ఆరోగ్యం కోసం నడుం కట్టు..!
యోగా
అర్ధ చంద్రాసన
సమస్థితిలో నిలబడి కుడివైపునకు వంగి కుడి చేతిని ఫొటోలో చూపిన విధంగా కుర్చీ సీటు భాగంలో ఉంచాలి. కుడికాలుని స్ట్రయిట్‌గా భూమికి 90 డిగ్రీల కోణంలో ఉంచి, శ్వాస వదులుతూ ఎడమకాలుని పైకి తీసుకెళ్లి రెండో కుర్చీ బ్యాక్‌రెస్ట్ మీద భూమికి సమాంతరరేఖలో ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చెవికి దగ్గరగా భుజాన్ని ఉంచుతూ ఎడమ కాలుకి సమాంతర రేఖలో ఎడమచేతిని కూడా స్ట్రెచ్ చేయాలి. 3 లేదా 5 శ్వాసల తర్వాత తిరిగి శ్వాస వదులుతూ, ఎడమ చేతిని పై నుంచి పక్కకి ఎడమ కాలుని కిందకు తీసుకువచ్చి సమస్థితిలోకి రావాలి. తిరిగి రెండోవైపున కూడా ఇదేలా చేయాలి.
ఉపయోగాలు: లోయర్‌బ్యాక్ పెయిన్, వెన్నెముకలో ఉన్న అసమానతల్ని తొలగించడానికి, ఛాతీ, భుజాలు వ్యాకోచత్వంలో ఉండడానికి, చీలమండలు, మోకాలు, కాళ్లు బలోపేతం కావడానికి, బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థకి పనికొ స్తుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్, స్ట్రెస్‌ల నుంచి రిలీఫ్‌ను ఇస్తుంది.
కటి చక్రాసన
సమస్థితిలో నిలబడి కుర్చీని ఫొటోలో చూపిన విధంగా అమర్చాలి. కుర్చీ చేతి మీదుగా ఎడమ కాలుని తీసుకుని పాదాన్ని 90 డిగ్రీల్లో కుర్చీ సీటు మీద ఉంచాలి. ఎడమ మోచేతిని ఎడమ మోకాలి మీద సపోర్ట్‌గా ఉంచి శ్వాస తీసుకుంటూ కుడి అరచేతులు ఆకాశం వైపు చూపుతూ పక్క నుంచి పైకి తీసుకు వె ళ్లి కుడి భుజాన్ని కుడి చెవికి దగ్గరగా తీసుకుని పైకి సాగదీస్తూ కుడివైపు నడుం భాగాన లాగడాన్ని గమనిస్తూ వీలైనంత వరకూ ఎడమకి వంగాలి. 3 లేక 5 సాధారణ శ్వాసల తర్వాత కుడి అరచేతిని భూమి వైపు చూపిస్తూ కుడి మణికట్టుని లూజ్‌గా వదిలి, కుడి చేతిని పక్క నుంచి కిందకు తీసుకురావాలి. సమస్థితిలో నిలబడి రెండోవైపు కూడా అదే విధంగా చేయాలి.
ఉపయోగాలు: కుడివైపు నడుం దగ్గర బాగా స్ట్రెచ్ కావడం వల్ల పక్క కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఎడిపోజ్ టిస్యూలో నడుం పక్కన కొవ్వు కరగడానికి ఉపకరిస్తుంది. కుడి, ఎడమ రెండు వైపులా చేయడం వల్ల స్పైన్ ఎలైన్‌మెంట్‌కి, షోల్డర్‌జామ్, స్పాండిలైటిస్ సంబంధిత సమస్యలకి పరిష్కారం లభిస్తుంది.
పరివృత్త కటి చక్రాసన వేరియంట్ 2
పైన చెప్పినట్టు గానే కుడిచేయి పైకి స్ట్రెచ్ చేసిన తర్వాత చేతిని వెనకకు తీసుకుని ఎడమచేతిని ఎడమ కాలు కింద నుంచి వెనకకు తీసుకెళ్లి (శరీరాన్ని ముందుకు వంచి చేసినట్లయితే వెనుక రెండు చేతుల్నీ సులభంగా ఇంటర్‌లాక్ చేయగలుగుతారు) చేతులు ఇంటర్‌లాక్ చేసిన తర్వాత ఛాతీని ముందుకూ, నడుమును పక్కలకీ స్ట్రెచ్ చేస్తూ పైకి చూసే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 శ్వాసల తర్వాత వెనుకకు, కటి చక్రాసనలోకి వచ్చి సమస్థితిలోకి రావాలి. తిరిగి రెండోవైపున కూడా ఇదే విధంగా చేయాలి.
ఉపయోగాలు: పై ఆసనం వల్ల కలిగే అన్ని లాభాలతో పాటు నడుమును ట్విస్ట్ చేయడం వల్ల దిగువ వెన్నెముక భాగానికి, చేతులు రెండూ ఇంటర్‌లాక్ చేయడం వల్ల షోల్డర్ బ్లేడ్స్‌కి మంచి వ్యాయామం జరుగుతుంది.
సమన్వయం సత్యబాబు