ప్రేమి విశ్వనాథ్ అంటే మనవాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, ‘కార్తీకదీపం’ సీరియల్ ‘దీప’ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నల్లటి రూపంతో చిన్నితెర మీద ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ప్రేమి విశ్వనాథ్ పుట్టినిల్లు కేరళలోని ఎర్నాకులం. మలయాళం టెలివిజన్‌లో ‘కరతముత్తు’ (తెలుగు కార్తీక దీపం) అనే సీరియల్ ద్వారా ప్రేమి అక్కడివాళ్లకు కార్తీకగా పరిచమయ్యింది. బ్లాక్‌బ్యూటీగా మనవారిచేత అభినందనలు అందుకుంటున్న దీప ఆఫ్‌స్క్రీన్‌లో ఫెయిర్‌గా ఉంటుంది. అంతే ఫెయిర్‌గా తన మనసులోని విషయాలను పంచుకుంటుంది.
సీరియల్‌లో ఈ పాత్రను మీరెలా ఒప్పుకున్నారు?
సినిమానే కాదు టెలివిజన్ పరిశ్రమ కూడా గ్లామర్‌నే చూపిస్తుంది. ఫెయిర్‌గా ఉండే హీరోయిన్సే ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు. అయితే, ఈ సీరియల్‌లోని ప్రధాన పాత్ర ఒంటి రంగు నలుపుగా ఉండటం ఇందులోని కాన్సెప్ట్. దాన్నే సవాల్‌గా తీసుకున్నాను. తెలుగు సీరియల్‌లో డాక్టర్ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) భార్యగా నటించాను.
మీ గురించి తెలుసుకోవచ్చా?
మా అమ్మనాన్నలు విశ్వనాథ్, కాంచన. భర్త డా.టి.ఎస్.వినీత్ భట్. అతను ప్రముఖ ఆస్ట్రాలజర్. నేను లా చేశాను. కొచ్చిలో ఒక ప్రైవేటు సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసేదాన్ని. మా అన్నయ్య శివప్రసాద్ ఫొటోగ్రాఫర్, ఆర్టిస్ట్ కూడా. ఆ విధంగా నాకూ ఫొటోగ్రఫీ అబ్బింది. పెళ్లిళ్లకు ఫొటోలు తీసేదాన్ని. ఫొటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. నేనో ట్రావెల్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాను. ‘కరతముత్తు’ (మలయాళం సీరియల్) లో కెమెరా ముందు నటించడానికి మా స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ బాగా ఉపయోగపడింది.
‘దీప’ గురించి చెప్పండి..
‘కరతముత్తు’ సీరియల్ 2013లో మలయాళం టెలివిజన్‌లో మొదలయ్యింది. ఆ తర్వాత తెలుగులో 2017లో రీమేక్ అయ్యింది. ‘కరతముత్తు’లో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుగులో దీప (కార్తీకదీపం) క్యారెక్టర్‌కి అంతే మంచి పేరొచ్చింది. ఈ సీరియల్ కోసం మేకప్‌కి, క్యాస్టూమ్స్‌కి కనీసం రెండు గంటలు పడుతుంది. నా కుటుంబం, స్నేహితులకు నేను తెలిసినప్పటికీ నాకు ఇంతగా గుర్తింపు వచ్చింది మాత్రం సీరియల్ ద్వారానే. ఈ సీరియల్ ద్వారా ఏషియానెట్ టెలివిజన్ అవార్డ్, స్టార్ మా పరివార్ అవార్డ్స్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి.
ఫ్యూచర్ గురించి
ఫుల్ టైమ్ యాక్టర్‌గానే ఉంటాను. ఈ సీరియల్ ఉన్నంతవరకు ఇందులోనే కొనసాగుతాను. సీరియల్ రేటింగ్ పెరగడానికి స్టోరీ లైన్‌లో మార్పుల కోసం నేనూ చర్చలో పాల్గొంటుంటాను. కొత్త విషయాల గురించి తెలుసుకుంటుంటాను. ఆ తర్వాత అంటారా.. ఏదైనా వ్యాపారం కొనసాగిస్తాను. సినిమాల్లో యాక్ట్ చేయచ్చు. నేను డ్యాన్సర్‌ని కూడా. స్టేజ్ షోల మీద నృత్యప్రదర్శనలు కూడా ఇచ్చాను.
Comments
Please login to add a commentAdd a comment