రాజేంద్రనాథ్
కమెడియన్
రాజేంద్రనాథ్‌ను మనం ఎక్కువగా షమ్మీ కపూర్ సినిమాల్లో చూస్తాం. ముఖ్యంగా ‘దిల్ దేకే దేఖో’, ‘తీస్రీ మంజిల్’, ‘యాన్ ఈమెనింగ్ ఇన్ పారిస్’ వీటిలో అతడు అలరిస్తాడు. ఆ తర్వాత ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’, ‘ఫిర్ వహీ దిల్ లాయాహూ’, ‘మేరే సనమ్’ వంటి హిట్స్ ఉన్నాయి. ‘జబ్ ప్యార్ కిసీసే హోతా హై’ సినిమాలో ‘పొపట్‌లాల్’ అనే పాత్ర వేశాక అందరూ రాజేంద్రనాథ్ పేరు మర్చిపోయి పొపట్‌లాల్ అని గుర్తు పెట్టుకున్నారు. వీళ్లది నేపాలి నేపథ్యం ఉన్న కుటుంబం.
ప్రఖ్యాత నటుడు ప్రేమ్‌నాథ్ ఇతడి పెద్దన్న. ఇతడి సోదరి కృష్ణను రాజ్‌కపూర్ పెళ్లి చేసుకున్నాడు. చురుకైన బాడీ లాంగ్వేజ్‌తో డైలాగ్ మాడ్యులేషన్‌తో కామెడీ పండించడం రాజేంద్రనాథ్ ప్రత్యేకత. ఎక్కువ సినిమాల్లో చేయకపోయినా చేసినవాటిలో గుర్తింపు పొందాడు. సినిమా వేషాలు తగ్గాక దూరదర్శన్‌లో కూడా సీరియల్స్ చేశాడు. 75 ఏళ్ల వయసులో 2008లో గుండెపోటుతో మరణించాడు.