
గాడ్‌ఫాదర్ లేడు. ఇండస్ట్రీలో నాటుకుపోయిన కులపెద్ద లేడు. కాకా పట్టే గుణం లేదు. ఒక్క ఎర్రబస్ టికెట్ మాత్రం ఉంది. ఒక్కరు కూడా వేలెత్తి చూపలేని ప్రతిభ ఉంది. అనుకున్నది అయ్యేవరకు వదలని దీక్ష ఉంది. దళం లేకున్నా పట్టుంది. పట్టుదల ఉంది. చివరి ‘ఎర్రబస్’ ఎక్కేదాకా సినిమాపై అంతులేని అభిమానం ఉంది. అనంతమైన ప్రేమ ఉంది. గుర్తుకొస్తున్న గురువుగారికి.. ఇదిగో.. అక్షర దక్షిణ!
దాసరి నాకు గురువు కాదు
అందరికీ తెలియని విషయం ఏంటంటే దాసరి నాకు గురువు కాదు. మేమిద్దరం స్నేహితులం. 54 సంవత్సరాల స్నేహబంధం మాది. ఆయనది పాలకొల్లు, మాది నరసాపురం. ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఆయన బి.కాం నేను బి.యస్సీ చేశాం. మేం ఇంటర్మీడియట్ చదివే రోజులనుండే నాటకాలాడేవాళ్లం. ఆయన రాసిన ‘పన్నీరు–కన్నీరు’ నాటకంలో మేమిద్దరం అన్నదమ్ములుగా నటించాం. ఆ నాటకానికి మచిలీపట్నంలోని ‘బృందావనం నాటక కళా పరిషత్’ వారు దాసరిని ఉత్తమ నటుడు, నన్ను ఉత్తమ సహాయ నటుడు అవార్డులతో సత్కరించారు.
ఆయన ‘ఇది కాదు జీవితం’ అని మాతో చెప్పి మదరాసు వెళ్లిపోయారు. అలా వెళ్లిన తర్వాత మా నాటక సమాజంలో ఉన్న స్నేహితులందరినీ మదరాసు రమ్మన్నారు. మేం ఒక్కొక్కరం చిన్నగా అక్కడికి చేరుకున్నాం. వెళ్లామే కానీ హోటల్‌లో ఉండే తాహతు ఎవరికీ లేదు. అప్పటికే దాసరి పెళ్లి చేసుకున్నారు. మదరాసు వెళ్లిన పదిమందిని తన ఇంట్లోనే ఉండమన్నారు. మాకోసం ఆయన సర్దుకుపోయేవారు. అలా వెళ్లిన పదిమంది సినీ పరిశ్రమలో ఏదో ఒక శాఖలో బాగానే స్థిరపడ్డాం. మా అందరికీ కర్త, కర్మ, క్రియ అంతా దాసరే. మేమందరం మంచి నటులమే కానీ సినీ పరిశ్రమలో నెట్టుకు రావటం ఎంత కష్టమో అందరికీ అర్థం అయింది.
దాసరి రైటర్‌గా చాలా బిజీగా ఉండేవారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారాయన. రైటర్‌గా అర్ధరాత్రి రెండింటి వరకూ రాస్తుంటే నేను వాటన్నింటినీ తెల్లారే సరికల్లా ఫెయిర్ చేసి ఇచ్చేవాణì ్న. ఆ సమయంలో నేను విపరీతంగా సిగరెట్ కాల్చేవాణ్ని. ఆయనే కొని తెచ్చి ఇచ్చేవారు. ఒకరోజు ఆయన లేని సమయంలో నేను సిగరెట్ తాగుతూ ఏదో రాసుకుంటున్నాను. ఆ సమయంలో ఓ నిర్మాత అటుగా వచ్చాడట. ఆయన వచ్చి వెళ్లినట్టు నాకు తెలియదు. ఆ రోజు దాసరి ‘ఇలా అయితే ఇక్కడ చాలా కష్టం. నిర్మాతల ముందు సిగరెట్ కాల్చటం అంటే వాళ్లను అవమానపరచటం కిందే లెక్క. నువ్వు చేసింది తప్పు’ అన్నారాయన.
నాకు చాలా కోపం వచ్చింది. ‘నేను నీ ముందే సిగరెట్ తాగుతాను. ఎవరో గురించి నన్నంటావా’ అంటూ నా చేతిలో ఉన్న ప్యాడ్‌ను నేలకేసి కొట్టాను. అది తన ముక్కుకి తగిలి కొద్దిగా రక్తం వచ్చింది. అప్పుడు నేను లోపలికెళ్లి నా బ్యాగ్ తీసుకొని బయటికెళ్తుంటే ‘అబ్బాయి సత్యం.. ఎక్కడికి’ అంటూ నన్ను ఆపే ప్రయత్నం చేశారు దాసరి పద్మగారు. ‘సత్యం.. ఇప్పుడేమీ అవ్వలేదు, ఏం కాలేదు’ అని దాసరి వారిస్తున్నా వినకుండా ‘నీకు నాకు రాంరాం’ అంటూ నా దారిన నేను వెళ్లిపోయాను. కట్ చేస్తే.. 1973వ సంవత్సరం దాసరి ‘తాతా మనవడు’ సినిమాతో స్టార్ డైరెక్టరయ్యారు.
నా దారిన నేను నా కమ్యూనిస్టు భావజాలంతో జనంలో తిరుగుతూ మీటింగ్‌లు గట్రా అంటూ హడావిడిగా ఉండేవాణ్ని. ‘మే’ డే సందర్భంగా రాజమండ్రి దగ్గరలోని ఓ ఊరిలో ప్రసంగించటానికి వెళ్లాను. అప్పుడు ఆయన తీస్తున్న ‘చిల్లర కొట్టు చిట్టెమ్మ’ షూటింగ్ అదే ఊరిలో జరుగుతోంది. ఇది తెలుసుకున్న దాసరి తన అసిస్టెంట్లను పంపించి నన్ను పిలిపించారు. ఆ రోజు రాత్రిని నేనెప్పటికీ మరచిపోలేను. అది నా జీవితాన్ని మార్చిన రాత్రి అని చెప్పొచ్చు. నన్ను చూడగానే హత్తుకుని ‘అయిందేదో అయిపోయింది.
ఇక మద్రాసు బయలుదేరు’ అంటూ కట్టుబట్టలతో నన్ను తీసుకెళ్లారు. ‘ఇకనుండి మన ప్రయాణం ముందుకే సత్యం. ఎప్పుడూ వెనక్కి వద్దు’ అన్నారు. అప్పటికి దాసరి పెద్ద డైరెక్టర్. నాలాంటి మామూలు వాణ్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్నేహానికి ప్రాణమిచ్చే దాసరి అవేమీ పట్టించుకోకుండా మళ్లీ నన్ను మదరాసు తీసుకెళ్లారు. ఆ తర్వాత రెండేళ్లకు నాకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. గత సంవత్సరం మే 30న జ్ఞాపకాలన్నింటినీ నాకొదిలి ఆయన వెళ్లిపోయారు.
– దర్శకుడు ధవళ సత్యం
ట్రైన్‌లో కథ రెడీ అయింది
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. ఆయన నాకు వాటన్నింటితో పాటు మంచి స్నేహితుడు, ఫిలాసఫర్, మార్గదర్శి అన్నీ. తన శిష్యులందరూ పైకి రావాలని తాపత్రయపడేవాడాయన. దర్శకుడిగా ఆయనకు ఎక్కడైనా పెద్ద హోటల్‌లో బస ఏర్పాటు చేస్తే ఆయనతో పాటు మమ్మల్ని కూడా అక్కడే ఉండమనేవారు. ఏదైనా సినిమా విడుదలై విజయం సాధిస్తే ఆ సినిమాలోని సీన్ గురించి ఎవరైనా మాట్లాడితే ఆ సీన్ రాసింది ఫలానా అసిస్టెంట్ అని పదిమందికి చెప్పేవారాయన.
‘నిర్మాతను దృష్టిలో ఉంచుకొని మనం సినిమా తీయాలి. మన నిర్మాత నవ్వుతుంటే మనం సక్సెస్ అయినట్లే’ అని చెప్పేవారు. సక్సెస్‌ను తలకెక్కించుకోకూడదని శిష్యులందరికీ చెప్పేవారు. ఒక సరదా సంఘటన చెప్తాను. హైదరాబాదు నుంచి బెంగళూరుకు ట్రైన్‌లో వెళ్తున్నాం మేమంతా. ఆయన చెప్తుంటే నేను రాసుకుంటూ వెళ్లాను. తెల్లారిపోయింది. ట్రైన్‌లోనే కథ, డైలాగ్ వెర్షన్ రెడీ అయ్యాయి. అదే ‘స్వర్గం–నరకం’ సినిమా. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
ఓసారి నేను, ఆయన ఓ ప్రముఖ చానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లాం. సడన్‌గా గురువుగారు ఇంటర్వ్యూ ఆపమన్నారు. నాకు భయమేసింది. ‘రామకృష్ణా.. తలకు గుడ్డ కట్టలేదేం’ అన్నారు. ‘సార్ మీ ముందు’ అన్నాను. అప్పుడాయన ‘నీ ఐడెంటిటీ నీ తలగుడ్డ. నువ్వు ఎప్పుడూ నీలా ఉండాలి’ అన్నారు. ‘మనం సినిమా తీసేది ఆస్కార్ అవార్డు కోసం కాదు. మన నిర్మాత ముఖంలో నవ్వు, ఆయన చేతి నుండి పొందే 100 రోజుల షీల్డే మనకు ఇంపార్టెంట్’ అని ఆయన చెప్పేవారు. నిర్మాతల శ్రేయస్సు కోరుకున్న మంచి దర్శకుడు.
– దర్శకుడు కోడి రామకృష్ణ
నిజమైన పులితో యాక్ట్ చేయించారు
నాకు, దాసరిగారికి ఒక కంపేరిజన్ ఉంది. సినీ పరి శ్రమ మొదట్లో మదరాసులో ఉండే టైమ్‌లో నేను పదిహేను సంవత్సరాలకు పైగా ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కి అధ్యక్షుడిగా వ్యవహరించాను. అప్పుడు ఆర్టిస్టులందరి బాగోగులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ల సమస్యలను తీర్చినందుకే పదిహేను సంవత్సరాలు పైగా అధ్యక్షునిగా కొనసాగాను. ఆ తర్వాత కాలంలో పరిశ్రమ అంతా మదరాసు నుండి హైదరాబాద్ వచ్చింది. అప్పటికే దాసరి ఇక్కడ 24 శాఖల వారితో బాగా కలిసి మెలిసి ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
అన్ని శాఖలు బావుంటేనే పరిశ్రమ బావుంటుందనేవారాయన. కేవలం ఆర్టిస్టుల సమస్యలను తీర్చటమే చాలా కష్టం అనుకుంటుంటే ఏకంగా ఇండస్ట్రీలోని అన్ని శాఖల వారి కష్టాలను ఓపికగా విని, వాళ్లందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారాయన. అందుకే ఆయన అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మిగిలిపోయారు. నాకు పర్సనల్‌గా ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. నేను చాలా సినిమాలు ఆయనతో కలిసి పనిచేశాను. అప్పుడే ‘అడవిరాముడు’ విడుదలై సంచలన విజయం సాధించింది.
‘నీతో అంతకంటే మంచి సినిమా చేస్తాను అబ్బాయ్’ అని, ‘కటకటాల రుద్రయ్య’ మొదలుపెట్టారు. అందులో పులితో చాలా సీన్లుంటాయి. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ వచ్చాయి కానీ ఆ రోజుల్లో నిజమైన పులితో నటించాను. పులితో ఎలా యాక్ట్ చెయ్యాలి? అని దాసరిగారు చెప్పేవారు. అదే సినిమాను హిందీలో జితేంద్ర చేసినప్పుడు పులితో యాక్ట్ చేయడానికి భయపడ్డారట. నాకు ‘రెబల్ స్టార్’ బిరుదు రావటానికి దాసరిగారు ఓ కారణమనే చెప్పాలి.
– నటుడు కృష్ణంరాజు
రాయితో ఫట్‌మని కొట్టారు
నేను మద్రాసు వెళ్లి చిన్న చిన్న వేషాలు వేసే రోజుల్లో ఇంటర్మీడియెట్ చదువుతూ పరీక్షలు రాసి పాసయ్యా. ఎన్టీఆర్‌గారి పేరు పక్కన ‘బీఏ’ అని ఉండటం చూసి, నేను కూడా ఆ డిగ్రీ చేయాలనుకున్నా. ఇంటర్ రిజల్ట్ రాగానే గురువుగారితో నేను బీఏ పూర్తయ్యాక వస్తాను, వేషాలకి హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేశా. వెళ్లి రా.. తప్పకుండా వేషం ఇస్తానన్నారు. 1976లో డిగ్రీ పూర్తి చేసి మద్రాసు వెళ్లా. అప్పుడు మా గురువుగారు ‘నీడ’ సినిమా స్టార్ట్ చేశారు. అందులో కృష్ణగారి అబ్బాయి రమేశ్‌బాబుగారు హీరో. నాది సెకండ్ లీడ్ వేషం.
ఓ రోజు మూడు టేక్‌లు తిన్నా. రాళ్ల క్వారీలో షూటింగ్ జరుగుతోంది. ఓ రాయి తీసుకొని గురువుగారు ఫట్‌మని కొట్టారు. దెబ్బ గట్టిగా తగలడంతో నాకు కోపం వచ్చింది. ‘రమేశ్‌బాబుగారు ఎన్ని టేక్‌లు తిన్నా.. బాగా చేయమ్మా అంటూ బుజ్జగిస్తున్నారు. నన్ను మాత్రం కొట్టారేంటి?’ అనడిగా. మళ్లీ ఫట్‌మని కొట్టారు. ‘నోర్ముయ్ రా.. రమేశ్‌బాబు మా సినిమాలో యాక్ట్ చేయాలని మేమే కృష్ణగారిని అడిగాం. కానీ, నువ్వొచ్చి నన్ను అడిగావ్‌రా. నీ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకో. నువ్వు యాక్ట్ చేయలేదని కొడితే కృష్ణగారబ్బాయిని కొట్టలేదని నన్ను ప్రశ్నిస్తావా?’ అన్నారు గురువుగారు. కరెక్టే కదా.
సినిమా పిచ్చితో మద్రాసు వెళితే ఆ మహానుభావుడు నా ఊరేంటో? పేరేంటో? నా కులమేంటో? మతమేంటో తెలుసుకోకుండా ఎంకరేజ్ చేశారు. ఇంత మంచి వేషం ఇస్తే నేనేంటి? ఇలా అనేశాను అని ఫీలయ్యా. నేను స్టూడెంట్‌ని. ఆయన టీచర్. స్టూడెంట్ తప్పు చేస్తే టీచర్ కొడతాడు.. కొట్టాలి కూడా. అలా కొట్టా రు మా గురువుగారు. కరెక్టే కదా అనుకుని నేను బాధతో ఓ మూలకెళ్లి కూర్చుని ఫీలవుతున్నా. లంచ్ బ్రేక్ టైమ్ వచ్చింది. నేను తినటం లేదు. ‘రారా ఇటు.. తిను’ అంటూ మా గురువుగారు భోజనం పెట్టారు. ఆయనకేం అవసరం? ఆయన గ్రేట్ పర్సనాలిటీ. నాలాంటివాళ్లకి ఒక అండ.. భరోసా. గ్రేట్ మేన్. గురువుగారూ... సెల్యూట్.
– దర్శక–నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి
ఆ ఆకాంక్ష నెరవేరలేదు
దాసరిగారు పెద్ద దర్శకుడే కాదు... పెద్ద మనసున్న వ్యక్తి. ఇబ్బందుల్లో ఉన్న కొందరు పేద కళాకారులకు నెల నెలా ఆర్థిక సహాయం చేసేవారు. నాకు బాగా గుర్తు. దాదాపు 20 ఏళ్ల క్రితం అనుకుంటా.. గురువుగారు ఫైనాన్షియల్‌గా కొంచెం ట్రబుల్‌లో ఉన్నారు. అప్పుడు కూడా ప్రతి నెలా పేద కళాకారులకు డబ్బులు పంపించేవారు. అంత మంచి మనిషి. ఇక.. దాసరిగారి తీరని కోరికల్లో ఒకటి అలానే మిగిలిపోయింది.
ఆయనకు సావిత్రిగారంటే అభిమానం. ‘అక్కా’ అని పిలిచేవారు. ఫిల్మ్‌నగర్‌లో సావిత్రిగారి విగ్రహం పెట్టాలనుకున్నారు.చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఎమ్మెల్యేని. కిరణ్‌కుమార్ రెడ్డిగారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ అనుమతి కోసం నా ద్వారా గురువుగారు ప్రయత్నం చేయించారు. ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉన్నప్పటికీ టెక్నికల్ రీజన్స్ వల్ల కుదరలేదు.
ఆ తర్వాత కూడా దాసరిగారు ప్రయత్నాలు చేశారు కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. ఒక కథానాయికకు విగ్రహం పెట్టాలని గురువుగారు సంకల్పించడం మరో కథానాయికగా నాకు ఆనందాన్నిచ్చింది. అది నెరవేరిందా? లేదా? అన్నది వేరే విషయం. నటీమణులంటే దాసరిగారికి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం.
