్ట కింది భాగంలో నొప్పి, అక్కడ పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం.

మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం.

అకారణంగా నీరసం, బరువు తగ్గడం. (వీళ్లలో నీరసం కనిపించడానికి ఒక కారణం ఉంది. పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారిలో అక్కడ ఉన్న అల్సర్లు (పుండ్లు), మ్యూకస్ పొర నుంచి రక్తస్రావమై... అది మలంతో పాటు బయటకు వస్తూ ఉంటుంది. రోజూ రక్తం పోతూ ఉండటంతో శరీరంలో రక్తపరిమాణం తగ్గి నీరసం వస్తుంటుంది).
 
రిస్క్‌ఫ్యాక్టర్స్...
 
ఈ వ్యాధికి కొన్ని రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయి. ముందే చెప్పినట్లు పెరుగుతున్న వయసు ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ కాగా... దానితో పాటు మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే.

ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. కానీ కుటుంబ చరిత్రలో ఇది వచ్చిన దాఖలా ఉంటే వారు మిగతా వారి కంటే కొంచెం జాగ్రత్తగా ఉండి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు 50 ఏళ్లు వచ్చే వరకు ఆగకుండా ముందునుంచే తరచూ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి.

కొందరి పెద్దపేగుల నిండా బొడిపెల వంటివి ఉంటాయి. వీటిని వైద్యపరిభాషలో ‘ఫెమిలియల్ ఎడినమోటస్ పాలిపోసిస్ కోలీ’ అంటారు.

మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే అలాంటి బొడిపెల కుటుంబ చరిత్ర ఉన్నవారి పిల్లలకూ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

అందుకే వారు 15వ సంవత్సరం నుంచి తరచూ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఇక మరికొందరిలో ఇలాంటి బొడిపెలే ఉంటాయి, కానీ అవి ఫెమిలియల్ ఎడినమోటస్ పాలిపోసిస్ కోలీ’ రకానికి చెందినవి కావు. ఇవి సాధారణ బొడిపెలు. అందులోనూ రెండు రకాలుంటాయి. వాటినే సెసైల్ పాలిప్, విల్లస్ పాలిప్‌లంటారు. ఇవి క్యాన్సర్ సంబంధిత బొడిపెలు కాకపోయినా... కొన్నిసార్లు దీర్ఘకాలంలో క్యాన్సరస్‌గా మారవచ్చు. కాబట్టి అలాంటివి ఉన్నప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

కొందరిలో పేగుల్లో వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్)ను కలిగించే ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి వ్యాధులు ఉంటాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఈ సమస్యలు ఉన్నవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.

►  ఇక పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే... ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే... వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ.

  స్థూలకాయం ఉండటం, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద పేగు క్యాన్సర్‌కు చాలా ప్రధానమైన రిస్క్‌ఫ్యాక్టర్స్.

►  ఇతర క్యాన్సర్ల చికిత్స కోసం రేడియేషన్, కీమోథెరపీ తీసుకునే వారిలోనూ పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

►  డయాబెటిస్ ఉన్నవారిలోనూ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే.

  సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఒక్కోసారి చిన్న వయసు వారిలోనూ కనిపించవచ్చు. కానీ చాలా అరుదు.
 
నివారణ - చికిత్స

 
 నివారణ  

మన ఆహారంలో ఆకుపచ్చటి తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు  లాంటి పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకునే వారు రెడ్ మీట్ వంటి వేటమాంసం కంటే చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. ఇక మాంసాహార ప్రియులు తమకు ఇష్టమైన మాంసాహారాన్ని తీసుకునే సమయంలో దానికి తగినట్లుగా అంతేమోతాదులో గ్రీన్‌సలాడ్స్ రూపంలో శాకాహారం తీసుకుంటూ మాంసాహారంతో వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
పొగతాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. మద్యపానం అలవాటునూ పూర్తిగా వదిలేస్తేనే మంచిది.
తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
 
చికిత్స:
కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది అది ఏ దశలో ఉందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. మొదటి దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే ‘ర్యాడికల్ సర్జరీ’ అనే ప్రక్రియ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ చికిత్సను కేవలం మామూలు శస్త్రచికిత్స ప్రక్రియలోనే గాక... చిన్న గాటు పెట్టి చేసే కీహోల్ (లాపరోస్కోపిక్) పద్ధతిలోనూ చేయవచ్చు. తొలిదశలో పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించినప్పుడు అది ఉన్న ప్రాంతంతో పాటు అది ఎక్కడెక్కడికి పాకే అవకాశం ఉందో గుర్తించి, ఆ భాగాలను కూడా తొలగిస్తారు. ఇక క్యాన్సర్ ఉన్న పరిసరభాగాల్లోని లింఫ్‌గ్రంథులనూ తొలగిస్తారు.

