![India Says Will Supply Key Drug To Covid 19 Badly Hit Nations - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/7/representative3.gif.webp?itok=dvpGFoI4)
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌తో అల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన మందులను సరఫరా చేస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మహమ్మారిని కట్టడి చేయడంలో సత్ఫలితాలు అందిస్తున్న పారాసిటమోల్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘అంటువ్యాధి ప్రబలుతున్న తరుణంలో మానవతా దృక్పథంతో పారాసిటమోల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడిన పొరుగు దేశాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. నిర్దిష్ట స్థాయిలో ఎగుమతి చేస్తాం. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాలకు కూడా సహాయం అందిస్తాం. ఇందులో రాజకీయాలకు ఎటువంటి తావులేదు. విపత్కర పరిస్థితుల్లో భారత్ అంతర్జాతీయ సమాజానికి సంఘీభావం తెలుపుతోంది. అన్ని దేశాలు పరస్పర సహాయసహకారాలు అందించుకోవాలి’’ అని పేర్కొన్నారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్ )
కాగా కరోనాను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహాయం కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒకవేళ భారత్ తమకు సహకరించనట్లయితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. వాణిజ్య పరంగా తమ నుంచి అనేక ప్రయోజనాలు పొందిన భారత్‌తో సత్పంబంధాలు కొనసాగుతాయని ఆశిస్తున్నానని సోమవారం నాటి సమావేశంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత మందుల సరఫరాకు ససేమిరా అన్న భారత్.. మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment