
సాక్షి, అమరావతి: నెల్లూరు కోర్టులో దొంగతనం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. దీనిపై కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనితతో డీజీపీ రాజేంద్రనాథ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, గంజాయి స్మగ్లింగ్ నివారణ, మహిళా భద్రత తదితర అంశాల్లో పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను ఆమెకు వివరించారు.
అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసుకు సంబంధించి కొందరు చేస్తున్న ఆరోపణలు వేరు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరని వ్యాఖ్యానించారు. దర్యాప్తులో నిగ్గుతేలిన వాస్తవాలు, ఆధారాల ఆధారంగానే కేసు కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు.
ఇతర ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారులతోనే ఈ కేసును దర్యాప్తు చేయిస్తున్నామని వివరించారు. దిశ యాప్‌ను ఇప్పటివరకు 1.24 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని డీజీపీ తెలిపారు. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న మహిళల సమాచారం బహిర్గతం కాకుండా భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. దిశ యాప్‌ను వినియోగించి ఇప్పటివరకు 10,983 మంది మహిళలు పోలీస్ రక్షణ పొందారని చెప్పారు.