ఒకవేళ మలద్వారం వద్ద మలం బయటకు రాకుండా గట్టిగా ముడుచుకుపోయేట్లుగా చేసే స్ఫింక్టర్ భాగానికి క్యాన్సర్ వస్తే అప్పుడు స్ఫింక్టర్ వ్యవస్థనంతా శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మలవిసర్జన జరిగేలా పెద్దపేగులోని చివరి భాగాన్ని బయటకు ఉండేలా అమర్చాల్సి ఉంటుంది. క్యాన్సర్ ఏమేరకు విస్తరించిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని... శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలనూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ కణితి పరిమాణం చాలా పెద్దదిగా ఉంటే ముందే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇచ్చి... దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. అప్పుడు శస్త్రచికిత్స చేస్తారు. ఒకవేళ పెద్దపేగు క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినప్పుడు కూడా మొదట కీమోథెరపీ, రేడియేషన్లను ముందుగానే ఇచ్చి, ఆ తర్వాత శస్త్రచికిత్సకు వెళ్తారు. ఇప్పుడు ఈ తరహా శస్త్రచికిత్సలన్నీ గాటు చిన్నగా ఉండే లాపరోస్కోపిక్ (కీ-హోల్) ప్రక్రియలో చేయడం సాధ్యం కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం, ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి తగ్గుతాయి.
 
జాగ్రత్తలు
 

మన పెద్దపేగు నిర్దిష్టంగా కుడివైపు భాగం, పై భాగం, ఎడమవైపు భాగం, కింది భాగం అంటూ నాలుగు స్పష్టమైన భాగాలుగా ఉంటుంది. ఇందులోఎడమవైపు భాగంతో పోలిస్తే... కుడివైపున ఉండే పెద్దపేగు కాస్త వెడల్పు ఎక్కువ. అందుకే కుడివైపు భాగంలో క్యాన్సర్ కణుతులు, అల్సర్స్ ఏర్పడితే వ్యాధి లక్షణాలు అంత సులభంగా బయటకు కనిపించవు. పైగా ఆ భాగం కాస్త వెడల్పుగా ఉండటం వల్ల విసర్జక పదార్థాలు బయటకు వచ్చేందుకు ఈ గడ్డలు పెద్దగా అడ్డంకి కాబోవు. కానీ ఆ వైపు భాగం కాలేయానికి దగ్గర కాబట్టి క్యాన్సర్ వ్యాప్తి జరుగుతూ ఉంటే అది కాలేయానికి పాకే అవకాశం ఎక్కువ. అందుకే లక్షణాలు కనిపించకపోవడం వల్ల వ్యాధి బాగా ముదిరాక గానీ డాక్టర్‌ను కలిసే అవకాశం ఉండదు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం పెరిగిపోతుంది. ఇక ఎడమవైపు పెద్దపేగు భాగం కుడివైపుతో పోలిస్తే కాస్త సన్నగా ఉంటుంది కాబట్టి కణుతులు విసర్జకాలకు అడ్డుపడటం, రక్తస్రావం త్వరగా కావడం జరిగి డాక్టర్‌ను తొందరగా కలుస్తారు. అయితే మలవిసర్జన సమయంలో రక్తస్రావం అంటూ కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
 
నిర్ధారణ

 
 పెద్ద పేగు క్యాన్సర్ నిర్ధారణ కోసం తొలుత రోగిని శారీరకంగా పరీక్షిస్తారు. ఆ తర్వాత కుటుంబ చరిత్ర గురించి వాకబు చేస్తారు. ఆ తర్వాత కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. అవి...

సాధారణ మల పరీక్ష (ఒకవేళ క్యాన్సర్ వచ్చిన భాగం మలద్వారానికి దగ్గరగా ఉంటే చేతివేళ్ల సహాయంతోనే డాక్టర్‌లు దాన్ని తెలుసుకోగలరు).

కొలనోస్కోపీ (అంటే ఇది ఎండోస్కోపీ తరహాలోనే మలద్వారం గుండా కెమెరా ఉన్న పరికరాన్ని ఒక పైప్‌నకు అమర్చి లోపలికి పంపి పరీక్షించడం). కొలనోస్కోపీ పరీక్షలో ఏవైనా కణుతులు, గడ్డలు, పాలిప్స్ వంటివి కనిపిస్తే వాటి నుంచి చిన్నముక్కను తీసి బయాప్సీ పరీక్షకు పంపుతారు. ఆ పరీక్షలో అవి క్యాన్సర్ కణాలా లేక ప్రమాదరహితమైన సాధారణ బుడిపెలా అన్న విషయం నిర్ధారణగా తెలుస్తుంది.

►  బేరియమ్ ఎనిమా ఎక్స్-రే పరీక్ష: ఇందులో రోగికి బేరియమ్ ఎనిమా ఇచ్చి, అది పెద్ద పేగు మొదలువరకు చేరుకున్న తర్వాత అప్పుడు ఎక్స్-రే తీస్తారు. ఆ భాగంలో ఏవైనా క్యాన్సర్ కారక కణుతులు ఉంటే ఎక్స్-రే చిత్రంలో అవి నల్లగా కనిపిస్తాయి. అప్పుడు బయాప్సీ చేసి, అవి క్యాన్సరస్ కణుతులా, కాదా అని నిర్ధారణ చేస్తారు. ఒకవేళ అవి క్యాన్సర్ కణాలే అని నిర్ధారణ అయితే, క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి స్టేజింగ్ పరీక్ష చేస్తారు. ఇందులో కణితి పరిమాణం (సైజ్), అది లింఫ్‌నోడ్స్ వరకు పాకిందా లేదా అన్న విషయం, ఇతర భాగాలకూ విస్తరించిందా లేదా అన్న సంగతి... ఈ మూడు అంశాలూ తెలుస్తాయి. ్ట ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్, సీఈఏ వంటి పరీక్షలూ చేసి, చికిత్స చేయాల్సిన తీరుతెన్నులను నిర్ణయిస్తారు. ్ట అవసరాన్ని బట్టి పెట్-స్కాన్ పరీక్షనూ చేయాల్సి రావచ్చు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
 
స్క్రీనింగ్
 
కుటుంబ చరిత్రలో పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ అంశాలు ఉన్నవారు, స్థూలకాయులు తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వీళ్లు ఏడాదికి ఒకసారి ఫీకల్ అక్కల్ట్ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

  అవసరాన్ని బట్టి లేదా డాక్టర్ సూచనల మేరకు మూడేళ్లు లేదా ఐదేళ్ల కోసారి కొలనోస్కోపీ, సిగ్మాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
 
నిరాశ వద్దు
 
ఒకవేళ అన్ని దశలూ దాటిపోయిన తర్వాత పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించినా పెద్దగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోనోక్లోనల్  యాంటీబాడీస్ అనే కొత్త తరహా మందులవల్ల గతంతో పోలిస్తే ఇప్పుడు రోగి జీవితకాలాన్ని మరింతగా పెంచేందుకు అవకాశం ఉంది.
 
 
చివరగా...
 
 పైన చెప్పిన అనేక అంశాల వల్ల పెద్దపేగు క్యాన్సర్‌ను అంత తేలిగ్గా గుర్తించే అవకాశం ఉండదు. పైగా పైల్స్ అని అపోహపడే అవకాశాలే ఎక్కువ. కాబట్టి మలద్వారం నుంచి రక్తస్రావం జరిగినప్పుడు మొదట పెద్దపేగు క్యాన్సర్ అవకాశాలనే అనుమానించి, సంబంధిత పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండాలి. ఇక పెద్దపేగును నివారించేందుకు అనుసరించాల్సిన నివారణ పద్ధతులు చాలా సులువు. వేళకు భోజనం చేయడం లాంటి మంచి జీవనశైలి, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం వంటి పద్ధతులతో దీన్ని చాలా సులువుగా నివారించుకోవచ్చు. చికిత్స కంటే నివారణ ఎప్పుడూ మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అన్నివిధాలా శ్రేష్ఠం.
 
 - నిర్వహణ: యాసీన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement