
దండ... దండనం!
ట్రాఫిక్-టాపిక్
మూత్రాతురాణాం న భయం న లజ్జ.ఇలా అయితే ఎలా అన్నది సమాజం వర్రీ. ఎక్కడ పడితే అక్కడా...? ఇదీ పోలీసుల క్వెర్రీ. ఒక దశకు వచ్చాక క్లాస్‌లో చిటికనవేలు చూపించడానికే బిడియపడతామే! మనమే పబ్లిక్‌లో ఇలా చేస్తే ఎలా? అందుకోసమే పోలీసులు వెరైటీగా దండతో దండిస్తున్నారు.
కుక్కలు కూడా ఈమధ్య స్తంభాలపైకి కాలెత్తడం లేదు. అలాంటిది మనుషులమైన మనం దిక్కులు చూడకుండా ఇలా చేయడం సబబు కాదేమో ఆలోచించమంటున్నారు మన సికింద్రాబాద్ పోలీసులు. అంతేకాదు... తమదైన శైలిలో ఖాకీగిరీ చేయకుండా గాంధీగిరీ చేసి మరీ యోచించమంటున్నారు. ఈ ఖాకీగిరీ ఏమిటా అనే సందేహం మిమ్మల్ని పట్టి పీడించి, ఝాడించి, వేధిస్తుంటే ఈ నాలుగు ముక్కలూ చదవాల్సిందే.
ముంబైకి బిజినెస్‌మ్యాన్ రూపంలో ప్రిన్స్ మహేశ్‌బాబు వెళ్లినట్లుగా మన రాష్ట్రాలకు ఎవరూ రాలేదు. అయినా కొంతమంది మూత్రాతురులు గోడల్ని అదేపనిగా తడిపేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్ వెళ్లండి... ఆరోగ్యానికి అదే లాభదాయకం అన్నా వినడం లేదు. పక్కలకైనా చూడకుండా, మహిళలు ఎవరైనా వస్తున్నారా అనే ధ్యాస కూడా లేకుండా గోడవారగా నిలబడి మూత్రవిసర్జనం గావిస్తున్నారు కొందరు ఆత్రపరులు.
అవేమైనా అప్పుడే కొత్తగా కట్టిన సిమెంట్ గోడలా క్యూరింగ్ చేయడానికి? ఈ జబ్బును క్యూర్ చేయడం ఎలా అని ఆలోచించారు మహంకాళి పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి. అంతే... ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమల్లోకి వచ్చాక ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాల్సిందే. అదే సమయంలో అల్పబుద్ధుల తాలూకు అల్పాచమనం అరికట్టాల్సిందే. అందుకు ఇన్‌స్పెక్టర్ రామస్వామికి ఒక ఉపాయం తట్టింది. దానికి ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. పరిసరాలెరగకుండా ప్రకృతి పిలుపునకు పరవశించిపోయేవారి పని పట్టాలనుకున్నారు. ప్రకృతిలోనే బహిరంగ విసర్జనకు పాల్పడుతుండేవారిని గుర్తించేందుకు కొందరు సిబ్బందిని నియమించారు. వారు సికింద్రాబాద్ బస్‌స్టాప్‌లోనూ, ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ సిగ్గుపడకుండా చిటికెనవేలి పనిని కానిస్తున్న వారిని చూశారు. కొట్టలేదూ... తిట్టలేదు. దండ వేసి, దండం పెట్టారంతే. పాటలూ అవీ ఏవీ పాడకుండానే ‘మా మూత్రవీరులకూ మంచిపూదండా’ అంటూ సెలైంట్ సందేశం ఒకటి పంపించారు. అంతే... జనాలు నడవాల్సిన ఫుట్‌పాత్‌లను మడుగులా మార్చడానికి మాది గుండా, చెరువా అని సిగ్గుపడేలా చేశారు ఆ ఇన్‌స్పెక్టర్. దండ దండనానికి దడిసిపోయిన మూత్రాసురులు నలుగురూ తిరిగే రోడ్డును మరెప్పుడూ మురికిచేయబోమంటూ సిగ్గులమొలకలైపోతూ చెబుతున్నారు. ఇలా రోజూ సన్మానం చేయించుకునేవారి సంఖ్య కనీసం పదిహేను మందివరకూ ఉంటుందంటున్నారు ఇన్‌స్పెక్టర్ రామస్వామి. ‘‘ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ పీక్ అవర్స్.
ఆ సమయంలో మేం ట్రాఫిక్‌కు అవరోధం కల్పించము. ఆ తర్వాతే రోడ్డు మీద ఈ రకమైన చిటికెనవేలి ఘనాఘన విసర్జనపరులను సత్కరిస్తున్నాం. ఇలా చిటికెలో ముగించవచ్చులే అనుకునే చిటికెనవేలి వీరులను సన్మానించడం వల్ల రోడ్డు మీద ఈ వ్యవహారం క్రమంగా తగ్గుతోంది. ఈ రోజు కూడా సికింద్రాబద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లో ఈ సత్కార సత్కార్యాన్ని చేశాం. ఇలా ఈ శుక్రవారం వరకు కొనసాగిస్తాం’’ అన్నారు ఇన్‌స్పెక్టర్ రామస్వామి. అంతేకాదు... ఆయన వినూత్న కార్యకలాపాల్లో ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచేలా ఇంకొన్ని విధులూ ఉన్నాయి. ‘‘ట్రాఫిక్‌లో ద్విచక్రవాహనాలపై హెల్మెట్ లేనివాళ్లను ఆపుతున్నాం. అయితే వాళ్లకు మేం జరిమానాలు వేయడం వంటివి చేయడం లేదు. సుప్రీం కోర్టు పేర్కొన్న హెల్మెట్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాదు... ఇదే సమయంలో హెల్మెట్ పెట్టుకొని ఉన్న వారిని అభినందిస్తూ, వాళ్లకు ‘చాక్లెట్’లను బహూకరిస్తున్నాం’’ అని అన్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామస్వామి.