అస్త్ర తంత్ర : కాన్ఫిడెన్సే మీ బాడీగార్డ్
ఆడవాళ్లు ఆరయ్యేసరికల్లా ఇంట్లో వాలిపోయే రోజులు కావివి. స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లేవాళ్లకు చీకటి పడకుండానే ఇల్లు చేరుకోవడం అంత సులభం కాదు. హైదరాబాద్‌లాంటి బిజీ నగరాల్లో అస్సలు సాధ్యం కాదు. పైగా కాల్ సెంటర్లలో పనిచేసేవాళ్లు ఏ అర్ధరాత్రో డ్యూటీ ముగించుకుని రావలసిన పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు మనకు రక్షణ? ఎవరూ కాదు. మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి. అందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
బయటకు వెళ్లేముందు బ్యాగులో చాకు, పెప్పర్ స్ప్రే లాంటి రక్షణాయుధాలు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఏదీ లేకపోతే కనీసం కారప్పొడి, బాడీ స్ప్రే లాంటివైనా ఉంచుకోండి.
నడిచి వెళ్తున్నా, టూ వీలర్ మీద వెళ్తున్నా... వీలైనంత వరకూ షార్‌టకట్ రూట్లలో వెళ్లకండి. మనుషులు ఎక్కువగా తిరిగే రూట్లోనే వెళ్లండి.
తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మానుష్యంగా ఉండే దారుల్లో వెళ్లాల్సి వస్తే... టూ వీలర్‌ని పొరపాటున కూడా ఆపకండి. నడిచి వెళ్తుంటే కనుక బ్యాగులో ఉన్న ఆయుధాన్ని తీసి చేతితో పట్టుకోండి.
ఒంటరిగా నడుస్తున్నప్పుడు భయంగా దిక్కులు చూడటం, టెన్షన్‌గా చేతులు నులుముకోవడం, చెమట తుడుచుకోవడం వంటివి చేయవద్దు. మీ నడకలో, బాడీలాంగ్వేజీలో స్టిఫ్‌నెస్ ఉండాలి. అది మీ కాన్ఫిడెన్‌సకు చిహ్నంలా కనబడాలి. అప్పుడు మీ జోలికి రావడానికి ఎవరైనా కాస్త జంకుతారు.
ఫోను మాట్లాడుకుంటూనో, ఏదో ఆలోచిస్తూనో పరిసరాలను గమనించడం మర్చిపోవద్దు. నడుస్తూనే నలుదిశల్లో ఏం జరుగుతోందో చూసుకోవాలి.
ఆటోలు ఎక్కే ముందు డ్రైవర్‌ని కాసేపు ఏదో ఒకటి మాట్లాడించండి. అతడు మామూలుగా ఉన్నాడా లేక మద్యం సేవించి ఉన్నాడా అన్నది తెలుస్తుంది.
లేట్ నైట్ ఏ ఆటోనో, ట్యాక్సీనో ఎక్కితే... వెహికిల్ నంబర్ నోట్ చేసుకుని, వెంటనే ఇంట్లోవాళ్లకు చెప్పండి. వీలైతే ఆటో ఏ రూట్లో వెళ్తోందో ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండి.