వెలలేని తల!
అశోకుడు గొప్ప చక్రవర్తి. కళింగయుద్ధం తర్వాత బౌద్ధాన్ని స్వీకరించి యుద్ధాలు మానేశాడు. ఒక రోజున ఒక బౌద్ధభిక్షువు ఆయనకు ఎదురయ్యాడు. అశోకుడు మోకాళ్లమీద కూర్చుని, శిరస్సు వంచి, ఆ భిక్షువుకు నమస్కరించాడు. ఇది ఆయన పక్కనే ఉన్న మంత్రికి నచ్చలేదు. తన అభిప్రాయాన్ని ‘‘మహారాజా! తమరు భరతఖండంలో మహోన్నత చక్రవర్తులు. మీ శిరస్సు, కిరీటం వొంగడం సమంజసం కాదు’’ అని చెప్పాడు. అశోకుడు చిరునవ్వు నవ్వి అప్పటికి ఊరుకున్నాడు.
రెండురోజుల తర్వాత ఒక మేక తల, ఒక జింక తల తెప్పించి పళ్లెంలో పెట్టి అమ్ముకు రమ్మని సేవకుణ్ణి పంపాడు. వాడు చాలా తక్కువ సమయంలోనే వాటిని అమ్మి వచ్చాడు. ఆ మరునాడు అప్పుడే మరణించిన ఒక మనిషి తలను కూడా ఒక పళ్లెంలో పెట్టి అమ్ముకు రమ్మన్నాడు. వాడు మధ్యాహ్నం దాకా ఊరంతా తిరిగినా ఎవరూ కొనలేదు. మనిషి తలను అమ్మకుండా తిరిగొచ్చి ‘‘ప్రభూ! దీన్ని ఎవరూ కొనలేదు’’అన్నాడు. ‘‘సరే! మరలా వెళ్లు. ఈ సారి ఉచితంగా ఇస్తాను అని చెప్పు’’ అని అతన్ని పంపాడు. ఆ సేవకుడు సాయంత్రానికి తలతో తిరిగి వచ్చాడు. ‘‘ప్రభూ! ఉచితంగా ఇస్తానన్నా ఎవ్వరూ తీసుకోలేదు’’అని చెప్పాడు.
అప్పుడు అశోకుడు తన మంత్రితో మంత్రి మహాశయా! ఇది ఒక దొంగవాడి తల. అందుకే కొనలేదు. మరి, దీని స్థానంలో నా తలను ఉంచితే కొంటారా?’’ అని అశోకుడు మంత్రిని అడిగాడు. ఆ మాటతో మంత్రికి జ్ఞానోదయం అయింది. అశోకునికి వినమ్రంగా నమస్కరించాడు.
- బొర్రా గోవర్ధన్