ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్! | health councling | Sakshi
Sakshi News home page

ఇది ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్!

Published Mon, Oct 24 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

health councling

నా వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా విరేచనాలు, మలబద్దకం... ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నాను. ఏ టైమ్‌లో విరేచనం అవుతుందో తెలియక  బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. ప్రయాణాలు చేయలేకపోతున్నాను. ఎన్నో మందులు వాడాను. హోమియోలో దీనికి చికత్స ఉందా? - దామోదర్‌రావు, నల్లగొండ
మీరు చెబుతున్న లక్షణాలతో మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే  సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. పెద్ద పేగుల్లోని అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలగజేసే వ్యాధి ఇది. ఈ సమస్యకు జీర్ణ వ్యవస్థలోని అసలు లోపమే కారణం. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లకు గురైన వారిలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారికి ఎన్ని పరీక్షలు చేసినా ఫలితాలు చాలా సాధారణంగానే ఉంటాయి. కానీ వ్యాధి తాలూకు బాధలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు లేదంటే అసలు కొంతకాలం విరేచనం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పరీక్షల్లో మాత్రం పేగుల్లో ఎలాంటి తేడా కనిపించదు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎప్పుడు విరేచనాలు మొదలవుతాయో ఊహించలేని పరిస్థితి. దాంతో దూరప్రయాణాలు చేయలేరు. ఐబీఎస్ వ్యాధిగ్రస్తులు శక్తిహీనులవుతారు. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, నిరంతరం ఏదో ఒక వ్యాధికి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఇది రోజువారీ కార్యకలాపాలకు చాలావరకు అంతరాయం కలిగిస్తుంది.

 
కారణాలు: 
మానసిక ఒత్తిడి, ఆందోళన  సరైన సమయంలో భోజనం చేయకపోవడం  మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉండటం  చికాకు, కోపం.

 
లక్షణాలు:  మలబద్దకం / విరేచనాలు  తరచూ కడుపునొప్పి రావడం  కడుపు ఉబ్బరం  విరేచనంలో జిగురు పడటం  భోజనం చేయగానే టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం.

 
హోమియో చికిత్స: మానసిక ఒత్తిడిని తగ్గించి, పేగుల్లోని అసాధారణ కదలికలను నియంత్రించే ఔషధాలను ఇస్తారు. ఈ సమస్యకు నక్స్‌వామికా, ఆర్సినిక్ ఆల్బ్, అర్జెంటికమ్ నైట్రికమ్, లైకోపోడియం, పల్సటిల్లా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. హోమియోలో వ్యక్తి రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి మందులు నిర్ణయిస్తారు. అవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.

 

డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి హైదరాబాద్

 


నడవడం కష్టమౌతోంది...
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

నా వయసు 44 ఏళ్లు. నాకు కుడిపైపు తుంటి భాగంలో నొప్పి వస్తోంది. గత ఆర్నెల్లుగా ఈ నొప్పి ఉంటోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. మా దగ్గర ఎముకల నిపుణుడిని సంప్రదిస్తే ఇది తుంటి ఎముక చివరలో ఉండే బంతి లాంటి భాగం దెబ్బతిన్నదనీ, అది ఒక రకం ఆర్థరైటిస్ అనీ చెప్పారు. నాకు హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరమని అన్నారు. అయితే నా మిత్రులు మాత్రం దానికి సర్జరీ అవసరం లేదనీ అంటున్నారు. కానీ నేను చాలా మెల్లిగా మాత్రమే నడవగలుగుతున్నాను. వేగంగా పనులు చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను చాలా ఆందోళన పరుస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి.  - కృష్ణమూర్తి, చీరాల
మీ ఫ్రెండ్స్ చెప్పినట్లే చాలామందిలో తుంటి ఎముక మార్పిడి (టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ) అనే శస్త్రచికిత్స మీద చాలా రకాల సందేహాలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. ఒకవేళ మీ ఆర్థోపెడిక్ సర్జన్ అదే సమస్య అని నిర్ధారణగా చెబితే, మరో నిపుణుడి నుంచి రెండో అభిప్రాయం (సెకండ్ ఒపీనియన్) తీసుకోవడంలో తప్పులేదు. అయితే తుంటి ఎముక మార్పిడి మీద ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు సరికాదు. అది గత 30 ఏళ్లుగా సురక్షితంగా చేస్తున్న ప్రక్రియ. నిపుణులైన డాక్టర్లు దాన్ని చేయడం వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ రావు. పైగా అది చేశాక ఆటలాడవద్దు అని ముందుజాగ్రత్తగా డాక్టర్లు చెప్పినా, పాశ్చాత్య దేశాల్లో చాలామంది సోర్ట్స్ వంటివి ఆడుతూనే ఉంటారు. టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీతో దుష్ర్పభావాలు (కాంప్లికేషన్లు) కనిపించే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే. కాబట్టి మీరు సర్జరీ గురించి అపోహలు పెట్టుకోవద్దు. కాకపోతే నిపుణులను సంప్రదించి, రెండో అభిప్రాయం మాత్రం తీసుకోండి.


నా వయసు 27 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌ను. చాలా ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాల్సి ఉంటుంది. గత రెండువారాలుగా నాకు మెడ నొప్పి చాలా తీవ్రంగా వస్తోంది. అది మెడ నుంచి కుడి భుజంలోకి పాకుతోంది. డాక్టర్‌గారిని కలిస్తే వెన్నుపూసల్లోని డిస్క్ వాపు వచ్చిందనీ, సర్జరీ అవసరం అని చెప్పారు. నాకు సర్జరీ అంటే భయం. శస్త్రచికిత్సకు బదులుగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? సలహా ఇవ్వండి. - చిన్నా, విజయవాడ

మీలా చాలా సేపు కూర్చొని పనిచేసే వారిలో ఇలాంటి సమస్య రావడం చాలా సాధారణం. అదేపనిగా గంటలకొద్దీ కూర్చొని పనిచేసేవారిలో వెన్నుపూసల్లోని డిస్క్‌లు బలహీనపడతాయి. ఒక్కోసారి వాటిలో వాపు కూడా రావచ్చు. దీని వల్ల కొద్ది నెలల తర్వాత తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే మంచి ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల, వెన్నెముకకు అనువైన, తగిన భంగిమలో కూర్చోవడం వల్ల పరస్థితి మెరుగుపడి కొద్దిరోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలాంటివారు తాము కూర్చొనిపనిచేసే సమయంలో ప్రతి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఒకసారి లేచి తమ మెడను కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి.

 
ఇక సర్జరీ విషయానికి వస్తే ఇలాంటి కేసుల్లో శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది. నొప్పి భరించలేనంత ఉండి ఆర్నెల్ల తర్వాత ఏదైనా శరీరభాగం స్పర్శ కోల్పోవడం లేదా కేవలం రెండు శాతం కంటే తక్కువ మందికే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. కాబట్టి మీరు అప్పుడే శస్త్రచికిత్స గురించి ఆలోచించకండి. తొలుత మీరు మంచి ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి మీ మెడ నొప్పి తగ్గడానికి అవసరమైన వ్యాయామాల గురించి తెలుసుకొని, వాటిని చేయండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవచ్చు.

 

డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్  హాస్పిటల్స్, హైదరాబాద్

 

 మీటింగ్స్‌లో కూడా నిద్రపోతున్నాను..!
స్లీప్ కౌన్సెలింగ్

నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడు సైతం నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - వినయకుమార్, విశాఖపట్నం
మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు.

 
సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ.  కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్‌ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్‌ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.

 
నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు  శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్‌ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది.  అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు  మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement