The digestive tract
-
ఆరోగ్యం కోసం నడుం కట్టు..!
యోగా అర్ధ చంద్రాసన సమస్థితిలో నిలబడి కుడివైపునకు వంగి కుడి చేతిని ఫొటోలో చూపిన విధంగా కుర్చీ సీటు భాగంలో ఉంచాలి. కుడికాలుని స్ట్రయిట్‌గా భూమికి 90 డిగ్రీల కోణంలో ఉంచి, శ్వాస వదులుతూ ఎడమకాలుని పైకి తీసుకెళ్లి రెండో కుర్చీ బ్యాక్‌రెస్ట్ మీద భూమికి సమాంతరరేఖలో ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చెవికి దగ్గరగా భుజాన్ని ఉంచుతూ ఎడమ కాలుకి సమాంతర రేఖలో ఎడమచేతిని కూడా స్ట్రెచ్ చేయాలి. 3 లేదా 5 శ్వాసల తర్వాత తిరిగి శ్వాస వదులుతూ, ఎడమ చేతిని పై నుంచి పక్కకి ఎడమ కాలుని కిందకు తీసుకువచ్చి సమస్థితిలోకి రావాలి. తిరిగి రెండోవైపున కూడా ఇదేలా చేయాలి. ఉపయోగాలు: లోయర్బ్యాక్ పెయిన్, వెన్నెముకలో ఉన్న అసమానతల్ని తొలగించడానికి, ఛాతీ, భుజాలు వ్యాకోచత్వంలో ఉండడానికి, చీలమండలు, మోకాలు, కాళ్లు బలోపేతం కావడానికి, బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థకి పనికొ స్తుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్, స్ట్రెస్ల నుంచి రిలీఫ్‌ను ఇస్తుంది. కటి చక్రాసన సమస్థితిలో నిలబడి కుర్చీని ఫొటోలో చూపిన విధంగా అమర్చాలి. కుర్చీ చేతి మీదుగా ఎడమ కాలుని తీసుకుని పాదాన్ని 90 డిగ్రీల్లో కుర్చీ సీటు మీద ఉంచాలి. ఎడమ మోచేతిని ఎడమ మోకాలి మీద సపోర్ట్‌గా ఉంచి శ్వాస తీసుకుంటూ కుడి అరచేతులు ఆకాశం వైపు చూపుతూ పక్క నుంచి పైకి తీసుకు వె ళ్లి కుడి భుజాన్ని కుడి చెవికి దగ్గరగా తీసుకుని పైకి సాగదీస్తూ కుడివైపు నడుం భాగాన లాగడాన్ని గమనిస్తూ వీలైనంత వరకూ ఎడమకి వంగాలి. 3 లేక 5 సాధారణ శ్వాసల తర్వాత కుడి అరచేతిని భూమి వైపు చూపిస్తూ కుడి మణికట్టుని లూజ్‌గా వదిలి, కుడి చేతిని పక్క నుంచి కిందకు తీసుకురావాలి. సమస్థితిలో నిలబడి రెండోవైపు కూడా అదే విధంగా చేయాలి. ఉపయోగాలు: కుడివైపు నడుం దగ్గర బాగా స్ట్రెచ్ కావడం వల్ల పక్క కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఎడిపోజ్ టిస్యూలో నడుం పక్కన కొవ్వు కరగడానికి ఉపకరిస్తుంది. కుడి, ఎడమ రెండు వైపులా చేయడం వల్ల స్పైన్ ఎలైన్మెంట్కి, షోల్డర్జామ్, స్పాండిలైటిస్ సంబంధిత సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. పరివృత్త కటి చక్రాసన వేరియంట్ 2 పైన చెప్పినట్టు గానే కుడిచేయి పైకి స్ట్రెచ్ చేసిన తర్వాత చేతిని వెనకకు తీసుకుని ఎడమచేతిని ఎడమ కాలు కింద నుంచి వెనకకు తీసుకెళ్లి (శరీరాన్ని ముందుకు వంచి చేసినట్లయితే వెనుక రెండు చేతుల్నీ సులభంగా ఇంటర్‌లాక్ చేయగలుగుతారు) చేతులు ఇంటర్‌లాక్ చేసిన తర్వాత ఛాతీని ముందుకూ, నడుమును పక్కలకీ స్ట్రెచ్ చేస్తూ పైకి చూసే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 శ్వాసల తర్వాత వెనుకకు, కటి చక్రాసనలోకి వచ్చి సమస్థితిలోకి రావాలి. తిరిగి రెండోవైపున కూడా ఇదే విధంగా చేయాలి. ఉపయోగాలు: పై ఆసనం వల్ల కలిగే అన్ని లాభాలతో పాటు నడుమును ట్విస్ట్ చేయడం వల్ల దిగువ వెన్నెముక భాగానికి, చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేయడం వల్ల షోల్డర్ బ్లేడ్స్‌కి మంచి వ్యాయామం జరుగుతుంది. సమన్వయం సత్యబాబు -
కదలని బాధ కాన్స్టిపేషన్
