ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో... ఆ మాటకొస్తే మన దేశంలోనే ఒక విపత్కరమైన పరిస్థితి ఉంది. కరోనా వైరస్ గురించి భరోసా ఇవ్వడానికో లేదా ధైర్యం చెప్పడానికో ఎవరైనా నాలుగు మాటలు మాట్లాడితే... దాన్ని తీసుకొని ‘ఇంత నిర్లక్ష్యమా... చైనాలో, ఇటలీలో పరిస్థితులు కనిపించడం లేదా’ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. అలాగని... అక్కడి పరిస్థితులను వివరించి కాస్త అప్రమత్తంగా ఉండమని చెబితే ‘ఎందుకు మరీ ఇంతలా బెదరగొడుతున్నారు’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నిపుణులు ఏం చెప్పినా... అటు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండమనో... ఇటు మరింతగా బెంబేలెత్తిపొమ్మనో కాదు.
ఈ రెండు కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో, ఈ రెండు అంశాల మధ్య బ్యాలెన్స్‌డ్‌గా ఎలా వ్యవహరించాలో చూద్దాం.
భారత్‌లో మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. కేరళకు వచ్చిన వుహాన్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి కేసు ఇది. ఆ తర్వాత ఫిబ్రవరి రెండున, మూడున కేరళలోని కాసర్‌గోడ్‌లో మరో రెండు కేసులను గుర్తించారు. ఇవి కూడా చైనా నుంచి వచ్చిన వారిలోనే. ఇక మార్చి 1–15 వరకు మొత్తం 110 కేసులను గుర్తించారని కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ వివరాలు తెలుపుతున్నాయి. అదే తెలంగాణ ప్రభుత్వం చెప్పే వివరాలను బట్టి రాష్ట్రంలో ఇప్పటికి ఆరుగురు రోగులను గుర్తించారు. 66.000కు పైగా ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ఇంజనీరుకు కరోనా ఉన్నట్లు అనుమానించగానే అతడు లేదా అతడిని తాకారని భావించిన 36 మందిని గుర్తించి వారందరినీ ట్రాక్ చేసి, వారికి పరీక్షలు నిర్వహించారు.
మన దేశం, రాష్ట్రాల్లో ఈ వారమే కీలకం...
మన రాష్ట్రంతో పాటు దాదాపు దేశమంతటా మార్చి మొదటివారంలో (జనవరి 30న కనుగొన్న కేసును మినహాయించి) కరోనా కేసులు కనుగొన్నారు. ఇప్పటికి రెండో వారం గడిచి మూడోవారంలోకి మనం ప్రవేశించనున్నాం.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి, రెండో, మూడో వారం నాటి ధోరణులను చూద్దాం. న్యూయార్క్‌లో మొదటివారం రెండు కేసులు నమోదు కాగా... రెండోవారంలో ఆ సంఖ్య 105కు పెరిగింది. మూడో వారంలో రోగుల సంఖ్య కాస్తా 610కి మించిపోయింది. అలాగే ఫ్రాన్స్‌లో మొదటి వారంలో 12 మంది రోగులను కనుగొంటే... రెండోవారానికి 190 మంది మూడో వారానికి ఆ సంఖ్య 660కి పెరిగింది. ఇరాన్‌లో పరిస్థితి ఇంకా భీతావహంగా ఉంది. మొదటివారంలో కేసుల సంఖ్య 2 మాత్రమే ఉండగా రెండోవారంలో 43, మూడోవారంలో 245, మూడోవారంలో 4,400కు పైగా, ఐదో వారంలో దాదాపు 13,000 కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో మొదటివారంలో 3, రెండోవారంలో 150, మూడోవారంలో 1036, నాలుగోవారంలో 6,300, ఐదోవారంలో 21,157 కేసులు నమోదయ్యాయి.
ఇక మన భారత్ విషయానికి వద్దాం. మొదటివారంలో 3 కేసులు, రెండో వారంలో 24 కేసులు, మూడోవారంలో 110 కేసులు వచ్చాయి. ఈ గణాంకాల ధోరణలు పరిశీలిస్తే... మొదటి వారం కంటే రెండోవారినికి వందల సంఖ్యలో కేసులు పెరిగితే... రెండో వారం నుంచి మూడోవారానికి అవి వేల సంఖ్యకు చేరుకున్నాయి. నాలుగు–ఐదు వారాల్లో 10,000 సంఖ్యను తాకుతున్నాయి. అంటే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అంటే... మూడో వారం నుంచి నాలుగోవారానికి వేల సంఖ్యకు చేరుతున్నందున.... ఇప్పుడు మనం మూడో వారంలో ఉన్నందున ఈ దశలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.
మరణాల శాతం తక్కువఅని నిర్లక్ష్యం వద్దు
అందరూ చెబుతున్న మాట ఏమిటంటే... కరోనా కేసుల కారణంగా నమోదైన మరణాలు 2 శాతమేనని. ఈ సంఖ్య చాలా తక్కువగా అనిపించినా మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఎంతమాత్రమూ నిర్లక్ష్యం వహించడానికి వీల్లేని పరిస్థితి. మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు. అందుకే కేవలం ఒక శాతం మందికి కరోనా సోకినా... రోగుల సంఖ్య కోటి మందికి పైమాటే. అందులో రెండు శాతం అంటే... రెండు కోట్ల మంది. ఈ సంఖ్యను ఊహించడానికే భయంగా ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉంటూనే... భయం లేకుండా వ్యవహరించమని నిపుణుల సలహా ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం నిపుణులు ఏవైనా ధైర్యవచనాలు చెబితే నిర్లక్ష్యాన్ని పెంచుతున్నారనీ... ఏవైనా జాగ్రత్తలు ఉటంకిస్తే అసలే భయపడుతున్న తరుణంలో మరింతగా బెంబేలెత్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పారాసిటమాల్‌తో చికిత్స అంటే...
చికిత్సకు పారాసిటమాల్ పనికి వస్తుందంటే... కేవలం పారాసిటమాల్ వల్లనే కరోనా వైరస్ నయమవుతుందని కాదు. కానీ పారాసిటమాల్ కీలక భూమిక వస్తుందన్న విషయంలో సందేహం లేదు. ఎందుకంటే... వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధికైనా లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడం సాధ్యమవుతుంది. అంటే... అది ఏ వైరస్ అయినప్పటికీ, దాని కారణంగా జ్వరం వస్తే అది తగ్గేందుకు, దానితోపాటు కనిపించే తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు తగ్గేందుకు ఇచ్చే తొలి మాత్ర ‘పారాసిటమాల్’. దాని తర్వాత అవసరాన్ని బట్టి ‘ఫావిలావిర్’ అని కరోనా కోసం ఏర్పరచి ప్రోటోకాల్‌లో నిర్ణయించిన మాత్ర... ఆ తర్వాత అవసరాన్ని బట్టి వ్యాధి నిరోధకత పెంచేందుకు ఒక్కోసారి హెచ్‌ఐవీకి వాడే మాత్రలను డాక్టర్లు ఇస్తుంటారు. తమదైన ప్రోటోకాల్‌తో కరోనా వైరస్‌ను నయం చేసిన మన జైపూర్ డాక్టర్ల చికిత్స విధానాన్ని తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వెల్లడవుతోంది. ఇప్పటికి ఇంకెక్కడా దీనికి నిర్దిష్టమైన ప్రోటోకాల్ లేనందున, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎమ్‌ఆర్) సంస్థ అనుమతితో మనం స్వయంగా ఈ ప్రోటోకాల్ రూపొందించుకున్నాం. అయితే... పారాసిటమాల్ అనేది అందరికీ తెలిసిన మాత్ర కాబట్టి దానిని ఉదాహరిస్తుంటారు తప్ప... అదే సర్వ వైరస్‌ల రోగాలకు నివారిణి అని కాదు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు కొందరు విమర్శలకు దిగుతుంటే... నిర్లక్ష్యంగా వ్యవహరించే మరికొందరు పారాసిటమాల్ చాలట అంటూ ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఈ రెండు ధోరణులూ తప్పే. అతి భయమూ కూడదు. ఉదాసీనతా పనికి రాదు.
