పీల్చే విషం కన్నా... తినే విషమే ఎక్కువ! | Consume more poison than to breathe the poison | Sakshi
Sakshi News home page

పీల్చే విషం కన్నా... తినే విషమే ఎక్కువ!

Published Tue, Oct 4 2016 11:17 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

పీల్చే విషం కన్నా...   తినే విషమే ఎక్కువ! - Sakshi

పీల్చే విషం కన్నా... తినే విషమే ఎక్కువ!

పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు ప్రమాదకర స్థాయుల్లో కలుషితమైపోతున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపించవచ్చు గాక, లోలోపల మనిషిని ఈ కులుషిత శక్తులు పీల్చి పిప్పిచేస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరేం చెయ్యాలి? అంతా విషమయం అయిపోయినప్పుడు అమృతం ఎక్కడ దొరుకుతుంది? వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే చోటు నుంచి మకాం మారిస్తే, పచ్చని పరిసరాల్లో నివాసం ఏర్పరచుకుంటే కొంతవరకు బతికి బట్టకట్టొచ్చనేది జీవ , పర్యావరణవేత్తల సలహా. కానీ గాలి నుంచి తప్పించుకుంటే సరిపోతుందా? ఆహారం మాటేమిటి? ద్రవరూపంలో, ఘనరూపంలో, పండ్లు, పాలు, కూరగాయలు, మాంసాహారం వంటి రకరకాల పదార్థాల రూపంలో ఒంట్లోకి చేరుతున్న విషరసాయనాల నుంచి ఎలా తప్పించుకోవడం? సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన, సహజమైన ఉత్పత్తులను వాడడం మినహా దారి లేదు.

 

గాలిలోంచి, నీటిలోంచి.. పంటల్లోకి!
టాక్సిక్స్ లింక్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మనదేశంలో ఉంది. ఆ సంస్థ కొన్ని నెలల క్రితం యమునా నదీ పరీవాహక ప్రాంతంలో పండే కాయగూరలు, ధాన్యపు గింజల్ని ప్రయోగశాలలో పరీక్షించి మరీ, మానవ జీవితానికి అవెంతో ప్రమాదకరం అని తేల్చింది. యమున పరిసరాల్లోని వాయు కాలుష్యం, యమున నీటిలోని కాలుష్యం. సీసం, క్రోమియం, ఆర్సెనిక్, మెర్క్యురీ వంటి భార లోహాలు ఆ నీటితో పండుతున్న పంటల్లో చేరి వాటిని దాదాపు విష ఉత్పత్తులుగా మార్చేస్తున్నాయని టాక్సిక్స్ లింక్ తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది.

 

జీవిస్తున్నామా? ఏదో బతికేస్తున్నామా?
ఇదే విషయమై 2013 అక్టోబరులో ఢిల్లీ కోర్టుకు అందిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఆరోగ్యకరమైన ఆహారం లభ్యం కావడం కూడా మనిషి జీవించే హక్కులోని ఒక భాగమే’’ అని అన్నారు. దీనిని బట్టి మనం ఉంటున్న పరిసరాలు గానీ, మనకు అందుబాటులో ఉన్న నీటి వనరులుగానీ కలుషిత రహితంగా ఉన్నప్పుడు మాత్రమే మనిషి నిజంగా జీవిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. లేదా జీవచ్ఛవం కిందే లెక్క.

 
ఇప్పుడంతా మార్కెట్‌మయం అయిపోయింది. ప్రతిదీ మనకు సూపర్‌మార్కెట్ నుంచే అందమైన ప్యాకింగులతో, ఆకర్షణీయమైన ప్రకటనలతో దొరుకుతోంది. వాటిపైన ఉత్పత్తి తేదీలు ఉంటాయి. గడువు తేదీలూ ఉంటాయి. అంతమాత్రాన అవన్నీ స్వచ్ఛమైనవని కాదు. ప్రమాదరహితమైనవనీ కాదు. నిర్దేశించిన గడువులోపల ఉత్పత్తులు పాడు కాకుండా ఉండడానికి ఆయా కంపెనీలు నిల్వకారకాలను కలుపుతాయి. అలాగే రుచికోసం అని, వాసన కోసం అని మరికొన్నిటిని జోడిస్తాయి. ఇదిగో ఇలా కలిపే, జోడించే పదార్థాలే ఆరోగ్యానికి హానికరంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్ డ్రింగ్స్, పిల్లలు ఇష్టపడే కంటెయినర్ ఫుడ్ విషయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి.

 

కలుషితమా? కల్తీనా?
ఆహార ఉత్పత్తులు... అవి ఏవైనా సరే ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాయంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి సహజ ఉత్పత్తి ప్రక్రియలో అవి కలుషితం కావడం. రెండోది కృత్రిమంగా అవి కల్తీ అవడం. అయితే వీటిని వేర్వేరుగా చూడలేమని, నాణేనికి ఇవి రెండు వైపుల వంటివని డాక్టర్ సీమా గులాటీ అంటారు. న్యూఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్ ఒబేసిటీ అండ్ కొలెస్టరాల్ ఫౌండేషన్‌లో న్యూట్రిషన్ రిసెర్చ్ విభాగానికి ఆమె అధిపతి. మరెలా ఈ విపత్తు నుంచి వినియోగదారులు తప్పించుకోవడం? ఉత్పత్తి సంస్థలు అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, క్వాలిటీ కంట్రోల్ విషయంలో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న చట్టాలను మరింత పదును తేల్చి, శిక్షలను కఠినతరం చేయడం తప్ప మరో మార్గం లేదని సీమా గులాటీ అంటున్నారు.


ఈ చట్టాలు, హెచ్చరికలు ఎలా ఉన్నా, ముందైతే వినియోగదారులుగా మన కు మనం అప్రమత్తంగా ఉండడం అవసరం. ఇందుకోసం వినియోగదారుల చట్టం గురించి అవగాహన ఏర్పచుకోవడంతోపాటు, ఉత్పత్తుల కొనుగోలు సమయంలో మరికాస్త జాగ్రత్తగా ఉండాలి. ధరను, గడువు తేదీని మాత్రమే కాదు, అందులో ఏమేమి పదార్థాలు, ఎంత శాతంలో కలిసి ఉన్నాయో కూడా చూడడం అలవాటు చేసుకోవాలి. అవి పరిమితంగా ఉన్నాయా, అపరిమితంగా ఉన్నాయా అన్నది పత్రికల్లో వచ్చే వ్యాసాలను బట్టి, ప్రజాహితార్థం జారీ అయ్యే ప్రభుత్వ ప్రకటలను బట్టి తేలిగ్గానే తెలిసిపోతుంది. అప్పుడు మన నిర్ణయం మనం తీసుకోవచ్చు. వినియోగదారులు జాగృతమైతే, ఉత్పత్తిదారులూ దారిలోకి వస్తారు. ఉత్తిపుణ్యానికి అనారోగ్యం తెచ్చుకుని వైద్యుల దగ్గరికి పరుగులు తీసే బాధా తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement