ముడతల్ని మడిచేయండి
బ్యూటిప్స్
పెదవులు అందంగా ఉండాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. అందుకు ఒక్క లిప్‌స్టిక్ రాసుకుంటేనే సరి కాదు కదా. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటివి రాసుకునే ముందు స్క్రబ్ చేసుకోవడం మంచిది. అందుకో మంచి ఇంటి చిట్కా. మెత్తని కాఫీ పౌడర్‌లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పెదాలకు మర్దన చేసుకుంటూ రాసుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కొని వెంటనే కొబ్బరి నూనె లేదా ఏదైనా నేచురల్ లిప్‌బామ్ రాసుకోవాలి. దాంతో పెదాలు మృదువుగా తయారవుతాయి.
చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతోంది. ఆ ముడతలు రావడానికి అనేక కారణాలున్నాయి. మానసిక ఒత్తిడి, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, పొడి చర్మం ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి, బాదం నూనె/ కొబ్బరి నూనె కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అరచేతుల్లాగే వాటి వెనుక భాగం (నకల్స్) కూడా అందంగా మెరవాలని అందరూ కోరుకుంటారు. మరి దానికి పాటించాల్సిన చిట్కా ఒకటుంది. అదే చేతులను నానబెట్టడం. ఓ గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో 5-6 చుక్కల గ్లిజరిన్, కొద్దిగా రోజ్‌వాటర్, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో రెండు చేతులను 10-15 నిమిషాల పాటు పెట్టి వెంటనే వేరే నీటితో కడిగేసుకోకుండా టవల్‌తో తుడుచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో చేతులను కడుక్కోవాలి. దాంతో నల్లగా కనపడే నకల్స్ కూడా అందంగా అరచేతి రంగులోకి వస్తాయి.