– నటి జయసుధ
గురువుగారి మాటలు గుర్తొస్తున్నాయి
ఒక రోజు మా గురువుగారు నాతో మాట్లాడుతూ.. ‘‘పద్మ ఉన్నంతకాలం నాకు ఏ కష్టం, లోటు తెలియలేదు. ఆవిడ పోయిన తర్వాత తెలుస్తోంది’’ అన్నారు. ఆ రోజు ఆయన అన్న ఆ మాటలు రోజూ ఏదో సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయంటే.. పరిశ్రమలో ఎవరికి కష్టం వచ్చినా గురువుగారి దగ్గరకు వెళితే చాలు పరిష్కారమవుతుంది. ఆయన ఉన్నప్పుడు లేని కష్టాలు, కన్నీళ్లు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నాయి.
ఈ మధ్య పరిశ్రమలో జరిగిన అనేక సంఘటనలను ప్రపంచమంతా నివ్వెరపోయి చూసింది. అప్పుడు అందరూ ఒక మనిషి పేరే తలచుకున్నారు. ఆయనే దాసరి గారు. గురువుగారిలానే ఎంతోమంది అద్భుతమైన దర్శకులు ఈ పరిశ్రమలో ఉన్నారు కానీ వారంతా వారి పని చూసుకుని వెళ్లిపోతుంటారు. అది నేరమేమీ కాదు. దాసరి గారి ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
24 శాఖల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంటి దారే పట్టేవారు. ఎవరు ఏ సమయంలో వెళ్లినా ఆకలితో బయటికెళ్లేవారు కాదు. దాసరిగారితో పాటు ఆయన డైనింగ్ టేబుల్ మీద ఓ యాభైమంది భోజనం చేసేవాళ్లం అంటే అతిశయోక్తి కాదేమో. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఓ నిర్మాత కలిసి మీ గురువుగారిలాంటి వ్యక్తి ఇంకో అవతారం ఎత్తి రావాలి అంటుంటే నా కళ్లు చెమర్చాయి.
– దర్శకుడు రేలంగి నరసింహారావు
నాకూ గురువుగారే
సినిమా ఇండస్ట్రీలో అంకుల్‌ని అందరూ ‘గురువుగారూ’ అంటారు. నాక్కూడా ఆయన గురువుగారే. జీవితానికి ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇచ్చారు. ‘క్రమశిక్షణ చాలా ముఖ్యం’ అనేవారు. ఆయన్నుంచి నేను నేర్చుకున్నది క్రమశిక్షణ. ఆయన విషయంలో నాకు ఆశ్చర్యంగా అనిపించినదేంటంటే.. హ్యాపీనెస్‌ని అందరితో పంచుకునేవారు.
కష్టాలను మాత్రం ఒక్కరితోనూ చెప్పుకునేవారు కాదు. వెరీ స్ట్రాంగ్. నేనోసారి ‘‘మాతో కష్టాలను షేర్ చేసుకోవచ్చు కదా అంకుల్’ అంటే, ‘‘మనిషికి కష్టం అంటే మరణం మాత్రమే. మిగతాదేదీ కష్టం కాదు. సాల్వ్ చేసేసుకోవచ్చు. ఎవరి దగ్గరా చెప్పుకోనక్కర్లేదు. సమస్య వచ్చినప్పుడు ఒక బంతిలా నేను బౌన్స్ బ్యాక్ అవ్వగలను’’ అన్నారు.
అత్తయ్య (దాసరి పద్మ)గారు ఉన్నంతవరకూ ప్రతి ఆదివారం మేమందరం లంచ్‌కి కలవాల్సిందే. గోదావరి జిల్లావాళ్లకు మర్యాదలు ఎక్కువ అంటారు కదా. ఇక అల్లుడికైతే చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా మా అంకుల్ నాకు ఎక్కువ మర్యాదలు చేసేవారు. బయటివాళ్ల దగ్గర నా గురించి చెప్పేటప్పుడు ‘అల్లుడుగారు’ అనేవారు. చెప్పాలంటే.. అలాంటి వ్యక్తికి అల్లుణ్ని కావడం నా అదృష్టం.
– డా. రఘునాథ్‌బాబు (దాసరి అల్లుడు)






Comments
Please login to add a commentAdd a comment