గణాంకాలు ధైర్యం కోసమే...
ఇటీవల చివరి రోగిని సైతం డిశ్చార్జ్ చేసిన చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారిని పరిశీలిస్తూ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా తెలిసిన వివరాల ప్రకారం... మొత్తం 72,000 మంది రోగులను పరిశీలించగా... వారిలో గుండెజబ్బులు ఉన్న వెయ్యి మందిలో 105 మంది, డయాబెటిస్‌తో బాధపడుతున్న వెయ్యిలో 73 మంది, ఆస్తమా ఉన్న వెయ్యిమందిలో 63 మంది హైబీపీతో బాధపడుతున్న వందమందిలో ఆరుగురు రోగులు, క్యాన్సర్‌తో బాధడుతున్న 1000 మందిలో 56 మంది మరణించారని తేలింది. అంటే... గుండెజబ్బులున్నవారిలో దాదాపు 90 శాతం, డయాబెటిస్‌తో బాధపడేవారలో 93 శాతం, ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో 94 శాతం, క్యాన్సర్ వ్యాధిగస్తుల్లో 95 శాతం మంది సురక్షితమని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏ జబ్బూ లేనివారిలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే మృతి చెందారని ఈ వివరాలు చెబుతున్నాయి. దీని అర్థం గుండెజబ్బులున్నవారిలో 10.5% మంది, డయాబెటిస్‌తో బాధపడుతున్నవారిలో 7.3% మంది, ఆస్తమా ఉన్నవారిలో 6.3 శాతం మంది, హైబీపీ రోగుల్లో 6% మంది ‘మాత్రమే’ మరణించారని చెబితే... ఈ ‘మాత్రమే’ అన్న పదాన్ని పరిగణనలోకి తీసుకుని వారు చనిపోయినా పర్వాలేదా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. అయితే ఇక్కడి గణాంకాల ద్వారా చెప్పే విషయం ఏమిటంటే... ఆ కొద్దిశాతం మంది మరణించినా పర్లేదని దాని అర్థం కాబోదు. కేవలం ఇంత కొద్దిశాతం మాత్రమే మరణాలు ఉన్నందున, మనమంతా ఆశాజీవులం కాబట్టి... ఒకవేళ వ్యాధిసోకినా కూడా... మనం కూడా బతికి బయటపడ్డ వారి జాబితాలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువ అని భరోసా ఇవ్వడమే. ప్రతి జీవితమూ చాలా విలువైనదే, అమూల్యమైనదే (ఎవ్రీ లైఫ్ ఈజ్ ప్రెషియస్). కాబట్టి ఇక్కడ పేర్కొన్న శాతాలను బట్టి మిగతావాళ్లు చనిపోయినా పర్వాలేదు అనేలా వ్యాఖ్యానించడం పొరబాటన్నది వైద్యనిపుణుల, అధ్యయనవేత్తలు/గణాంకవేత్తల, శాస్త్రవేత్తల మాట.
ఏ విషయాలైనా వివరించినప్పుడు దాన్ని పట్టుకుని అయితే ఆ చివరకో... లేదంటే ఈ చివరకో (ఎయిదర్ దిస్ ఎక్స్‌ట్రీమ్... ఆర్ దట్ ఎక్స్‌ట్రీమ్) అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. అలాగే ధైర్యం–భయాందోళనల విషయంలో అటు చివర, లేదంటే ఇటు చివర ఉండటం కూడా తప్పే. ఏ విషయంలోనైనా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా ఈ తరుణంలో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది.- డాక్టర్ ఎస్. మల్లికార్జున్ రావు,సీనియర్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్,అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment