
సైకిల్ తొక్కండి... చల్లబడండి!
మీరు తరచుగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఆగ్రహంతో ఊగిపోతున్నారా? ఉత్సాహలేమితో బాధ పడుతున్నారా? ఏ పనీ చేయాలనిపించడం లేదా? అయితే మీకో కూల్ ఐడియా...పై లక్షణాలు మీలో కనిపించినప్పుడు నడకకు లేదా సైకిల్ తొక్కడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీలో సరికొత్త ఉత్సాహం తొంగిచూస్తుంది.
‘సైకిలింగ్, నడక ద్వారా కలిగే ఉపయోగాలు’ అంశంపై నార్‌విచ్ మెడికల్ స్కూల్, ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు ఆడం మార్టిన్ అధ్యయనం చేశారు. ఎక్కువగా నడిచేవారు, ఎక్కువగా సైకిలింగ్ చేసేవారి జీవన శైలిని, మానసిక స్థితిగతులను లోతుగా అధ్యయనం చేశారు. తన అధ్యయనానికి సంబంధించిన వివరాలను ‘ప్రివెంటివ్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురించారు.
‘‘మరీ ఎక్కువ దూరమైతే తప్ప నడకకు లేదా సైకిలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే మంచిది. దీనివల్ల ఆఫీసుకు ఆలస్యం అవుతుందనుకుంటే...కాస్త ముందుగానే బయలుదేరితే మంచిది’’ అంటున్నాడు మార్టిన్.
‘‘మా ఇంటి నుంచి ఆఫీసు పదికిలోమీటర్ల దూరం. గత పదిహేడు సంవత్సరాల నుంచి రోజూ ఆఫీసుకు నడిచే వెళుతున్నాను. ఇప్పటి వరకు నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు. రోజూ ఇరవై కిలోమీటర్ల దూరం నడుస్తున్నాను కాబట్టి... ప్రత్యేకంగా వ్యాయామాలేవి చేయడం లేదు. రవాణా ఖర్చులు కూడా మిగులుతున్నాయి’’ అంటున్నాడు లండన్‌లో పని చేసే ఒక ఉద్యోగి.
అతని సంగతి పక్కన పెట్టండి. మరి మీరు?