
ఈ అమ్మాయిలు చైతన్యదీపికలు!
బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియని చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ‘వాయిస్ 4’ చలువ వల్ల కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. సరికొత్తగా తమను తాము పునర్నిర్మించు కుంటున్నారు. ‘వాయిస్ 4 గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థ(హైదరాబాద్) ప్రతి యేటా చలికాలం, వేసవి కాలాల్లో బాలికల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో క్యాంపులు నిర్వహిస్తుంది.
క్యాంపులో నృత్యం, గానంతో పాటు గుర్రపు స్వారీ, స్పోకెన్ ఇంగ్లీష్, ఉపన్యాస మెలకువలు, నాయకత్వ లక్షణాలు.. మొదలైనవి నేర్పిస్తారు. వ్యక్తిత్వవికాసానికి అవసరమైన శిక్షణ ఇస్తారు. రెండు వారాల నుంచి నాలుగు వారాల పాటు కొనసాగే ఈ క్యాంపులలో కాలేజి విద్యార్థులు, ఉపాధ్యాయలు, కౌన్సెలర్‌లు పిల్లలకు పాఠాలు చెబుతారు. ‘‘ఒక అమ్మాయిని చైతన్యవంతం చేయగలితే ఆ అమ్మాయి తన కుటుంబాన్ని, సమాజాన్ని చైతన్యవంతం చేయగలదు’’ అని నమ్ముతుంది వాయిస్ 4 గర్ల్స్.