కరోనా మహమ్మారి మూలంగా పనులు దొరక్క... అలాగని పస్తులుండలేక స్వగ్రామాలకు ప్రయాణం కడుతున్న వలస కార్మికులకు ఆహారాన్ని అందించే వారున్నారు... ఉపాధి కోల్పోయిన వారికి ఆసరా ఇచ్చేవారున్నారు. నెలవారీ సరుకులు ఇచ్చి ఆదుకునే వితరణ శీలురున్నారు. ఇలా ఎవరికి ఎవరు ఎలాంటి సహాయం చేస్తున్నా ఆందోళన పడుతున్న వారి భుజం మీద చేయి వేసి ‘నీకు ఏం కాదు’ అని భరోసా ఇచ్చి, వారి వెన్ను తడుతూ మరేం పర్లేదు తోడుగా మేమున్నాం అని మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాళ్లు ఉండాలి. అవతలి వారి కష్టాన్ని ఓపిగ్గా విని, ఈ కష్టాన్ని తేలిక చేసే మాట సహాయం అందించాలనుకునే వాళ్లు కూడా ఉండాలి. ఇటువంటి వారి కోసం కమ్యూనిటీ రేడియోలు, సమాచారాన్ని అందించే హెల్ప్‌లైన్‌లు ఉన్నాయి. వాటితోసాటే సున్నిత మనస్కుల మనో నిబ్బరం దెబ్బతినకుండా వారికి మేము అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలనుకున్నాం. ఊహించని పరిణామాలకు దిగులుతో కుంగిపోకుండా ధైర్యంగా డీల్ చేసుకునేలా కౌన్సెలింగ్ ఇస్తున్నాం’ అంటున్నారు ‘కోవిడ్ సాథీ’ ఫౌండర్ మాలా పరోపకారి. ఆమె మాజీ ఐఆర్‌ఎస్ అధికారి. మూడు వారాలుగా ఈ హెల్ప్ లైన్ సేవలను అందిస్తోంది... (వదల బొమ్మాళీ..!)
‘దీదీ.. నా పేరు రాణి మిర్ధా. నాతోపాటు ఇంకో ముగ్గురు అమ్మాయిలున్నారు. మాది జార్ఖండ్. ఇక్కడ (హైదరాబాద్) ఓ కంపెనీలో పనిచేసేవాళ్లం. లాక్‌డౌన్‌తో పనిపోయింది. చేతిలో ఉన్న డబ్బయిపోయింది. తిండికి కూడా లేదు. భోజనం పంచే వాళ్లు మీ నంబర్ ఇచ్చారు. మా ఊరెళ్లాలి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని ఏడుస్తూ ఈ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ఆ అమ్మాయి. వెంటనే స్పందించిన కోవిడ్ సాథీ.. హైదరాబాద్ పోలీసు అధికారుల సహాయంతో ఆ తెల్లవారే మొదలైన రైలులో వాళ్లను జార్ఖండ్‌కు పంపించారు. ఈ నలుగురూ 20 ఏళ్లలోపు వాళ్లే. అందులో ముగ్గురికి పెళ్లయింది. ఒక అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా. భర్త చెన్నైలో పనిచేస్తున్నాడు. పిల్లలు అత్తామామల దగ్గర జార్ఖండ్‌లో. చెన్నైలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సహాయంతో ఆమె భర్తను కూడా చెన్నై నుంచి జార్ఖండ్‌కు పంపించే ప్రయత్నం చేస్తోంది కోవిడ్ సాథీ. ఒక్క హైదరాబాద్ నుంచే కాదు తెలంగాణ, ఆం«ధ్రప్రదేశ్, కర్ణాటక మొదలు జైపూర్, ముంబై, చండీగఢ్ వంటి నగరాల దాకా దేశం నలుమూలల నుంచీ కోవీడ్ సాథీకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
రోజూ వందకు పైగా కాల్స్‌కు సమాధానం
రోజుకి కనీసం 150 ఫోన్‌కాల్స్‌ను రిసీవ్ చేసుకుంటోందీ హెల్ప్‌లైన్. ఇంటి పని, ఇంట్లో ఆఫీస్ పని ఈ రెండింటి ఒత్తడితో సతమవుతూ కొందరు, ఉద్యోగ అభద్రతతో ఇంకొందరు, ఉన్న చిన్న వ్యాపారం భవిష్యత్ ఏం కానున్నదోనన్న బెంగతో మరికొందరు, వయసైపోయిన తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన తాము పెద్దవాళ్ల మీదే ఆధారపడే దైన్యస్థితి వచ్చిందనే ఆందోళనతో పిల్లలు, బెంగతో పెద్దలు, కరోనా లాక్‌డౌన్ వల్ల కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే గడుపుతూండడంతో తలెత్తుతున్న సమస్యలతో మరికొందరు, గృహహింసను ఎదుర్కోలేక కొందరు... కాల్స్ చేస్తుంటారు.
మాలా పరోపకారి, రజని, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమా నాగరాజ్, డాక్టర్ హరిణి, సైకాలజిస్ట్ ప్రతిభా సోము, రేవంత్ సహా ఐఐటీ, ఐఐమ్ పట్టభద్రులు, మాజీ సివిల్ సర్వెంట్స్‌తో కలిపి మొత్తం పాతికమంది వరకూ కోవిడ్ సాథీ ద్వారా కన్సెలింగ్ చేస్తున్నారు. సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు మినహా మిగిలిన వాళ్లంతా బాధితులతో ఎలా మాట్లాడాలి, వాళ్లకు ఎలా ఓదార్పునివ్వాలో తర్ఫీదు పొందారు. మాట మాత్రమే కాదు అవసరమైతే మానసికంగా సై్థర్యాన్ని కలిగించే కౌన్సెలింగ్ వైద్యాన్నీ, ఉపాధి సాయాన్నీ అందిస్తోంది కోవిడ్ సాథీ. ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఈ హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది. కోవిడ్ సాథీ హెల్ప్ లైన్ నంబర్ 7702500928.
Comments
Please login to add a commentAdd a comment