మలబద్ధకం ప్రతి ఉదయం మలవిసర్జన సాఫీగా అయితే... ఆ రోజంతా ప్రశాంతంగా గడిచిపోయినట్టే. కానీ ఆ వేళ ‘ఆ ఒక్క పనీ’ జరగకుండా పేగులు మొరాయిస్తే అది నరకం. ఆ బాధ తగ్గించుకుని, ప్రశాంతత పొందేందుకు వివరాలివిగో... మనిషికి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో! మలవిసర్జన చేయడమూ అంతే అవసరం. ఆకలవుతోంది, భోజనానికి వెళ్తున్నానని చెప్పినంత సులువుగా వాష్రూమ్కెళ్లాలని చెప్పలేరు. కొంచెం బిడియం. మరికొంచెం సిగ్గు. దానికి తోడు ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత ఆ అవసరం తీరడానికి తగినన్ని సౌకర్యాలుండవు. దాంతో వాయిదా వేయక తప్పని పరిస్థితి. మోడరన్ లైఫ్స్టయిల్లో సౌకర్యాలు పెరిగాయి. దేహానికి వ్యాయామం లేకుండా గారంగా చూసుకోవడమూ ఎక్కువైంది. దేహం మీద ముద్దు ముదరడంతో మనిషిలో బద్ధకం పెరుగుతోంది. అది జీర్ణవ్యవస్థ, దాని అనుబంధ ప్రక్రియలు బద్ధకించేటట్లు చేస్తోంది. అది మలబద్ధకం రూపంలో బయటపడుతోంది. మరి... ఈ మలబద్ధకం నుంచి బయటపడేదెలాగ? మలబద్ధకం లక్షణాలు పెద్ద పేగు కదలికలు తగ్గడం, మలమూత్ర విసర్జనలో ఇబ్బందులు మలం గట్టి పడడం, పరిమాణం తక్కువగా ఉండడం మలవిసర్జన చేయాల్సినట్లు అనిపిస్తున్నా విసర్జించలేకపోవడం పొట్ట ఉబ్బిపోవడం, నొప్పి విసర్జన మందగించడంతో చిన్న పేగు, జీర్ణాశయం కదలికలు తగ్గడం, ఆహారం తినాలనిపించకపోవడం మలబద్ధకానికి కారణాలు! చిన్న పేగు, పెద్ద పేగు సమస్యలు, మలద్వారంలో ఇబ్బందులు మలబద్దకానికి ప్రధాన కారణాలవుతుంటాయి. అలాగే లైఫ్‌స్టయిల్ మారినందువల్ల దేహ కదలికలు, జీవక్రియలు మందగించి మలబద్ధకానికి దారి తీస్తోంది. లైఫ్‌స్టయిల్ మార్పు: ఆహారంలో తగినంత పీచు, ద్రవాలను తీసుకోకపోవడం. టైమ్ చూసుకుంటూ పరుగులు తీసే క్రమంలో దేహం మలవిసర్జన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసినప్పుడు వెళ్లకుండా వాయిదా వేయడమూ కారణమే. ఎక్కువమందికి పేగుల కదలికలకు అవసరమైనంత వ్యాయామం దేహానికి లేకపోవడం వల్ల ఇటీవల కాన్స్టిపేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మందులు: హైబీపీ, డిప్రెషన్, గుండెవ్యాధులకు మందులు వాడుతున్నప్పుడు దేహం కొద్దిపాటి సైడ్‌ఎఫెక్ట్స్‌కు లోనవుతుంది. ఆ మందులే కాకుండా బలం కోసం ఐరన్ మాత్రలు తీసుకుంటున్న వారిలోనూ మలబద్ధకం కనిపిస్తుంటుంది. క్రానిక్ ఇడియోపతిక్ కాన్స్టిపేషన్: కొందరికి ఏ ఇతర కారణాలూ లేకనే పేగు కదలికలు తక్కువగా ఉంటాయి. గర్భిణుల్లో: గర్భిణిగా ఉన్నప్పుడు దేహంలో వచ్చే అనేక మార్పుల్లో హార్మోన్ స్థాయుల హెచ్చుతగ్గులు ప్రధానమైనవి. ఈ మార్పు కొందరిలో పేగు కదలికలను మందగింప చేస్తుంది. దీనికి ఐరన్‌మాత్రల వాడకం తోడవుతుంటుంది. జీవక్రియల సమతుల్యత లోపించడం: హైపో థైరాయిడిజమ్, డయాబెటిక్ మెలిటస్ వంటి సమస్యలు కూడా కాన్స్టిపేషన్కు కారణమవుతుంటాయి. అనాటమికల్ ప్రాబ్లమ్: పైన చెప్పుకున్న కారణాలన్నీ చాలా చిన్నవి, పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నవి. కాగా అనాటమికల్ ప్రాబ్లమ్ మాత్రం పూర్తి స్థాయి చికిత్స అవసరమైన పరిస్థితి. ఇందులో రెక్టో కోయిల్, మెగా కోలన్ లేదా మెగా రెక్టమ్, నరాల సంబంధ వ్యాధులు, గాయాలవడం, కోలన్ క్యాన్సర్, కోలన్ స్ట్రిక్చర్ వంటి అనేక కారణాలుంటాయి. పెద్దపేగు మీద బుడిపెలాగ వచ్చి మలం అందులో ఆగిపోవడం, పెద్దపేగు సాగిపోవడం, పెద్దపేగు క్యాన్సర్ వంటివన్న మాట.కాన్ష్టిపేషన్ రావడానికి కారణాలు ఏమైనప్పటికీ గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోకపోతే నరాల వ్యవస్థ మీద దుష్ర్పభావం పడుతుంది. పైల్స్ వంటి అనుబంధ సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. నిర్ధారణ ఎలా! కాన్స్టిపేషన్ రావడానికి కారణాల అన్వేషణ చాలా కీలకం. ప్రాథమికంగా లైఫ్‌స్టయిల్, మందుల వాడకంతో వచ్చిన సైడ్ఎఫెక్ట్స్ అనే కోణంలో విశ్లేషిస్తారు. అవి కాదనిపించినప్పుడు పూర్తిస్థాయి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవి... హిమోగ్లోబిన్ లెవెల్స్, ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, బయోకెమికల్ స్క్రీనింగ్, ధైరాయిడ్, సీరమ్ క్యాల్షియమ్, కొలనోస్కోపీ, ఫిజియోలాజికల్ టెస్ట్, మెజర్మెంట్ ఆఫ్ కొలోనిక్ ట్రాన్సిట్ టైమ్, యానోరెక్టల్ మానోమెట్రీ, బెలూన్ ఎక్స్పల్షన్ టెస్ట్‌లు అవసరమవుతాయి. చికిత్స మలబద్ధకం తగ్గడానికి మొదటగా లైఫ్‌స్టయిల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దేహాన్ని క్రమబద్ధంగా అలవాటు చేయాలి. మలవిసర్జన కోసం రోజూ ఒకే టైమ్‌లో కొంత సమయం కేటాయించాలి. ఆటలు, ఇతర వ్యాయామాలు పేగు కదలికలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి కనీసం అరగంట అయినా వ్యాయామం ఉండాలి. డ్రైవింగ్, కంప్యూటర్‌తో పని చేసే వారికి, ఇలాంటి కొన్ని రకాల వృత్తుల్లో ఎక్కువ సేపు కూర్చుని, దేహాన్ని పెద్దగా కదిలించే అవసరం ఉండదు. అలాంటి వారు తప్పని సరిగా వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించాలి ఆహారంలో ద్రవాల మోతాదు పెంచుకోవాలి. రోజుకు కనీసం పది గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్, శీతలపానీయాలు, కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారు వాటిని గణనీయంగా తగ్గించాలి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్‌గా కాన్స్టిపేషన్కు గురైన వాళ్లు ఆ సంగతిని డాక్టర్‌కి తెలియచేసి మందులు మార్చుకోవాలి. అలా మార్చడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆ మందులతోపాటు మలబద్ధకం తగ్గడానికి లాక్సేటివ్ మందులను సూచిస్తారు. ఈ లాక్సేటివ్లలో బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్, స్టిములెంట్ లాక్సేటివ్, ఆస్మోటిక్ లాక్సేటివ్స్ అని మూడు రకాలుంటాయి. రోగి పరిస్థితిని బట్టి ఏ రకమైన లాక్సేటివ్స్ అవసరమనేది డాక్టర్ నిర్ణయిస్తారు పై ఏ పద్ధతిలోనూ సమస్య పరిష్కారం కానప్పుడు బయో ఫీడ్‌బ్యాక్ విధానంలో చికిత్స చేస్తారు. హెల్త్ టిప్స్ బ్యాండెయిడ్ తొలగించండిలా! పిల్లలకు దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ తెరిచి బాండ్ ఎయిడ్ వేస్తారు. మరుసటి రోజుకి గాయం తగ్గుముఖం పడుతుంది. మూడో రోజుకి మానిపోతుంది. ఇక దానిని తీసేయాలి? అదే పెద్ద బాధ. గాయం నొప్పి రేగుతుంది, పిల్లలు గాయం నొప్పి కంటే ఈ నొప్పికే ఎక్కువ విలవిలలాడతారు. దానికి పరిష్కారం చాలా సులభం... బ్యాండ్ ఎయిడ్‌ను ఒక్కసారిగా లాగినట్లు తీయరాదు. బ్యాండ్ ఎయిడ్ చివరలో బేబీ ఆయిల్, కొబ్బరి నూనె రాయాలి. పది నిమిషాలకు నూనె పీల్చుకుంటూ అంచులు మెల్లగా చర్మాన్ని వదులుతాయి. అప్పుడు మరికొంత నూనె చర్మానికి రాస్తూ, బ్యాండ్ ఎయిడ్ని మెల్లగా కొద్ది కొద్దిగా వదులు చేస్తూ తీసేయాలి. లైఫ్‌స్టయిల్ కీళ్లనొప్పి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లవ్యాధి లక్షణాల్లో కీళ్ల నొప్పి. మోకాళ్లు, మడమల కీళ్లు, ఒళ్లంతా పట్టేసినట్లు కదలనివ్వకపోవడం (స్టిఫ్నెస్) వంటివి ఉంటాయి. వాటితోపాటు ఈ వ్యాధి లక్షణాలలో వేళ్ల కీళ్ల నొప్పి కూడా ఒకటి. వేళ్ల కీళ్ల నొప్పి అనిపించగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని తమకు తాము నిర్ధారణకు రావడానికి వీల్లేదు. టైప్, కంప్యూటర్ కీబోర్డు విపరీతంగా ఉపయోగించేవారికి, పిండివంటలు, కుట్లు, అల్లికలు చేసేవారికి, బోర్డు మీద ఎక్కువగా రాసేవారికి కూడా వేళ్ల కీళ్లు నొప్పి పెట్టవచ్చు. ఇవన్నీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కావు. పైన చెప్పిన అలవాటు ఏదీ లేకుండా కూడా వేళ్ల కీళ్లు నొప్పెడుతుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని ఊహించాల్సిందే. అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే ఇది ఆ వ్యాధి తొలిలక్షణం... ముందస్తు హెచ్చరిక. -
ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్!
నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికత్స ఉందా? - దామోదర్‌రావు, నల్లగొండ మీరు చెబుతున్న లక్షణాలతో మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది. కారణాలు: మానసిక ఒత్తిడి, ఆందోళన సరైన సమయంలో భోజనం చేయకపోవడం మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం చికాకు, కోపం. లక్షణాలు: మలబద్దకం / విరేచనాలు తరచూ కడుపునొప్పి రావడం కడుపు ఉబ్బరం విరేచనంలో జిగురు పడటం భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం. హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ నడవడం కష్టమౌతోంది... ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. అయితే నా మిత్రులు మాత్రం దానికి సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. కానీ నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కృష్ణమూర్తి, చీరాల మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి. నా వయసు 27 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? సలహా ఇవ్వండి. - చిన్నా, విజయవాడ మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ మీటింగ్స్‌లో కూడా నిద్రపోతున్నాను..! స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు సైతం నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - వినయకుమార్, విశాఖపట్నం మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. -
కోలన్ క్యాన్సర్‌కు ఫుల్స్టాప్ సాధ్యమే!
పెద్దపేగు క్యాన్సర్... మన జీర్ణవ్యవస్థలో చివరన ఉండే పెద్దపేగు... పేరుకు తగ్గట్లే కీలకమైన విధులు నిర్వహిస్తుంటుంది. ఆహారంలోని నీటిని, పొటాషియమ్ వంటి లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను అది గ్రహించి శరీరానికి అందిస్తుంది. దాంతోపాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. ఇంతటి కీలకమైన పెద్దపేగును వైద్యపరిభాషలో ‘కోలన్’ అంటారు. పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, మలద్వారం నుంచి రక్తం పడటం వంటివి కోలన్ క్యాన్సర్‌కు ప్రధాన లక్షణాలు. అయితే మలద్వారం నుంచి రక్తం పడుతూ, ప్రక్షాళన సమయంలో చేతికి బుడిపెలాగా తగులుతుంటే చాలావరకు అది మొలల సమస్యే కావచ్చు. కానీ ఎందుకైనా మంచిది... నిశ్చయంగా అవి మొలలే అని ఒకసారి నిర్ధారణ చేసుకుంటే ఇక నిశ్చింతగా వాటికి చికిత్స తీసుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే మొలలు చాలావరకు ఇబ్బంది కలిగిస్తాయి కానీ... పెద్దగా ప్రాణాంతకం కాదు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఒక్కసారి అది పెద్దపేగు క్యాన్సర్ అయ్యేందుకు ఏమైనా అవకాశం ఉందా అని ఆలోచించి, కాదని నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ అవుననే నిర్ధారణ అయినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు దశల్లో అయితే దీనికి చికిత్స పూర్తిగా సాధ్యం. చాలామంది పెద్దపేగు క్యాన్సర్‌ను అనుమానించకపోవడం వల్ల వ్యాధి ఎక్కువగా ముదిరాక డాక్టర్‌ను సంప్రదించడం వల్లనే సమస్య. అదే ముందే ఈవ్యాధిని రూల్ అవుట్ చేసుకున్నా లేదా ఉందని తెలుసుకుని చికిత్స తీసుకున్నా అది ప్రయోజనకరమైన చర్య. మీ వయసు 50 దాటి ఉంటే అది చాలా అవసరమైన చర్య. లక్షణాలు... ► పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నవారికి కనిపించే ప్రధాన లక్షణం మలద్వారం నుంచి రక్తస్రావం అవుతూ ఉండటం. ► కొద్దిరోజులు విపరీతమైన మలబద్దకం ఉండటం... మరికొన్ని రోజులు విరేచనాలు అవుతూ ఉంటడం... ఈ రెండు కండిషన్లూ ఒకదాని తర్వాత మరొకటి వస్తూ (రిపీటవుతూ) ఉండటం కూడా ఒక లక్షణమే. ► ఉంటే