నాన్నా! డబ్బంటే క్రెడిట్ కార్డు కాదు.. | daddy money is not a credit card | Sakshi
Sakshi News home page

నాన్నా! డబ్బంటే క్రెడిట్ కార్డు కాదు..

Published Sat, Jan 18 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

నాన్నా! డబ్బంటే క్రెడిట్ కార్డు కాదు..

నాన్నా! డబ్బంటే క్రెడిట్ కార్డు కాదు..

  కార్లు, ఫోన్లు ఆస్తులనుకోకు  తనయుడికి ఓ తండ్రి సలహా  రాజేశ్‌కు ఐటీ ఉద్యోగి. బ్యాంకు ఖాతా  తెరవటం ఆలస్యం కావటంతో మొదటి నెల జీతం చెక్కు రూపంలో ఇచ్చింది యాజమాన్యం. ఆ చెక్కు తెచ్చి తండ్రికి చూపించాడు రాజేశ్. అది చూస్తూ... ఆయన రాజేశ్‌కు ఏం చెప్పాడో తెలుసా?

  బాబూ!! డబ్బంటే ఇదే. నీ దగ్గరున్న క్రెడిట్ కార్డులు కాదు. నీ ఖర్చనేది ఈ డబ్బును బట్టే ఉండాలి తప్ప నీ క్రెడిట్ లిమిట్‌ను బట్టి కాదు. నెల తిరిగేసరికల్లా నువ్వు ఈజీగా ఎంత తిరిగి చెల్లించగలవో... అంత పరిమితినే వాడు.

  కార్లు, టీవీలు, ఫోన్లు, ఏసీలు వగైరాలన్నీ ఆస్తులేనని అంతా చెబుతుంటారు. అది నిజం కాదు. అవి అప్పులే. కారణమేంటంటే అవి తరిగిపోతుంటాయి. వాటిని ఉపయోగించడానికి కూడా నీకు డబ్బు కావాలి. అలాంటి నకిలీ ఆస్తుల్ని అట్టే పోగేసుకోకు.

  చేతిలో డబ్బుల్లేవని ఇబ్బంది పడకుండా, నీ డబ్బులెక్కడున్నాయో నీకు తెలిసేలా... ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్లని, బీమాని విడిగా చెయ్యి. ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా పనికొచ్చే బీమా పాలసీని కొనకపోవటమే మంచిది.

  అప్పు చేయటమంటే... నువ్వు భవిష్యత్తులో సంపాదించబోయే డబ్బుని కూడా ఇప్పుడే ఖర్చుచేయటం. అందుకని జాగ్రత్త. నిజంగా అవసరమొచ్చి అప్పు తీసుకోవాలనుకుంటే... తగిన మొత్తాన్ని, తగిన వడ్డీకి మాత్రమే తీసుకో.

  ఏ పొదుపైనా సరే. త్వరగా ఆరంభించు. దాన్ని మానకుండా కొనసాగించు. షేర్లు, డిపాజిట్లు, ఆస్తులు, బంగారం ఏదైనా సరే... కాలాన్ని బట్టే పెరుగుతాయి. కాలమే ముఖ్యం.

  పన్ను తగ్గించుకోవటం ముఖ్యమే. అందుకోసమని డబ్బంతా తీసుకెళ్లి రాబడి రానిచోట పెట్టుబడి పెట్టడం సరికాదు. అయినా పన్ను పొదుపు కోసం మార్చి దాకా ఆగొద్దు. ఏప్రిల్లోనే మొదలుపెట్టు.
  జీవిత బీమా, మెడికల్ ఇన్సూరెన్స్... ఇలా ఏది ఎంచుకున్నా సరళంగా ఉండే పాలసీని తీసుకో. సంక్లిష్టంగా పదిరకాలు కలిసి ఉండేవి ఎక్కువ లాభాన్నిస్తాయని అనుకోవద్దు.

  షేర్లు కొంటావా? అది మార్కెట్ నిపుణులకు వదిలెయ్. కారు డ్రైవింగ్ వచ్చు కాబట్టి రేసుల్లోనూ నడిపేస్తానంటే కుదరదుగా! అందుకని మ్యూచ్‌వల్ ఫండ్స్ లాంటివి ఎంచుకుంటే మంచిది.
  రంగురంగుల ప్రకటనలు, అందమైన వాగ్దానాలు ఎప్పుడూ నమ్మొద్దు.

  పర్సనల్ ఫైనాన్స్ మరీ కష్టమైందేమీ కాదు. నువ్వు స్కూల్లో చదివిన మిగతా సబ్జెక్టుల్లాంటిదే. అందుకని డబ్బు ఖర్చు చేసే ముందు... దాన్నెలా ఖర్చు చేయాలో తెలుసుకోవటానికి కొంత సమయం ఖర్చబెట్టు. ఆల్ ది బెస్ట్. చూశారుగా... ఇవి రాజేశ్‌కి వాళ్ల నాన్న చెప్పి ఉండొచ్చు. కానీ మనందరికీ కూడా పనికొచ్చేవే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement