యప్ టీవీ మీడియా ప్లేయర్ వచ్చేస్తోంది!
నచ్చిన సినిమా... మీకిష్టమైన సమయంలో చూడాలంటే...? సీడీ, డీవీడీ అందుబాటులో ఉండాలి. నెట్‌లోనైనా రెడీగా లభించాలి. లేదంటే.. మీ కోరిక తీరడం కష్టమే. కానీ... ఇంకో కొన్ని నెలలు ఓపిక పట్టారనుకోండి... ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా పదివేల సినిమాలు మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. అంతే కాదు... వారం పది రోజుల క్రితం నాటి టెలివిజన్ సీరియళ్లు కూడా నింపాదిగా మీకు నచ్చిన టైమ్‌లో చూసేయవచ్చు. అదెలాగంటారా? అంతా యప్ టీవీ తయారు చేసిన పరికరం మహిమ!
యప్ టీవీ గురించి మీరు వినే ఉంటారు. ఇంటర్నెట్ ద్వారా భారతీయ టెలివిజన్ ఛానళ్లను విదేశాల్లో ప్రసారం చేస్తున్న కంపెనీ ఇది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ దాదాపు 12 భాషలకు చెందిన 180 ఛానళ్లను ప్రసారం చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే తన లేటెస్ట్ ఉత్పత్తి ‘మీడియా ప్లేయర్’ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ ఐటీవీ మాదిరిగా ఉండే ఈ బుల్లి పరికరంతోపాటు యప్ టీవీ అభివృద్ధి చేసిన యూఎస్‌బీని కూడా వాడితే చాలు... ఎటువంటి ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ టెలివిజనైనా ఇంటర్నెట్ కంటెంట్‌ను అందించే స్మార్ట్ టీవీగా మారిపోతుంది. దాంతోపాటే మీడియా ప్లేయర్ ద్వారా అన్ని ఛానళ్ల ప్రసారాలను పొందవచ్చు.
సినిమాలు, టెలివిజన్ సీరియళ్లు అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ మీడియా ప్లేయర్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని నెలల్లో భారత్‌లోనూ దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కంపెనీ సీఈవో ఉదయ్‌నందన్ రెడ్డి ‘శాస్త్ర’కు తెలిపారు. ప్రస్తుతానికి తాము 1500 వరకూ సినిమాల ప్రసారానికి హక్కులు పొందామని వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికల్లా పదివేల సినిమాల హక్కులు పొందుతామని ఆయన చెప్పారు.
విశేషాలేమిటి?
డెస్క్‌టాప్‌తోపాటు ఏకకాలంలో అన్ని రకాల డివెజైస్ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటివాటిపైనా పనిచేస్తుంది. రెండు పరికరాల మధ్య కూడా ప్రసారాలు సాఫీగా సాగిపోతాయి. ఉదాహరణకు మీరు టెలివిజన్‌లో ఓ సినిమా చూస్తున్నారనుకుందాం... అకస్మాత్తుగా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకోండి. టీవీ కట్టేసి... ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌ను ఓపెన్ చేస్తే చాలు. టెలివిజన్‌లో మీరు ఆపేసిన సీన్ తరువాతి సీన్‌తో సినిమాను చూడటం మొదలుపెట్టవచ్చు. టెలివిజన్ సీరియళ్ల విషయానికొస్తే.. దాదాపు పది రోజుల క్రితం నాటి టెలివిజన్ సీరియళ్లను కూడా మీకు అనుకూలమైన సమయంలో చూసుకునే వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో యప్‌టీవీ ద్వారా కేవలం వార్తాఛానళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినోదాత్మక ఛానళ్లను కూడా నాలుగైదు నెలల్లో అందుబాటులోకి తెస్తామని యప్‌టీవీ సీఈవో తెలిపారు.