ఎప్పుడూ అజీర్తిగా అనిపించడం లేదా ఎప్పుడూ విరేచనాలు అవుతూ ఉండటం. (అంటే నార్మల్ విసర్జన అలవాటు లేకుండా ఉండటం అన్నమాట). ► పొట్ట కింది భాగంలో నొప్పి, అక్కడ పట్టేసినట్లుగా ఉండటం, గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండటం. ► మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా అనిపించడం. ►అకారణంగా నీరసం, బరువు తగ్గడం. (వీళ్లలో నీరసం కనిపించడానికి ఒక కారణం ఉంది. పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారిలో అక్కడ ఉన్న అల్సర్లు (పుండ్లు), మ్యూకస్ పొర నుంచి రక్తస్రావమై... అది మలంతో పాటు బయటకు వస్తూ ఉంటుంది. రోజూ రక్తం పోతూ ఉండటంతో శరీరంలో రక్తపరిమాణం తగ్గి నీరసం వస్తుంటుంది). రిస్క్ఫ్యాక్టర్స్... ► ఈ వ్యాధికి కొన్ని రిస్క్ ఫాక్టర్స్ ఉన్నాయి. ముందే చెప్పినట్లు పెరుగుతున్న వయసు ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ కాగా... దానితో పాటు మరికొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే. ►ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. కానీ కుటుంబ చరిత్రలో ఇది వచ్చిన దాఖలా ఉంటే వారు మిగతా వారి కంటే కొంచెం జాగ్రత్తగా ఉండి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి కుటుంబ చరిత్ర ఉన్నప్పుడు 50 ఏళ్లు వచ్చే వరకు ఆగకుండా ముందునుంచే తరచూ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ► కొందరి పెద్దపేగుల నిండా బొడిపెల వంటివి ఉంటాయి. వీటిని వైద్యపరిభాషలో ‘ఫెమిలియల్ ఎడినమోటస్ పాలిపోసిస్ కోలీ’ అంటారు. ►మిగతా సాధారణ వ్యక్తులతో పోలిస్తే అలాంటి బొడిపెల కుటుంబ చరిత్ర ఉన్నవారి పిల్లలకూ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ►అందుకే వారు 15వ సంవత్సరం నుంచి తరచూ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఇక మరికొందరిలో ఇలాంటి బొడిపెలే ఉంటాయి, కానీ అవి ఫెమిలియల్ ఎడినమోటస్ పాలిపోసిస్ కోలీ’ రకానికి చెందినవి కావు. ఇవి సాధారణ బొడిపెలు. అందులోనూ రెండు రకాలుంటాయి. వాటినే సెసైల్ పాలిప్, విల్లస్ పాలిప్లంటారు. ఇవి క్యాన్సర్ సంబంధిత బొడిపెలు కాకపోయినా... కొన్నిసార్లు దీర్ఘకాలంలో క్యాన్సరస్‌గా మారవచ్చు. కాబట్టి అలాంటివి ఉన్నప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ► కొందరిలో పేగుల్లో వాపు, నొప్పి, మంట (ఇన్ఫ్లమేషన్)ను కలిగించే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, క్రోన్స్ డిసీజ్ వంటి వ్యాధులు ఉంటాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఈ సమస్యలు ఉన్నవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ► ఇక పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వారిలోనే... ఎడమవైపున వచ్చిన వారికి కుడివైపునా, కుడివైపు వస్తే... వారికి ఎడమవైపునా మళ్లీ క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ. ► స్థూలకాయం ఉండటం, పీచు పదార్థాలు లేని జంక్‌ఫుడ్, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం పెద్ద పేగు క్యాన్సర్‌కు చాలా ప్రధానమైన రిస్క్ఫ్యాక్టర్స్. ► ఇతర క్యాన్సర్ల చికిత్స కోసం రేడియేషన్, కీమోథెరపీ తీసుకునే వారిలోనూ పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ► డయాబెటిస్ ఉన్నవారిలోనూ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువే. ► సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఒక్కోసారి చిన్న వయసు వారిలోనూ కనిపించవచ్చు. కానీ చాలా అరుదు. నివారణ - చికిత్స నివారణ ►మన ఆహారంలో ఆకుపచ్చటి తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు లాంటి పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకునే వారు రెడ్ మీట్ వంటి వేటమాంసం కంటే చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. ఇక మాంసాహార ప్రియులు తమకు ఇష్టమైన మాంసాహారాన్ని తీసుకునే సమయంలో దానికి తగినట్లుగా అంతేమోతాదులో గ్రీన్‌సలాడ్స్ రూపంలో శాకాహారం తీసుకుంటూ మాంసాహారంతో వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ► పొగతాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. మద్యపానం అలవాటునూ పూర్తిగా వదిలేస్తేనే మంచిది. ► తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. చికిత్స: కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది అది ఏ దశలో ఉందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. మొదటి దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే ‘ర్యాడికల్ సర్జరీ’ అనే ప్రక్రియ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ చికిత్సను కేవలం మామూలు శస్త్రచికిత్స ప్రక్రియలోనే గాక... చిన్న గాటు పెట్టి చేసే కీహోల్ (లాపరోస్కోపిక్) పద్ధతిలోనూ చేయవచ్చు. తొలిదశలో పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించినప్పుడు అది ఉన్న ప్రాంతంతో పాటు అది ఎక్కడెక్కడికి పాకే అవకాశం ఉందో గుర్తించి, ఆ భాగాలను కూడా తొలగిస్తారు. ఇక క్యాన్సర్ ఉన్న పరిసరభాగాల్లోని లింఫ్గ్రంథులనూ తొలగిస్తారు. ఒకవేళ మలద్వారం వద్ద మలం బయటకు రాకుండా గట్టిగా ముడుచుకుపోయేట్లుగా చేసే స్ఫింక్టర్ భాగానికి క్యాన్సర్ వస్తే అప్పుడు స్ఫింక్టర్ వ్యవస్థనంతా శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మలవిసర్జన జరిగేలా పెద్దపేగులోని చివరి భాగాన్ని బయటకు ఉండేలా అమర్చాల్సి ఉంటుంది. క్యాన్సర్ ఏమేరకు విస్తరించిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని... శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలనూ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ కణితి పరిమాణం చాలా పెద్దదిగా ఉంటే ముందే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇచ్చి... దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. అప్పుడు శస్త్రచికిత్స చేస్తారు. ఒకవేళ పెద్దపేగు క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినప్పుడు కూడా మొదట కీమోథెరపీ, రేడియేషన్లను ముందుగానే ఇచ్చి, ఆ తర్వాత శస్త్రచికిత్సకు వెళ్తారు. ఇప్పుడు ఈ తరహా శస్త్రచికిత్సలన్నీ గాటు చిన్నగా ఉండే లాపరోస్కోపిక్ (కీ-హోల్) ప్రక్రియలో చేయడం సాధ్యం కాబట్టి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం, ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి తగ్గుతాయి. జాగ్రత్తలు మన పెద్దపేగు నిర్దిష్టంగా కుడివైపు భాగం, పై భాగం, ఎడమవైపు భాగం, కింది భాగం అంటూ నాలుగు స్పష్టమైన భాగాలుగా ఉంటుంది. ఇందులోఎడమవైపు భాగంతో పోలిస్తే... కుడివైపున ఉండే పెద్దపేగు కాస్త వెడల్పు ఎక్కువ. అందుకే కుడివైపు భాగంలో క్యాన్సర్ కణుతులు, అల్సర్స్ ఏర్పడితే వ్యాధి లక్షణాలు అంత సులభంగా బయటకు కనిపించవు. పైగా ఆ భాగం కాస్త వెడల్పుగా ఉండటం వల్ల విసర్జక పదార్థాలు బయటకు వచ్చేందుకు ఈ గడ్డలు పెద్దగా అడ్డంకి కాబోవు. కానీ ఆ వైపు భాగం కాలేయానికి దగ్గర కాబట్టి క్యాన్సర్ వ్యాప్తి జరుగుతూ ఉంటే అది కాలేయానికి పాకే అవకాశం ఎక్కువ. అందుకే లక్షణాలు కనిపించకపోవడం వల్ల వ్యాధి బాగా ముదిరాక గానీ డాక్టర్‌ను కలిసే అవకాశం ఉండదు. అప్పటికే జరగాల్సిన ప్రమాదం పెరిగిపోతుంది. ఇక ఎడమవైపు పెద్దపేగు భాగం కుడివైపుతో పోలిస్తే కాస్త సన్నగా ఉంటుంది కాబట్టి కణుతులు విసర్జకాలకు అడ్డుపడటం, రక్తస్రావం త్వరగా కావడం జరిగి డాక్టర్‌ను తొందరగా కలుస్తారు. అయితే మలవిసర్జన సమయంలో రక్తస్రావం అంటూ కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. నిర్ధారణ ► పెద్ద పేగు క్యాన్సర్ నిర్ధారణ కోసం తొలుత రోగిని శారీరకంగా పరీక్షిస్తారు. ఆ తర్వాత కుటుంబ చరిత్ర గురించి వాకబు చేస్తారు. ఆ తర్వాత కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. అవి... ► సాధారణ మల పరీక్ష (ఒకవేళ క్యాన్సర్ వచ్చిన భాగం మలద్వారానికి దగ్గరగా ఉంటే చేతివేళ్ల సహాయంతోనే డాక్టర్లు దాన్ని తెలుసుకోగలరు). ► కొలనోస్కోపీ (అంటే ఇది ఎండోస్కోపీ తరహాలోనే మలద్వారం గుండా కెమెరా ఉన్న పరికరాన్ని ఒక పైప్‌నకు అమర్చి లోపలికి పంపి పరీక్షించడం). కొలనోస్కోపీ పరీక్షలో ఏవైనా కణుతులు, గడ్డలు, పాలిప్స్ వంటివి కనిపిస్తే వాటి నుంచి చిన్నముక్కను తీసి బయాప్సీ పరీక్షకు పంపుతారు. ఆ పరీక్షలో అవి క్యాన్సర్ కణాలా లేక ప్రమాదరహితమైన సాధారణ బుడిపెలా అన్న విషయం నిర్ధారణగా తెలుస్తుంది. ► బేరియమ్ ఎనిమా ఎక్స్-రే పరీక్ష: ఇందులో రోగికి బేరియమ్ ఎనిమా ఇచ్చి, అది పెద్ద పేగు మొదలువరకు చేరుకున్న తర్వాత అప్పుడు ఎక్స్-రే తీస్తారు. ఆ భాగంలో ఏవైనా క్యాన్సర్ కారక కణుతులు ఉంటే ఎక్స్-రే చిత్రంలో అవి నల్లగా కనిపిస్తాయి. అప్పుడు బయాప్సీ చేసి, అవి క్యాన్సరస్ కణుతులా, కాదా అని నిర్ధారణ చేస్తారు. ఒకవేళ అవి క్యాన్సర్ కణాలే అని నిర్ధారణ అయితే, క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి స్టేజింగ్ పరీక్ష చేస్తారు. ఇందులో కణితి పరిమాణం (సైజ్), అది లింఫ్‌నోడ్స్ వరకు పాకిందా లేదా అన్న విషయం, ఇతర భాగాలకూ విస్తరించిందా లేదా అన్న సంగతి... ఈ మూడు అంశాలూ తెలుస్తాయి. ్ట ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ స్కాన్, సీఈఏ వంటి పరీక్షలూ చేసి, చికిత్స చేయాల్సిన తీరుతెన్నులను నిర్ణయిస్తారు. ్ట అవసరాన్ని బట్టి పెట్-స్కాన్ పరీక్షనూ చేయాల్సి రావచ్చు. క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్క్రీనింగ్ ► కుటుంబ చరిత్రలో పెద్ద పేగు క్యాన్సర్ రిస్క్ అంశాలు ఉన్నవారు, స్థూలకాయులు తరచూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వీళ్లు ఏడాదికి ఒకసారి ఫీకల్ అక్కల్ట్ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ► అవసరాన్ని బట్టి లేదా డాక్టర్ సూచనల మేరకు మూడేళ్లు లేదా ఐదేళ్ల కోసారి కొలనోస్కోపీ, సిగ్మాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. నిరాశ వద్దు ఒకవేళ అన్ని దశలూ దాటిపోయిన తర్వాత పెద్దపేగు క్యాన్సర్‌ను గుర్తించినా పెద్దగా నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనే కొత్త తరహా మందులవల్ల గతంతో పోలిస్తే ఇప్పుడు రోగి జీవితకాలాన్ని మరింతగా పెంచేందుకు అవకాశం ఉంది. చివరగా... పైన చెప్పిన అనేక అంశాల వల్ల పెద్దపేగు క్యాన్సర్‌ను అంత తేలిగ్గా గుర్తించే అవకాశం ఉండదు. పైగా పైల్స్ అని అపోహపడే అవకాశాలే ఎక్కువ. కాబట్టి మలద్వారం నుంచి రక్తస్రావం జరిగినప్పుడు మొదట పెద్దపేగు క్యాన్సర్ అవకాశాలనే అనుమానించి, సంబంధిత పరీక్షలు చేయించుకుని నిశ్చింతగా ఉండాలి. ఇక పెద్దపేగును నివారించేందుకు అనుసరించాల్సిన నివారణ పద్ధతులు చాలా సులువు. వేళకు భోజనం చేయడం లాంటి మంచి జీవనశైలి, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం వంటి పద్ధతులతో దీన్ని చాలా సులువుగా నివారించుకోవచ్చు. చికిత్స కంటే నివారణ ఎప్పుడూ మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అన్నివిధాలా శ్రేష్ఠం. - నిర్వహణ: యాసీన్ -
పళ్లు వచ్చేటప్పుడు విరేచనాలవుతాయా?
డాక్టర్ సలహా మా పాపకు పదినెలలు. ఇటీవల విరేచనాలు మొదలయ్యాయి. విరేచనం ఆకుపచ్చరంగులో ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే దంతాలు వచ్చేటప్పుడు ఇలాగే విరేచనాలవుతాయని మందులిచ్చారు. దంతాలు రావడానికీ విరేచనాలవడానికీ సంబంధం ఏమిటి? ఇప్పటికి రెండు పళ్లు వచ్చాయి. అన్ని పళ్లు వచ్చే వరకు ఇలాగే అవుతుందేమోనని భయంగా ఉంది. - ఎస్. ప్రవీణ, బెంగళూరు * పిల్లలకు ఆరు నుంచి పన్నెండు నెలలలోపు దంతాలు వస్తాయి. దంతాలు వచ్చేటప్పుడు ఎక్కువసార్లు విరేచనం కావడం సహజమే. దంతాలు వచ్చే ముందు చిగుళ్లు గట్టిపడి దురద పెడుతుంటాయి. దాంతో పిల్లలు చేతికి ఏది అందినా దానిని నోట్లో పెట్టుకుని కొరుకుతారు. అలా కడుపులోకి దుమ్ముధూళి కూడా వెళుతుంది. ఇలా కడుపులోకి చేరిన ఇరిటేటివ్ పార్టికల్స్‌ని దేహం వీలయినంత త్వరగా బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. మామూలుగా కంటే ఎక్కువసార్లు మలవిసర్జన జరగడానికి కారణం ఇదే. * మలం రంగు మారకుండా, మరీ నీళ్లలా కాకుండా, మలద్వారం ఒరుసుకుపోకుండా, బిడ్డ నీరసపడకుండా, జ్వరం వంటి లక్షణాలేవీ లేకుండా... బిడ్డ ఏడెనిమిదిసార్లు మలవిసర్జన చేసినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. * మలం రంగు ఆకుపచ్చగా ఉంటోంది... అంటున్నారు. దీనికి కారణాన్ని కొంత వివరంగా చెప్పాలి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి కాలేయం పిత్తరసాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆకుపచ్చగా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే పిత్తరసం ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, జీర్ణమైన ఆహారం పేగుల ద్వారా ప్రయాణిస్తుంది, వ్యర్థాలు పెద్దపేగులోకి చేరుతాయి, అక్కడి నుంచి మలద్వారం గుండా బయటకు వచ్చే క్రమంలో మలం పసుపురంగులోకి మారుతుంది. ఇందుకు పెద్దపేగులోని బ్యాక్టీరియా కూడా కారణమే. * పిల్లలు కనిపించిన ప్రతి వస్తువునూ నోట్లో పెట్టుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, జీర్ణవ్యవస్థలో హడావిడి (ఇంటస్టైనల్ హర్రీ) మొదలవుతుంది. దీంతో పిత్తరసం నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తయ్యే లోపు విరేచనం కావడంతో అదే రంగులో విరేచనం అవుతుంది. * దంతాలు వచ్చేటప్పుడు జీర్ణాశయంలో ఇరిటేషన్తోపాటు ఇన్ఫెక్షన్ కూడా తోడయితే పిల్లల్లో రోగలక్షణాలు కనిపిస్తాయి. నీరసపడడం, జ్వరం వంటి ఇబ్బందులు ఉంటే దానికి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మార్పులు మొదట్లోనే ఉంటాయి. దంతాలన్నీ వచ్చే వరకు ఇలా ఉండదు.ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. - డాక్టర్ రంగనాథ్, సీనియర్ పీడియాట్రీషియన్