పళ్లు వచ్చేటప్పుడు విరేచనాలవుతాయా?
డాక్టర్ సలహా
మా పాపకు పదినెలలు. ఇటీవల విరేచనాలు మొదలయ్యాయి. విరేచనం ఆకుపచ్చరంగులో ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే దంతాలు వచ్చేటప్పుడు ఇలాగే విరేచనాలవుతాయని మందులిచ్చారు. దంతాలు రావడానికీ విరేచనాలవడానికీ సంబంధం ఏమిటి? ఇప్పటికి రెండు పళ్లు వచ్చాయి. అన్ని పళ్లు వచ్చే వరకు ఇలాగే అవుతుందేమోనని భయంగా ఉంది.
- ఎస్. ప్రవీణ, బెంగళూరు
* పిల్లలకు ఆరు నుంచి పన్నెండు నెలలలోపు దంతాలు వస్తాయి. దంతాలు వచ్చేటప్పుడు ఎక్కువసార్లు విరేచనం కావడం సహజమే. దంతాలు వచ్చే ముందు చిగుళ్లు గట్టిపడి దురద పెడుతుంటాయి. దాంతో పిల్లలు చేతికి ఏది అందినా దానిని నోట్లో పెట్టుకుని కొరుకుతారు. అలా కడుపులోకి దుమ్ముధూళి కూడా వెళుతుంది. ఇలా కడుపులోకి చేరిన ఇరిటేటివ్ పార్టికల్స్‌ని దేహం వీలయినంత త్వరగా బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. మామూలుగా కంటే ఎక్కువసార్లు మలవిసర్జన జరగడానికి కారణం ఇదే.
* మలం రంగు మారకుండా, మరీ నీళ్లలా కాకుండా, మలద్వారం ఒరుసుకుపోకుండా, బిడ్డ నీరసపడకుండా, జ్వరం వంటి లక్షణాలేవీ లేకుండా... బిడ్డ ఏడెనిమిదిసార్లు మలవిసర్జన చేసినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
* మలం రంగు ఆకుపచ్చగా ఉంటోంది... అంటున్నారు. దీనికి కారణాన్ని కొంత వివరంగా చెప్పాలి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి కాలేయం పిత్తరసాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆకుపచ్చగా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే పిత్తరసం ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, జీర్ణమైన ఆహారం పేగుల ద్వారా ప్రయాణిస్తుంది, వ్యర్థాలు పెద్దపేగులోకి చేరుతాయి, అక్కడి నుంచి మలద్వారం గుండా బయటకు వచ్చే క్రమంలో మలం పసుపురంగులోకి మారుతుంది. ఇందుకు పెద్దపేగులోని బ్యాక్టీరియా కూడా కారణమే.
* పిల్లలు కనిపించిన ప్రతి వస్తువునూ నోట్లో పెట్టుకున్నప్పుడు ఇన్‌ఫెక్షన్ సోకినట్లయితే, జీర్ణవ్యవస్థలో హడావిడి (ఇంటస్టైనల్ హర్రీ) మొదలవుతుంది. దీంతో పిత్తరసం నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తయ్యే లోపు విరేచనం కావడంతో అదే రంగులో విరేచనం అవుతుంది.
* దంతాలు వచ్చేటప్పుడు జీర్ణాశయంలో ఇరిటేషన్‌తోపాటు ఇన్‌ఫెక్షన్ కూడా తోడయితే పిల్లల్లో రోగలక్షణాలు కనిపిస్తాయి. నీరసపడడం, జ్వరం వంటి ఇబ్బందులు ఉంటే దానికి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మార్పులు మొదట్లోనే ఉంటాయి. దంతాలన్నీ వచ్చే వరకు ఇలా ఉండదు.ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు.
- డాక్టర్ రంగనాథ్, సీనియర్ పీడియాట్రీషియన్