
అమెరికన్ టీనేజ్ టెన్నిస్ సంచలనం.. పదిహేనేళ్ల కోకో గాఫ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దుమ్ము రేపుతోంది. ఆ దుమ్ముల్లోంచి కూతురి రాకెట్ విన్యాసాలను తిలకిస్తూ పుత్రికోత్సాహంతో పరమానంద భరితుడౌతున్న ఆమె తండ్రి కోరి గాఫ్.. ఆమె కొట్టే ప్రతి షాటుకీ ‘డామ్ (ఇట్)’.. ‘డామ్ (ఇట్).. అని అరుస్తున్నాడు. అది ఆమెకు నచ్చలేదు. ‘కొట్టు.. అద్దీ.. అలాగ..’ అని బరి బయట ఉన్నవాళ్లు అరుస్తుంటారు కదా.. అలా అంటున్నాడు ఆయన. బ్రేక్‌లో బయటికి వచ్చి.. ‘డాడీ!!’ అంది.. గుసగుసగా కోకో.
‘‘ఏంటమ్మా!’’ అన్నాడు. ‘‘అలా నువ్వు డి–వర్డ్‌ని యూజ్ చెయ్యకు. బాగుండదు’’ అంది. ‘‘తప్పేముందమ్మా.. ఆటే కదా..’’ అన్నాడు తండ్రి. ‘‘ఆట కాబట్టే అనకూడదు డాడీ..’’ అంది. ‘‘సర్సరే.. ఐయామ్ సారీ.. ఇక అనను. ఒకేనా’’ అన్నాడు తండ్రి. మళ్లీ ఆ డి–వర్డ్‌ని యూజ్ చెయ్యలేదు ఆయన. సోమవారం ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 7–6, 6–3 తేడాతో ముప్పై తొమ్మిదేళ్ల సీనియర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్‌ని కోకో గాఫ్ పరుగులు పెట్టిస్తున్నప్పుడు కూడా ఆయన చూస్తూ ఆనందించారు తప్ప, చప్పుడు చెయ్యలేదు.