ఢిల్లీ జైత్‌పూర్‌లో ఒక వృద్ధురాలు కన్నుమూసింది. అంత్యక్రియలు చేయవలసిన కుమారుడు మానసిక వికలాంగుడు. ఇరుగుపొరుగుని పిలిచినా వచ్చే అవకాశం లేదు. బంధువులెవరూ ఢిల్లీలో లేరు. 66 సంవత్సరాల భర్త జస్పాల్ సింగ్‌కు ఏం చేయడానికీ దిక్కు తోచలేదు. పోలీసులకు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించారు. మరుక్షణంలో పోలీసులు జస్పాల్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. భర్త జస్పాల్‌తో పాటు ముగ్గురు పోలీసులు ఆమెను భుజాల మీద శ్మశానానికి మోసుకెళ్లారు. ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు. జస్పాల్ సింగ్ స్వస్థలం అమృత్‌సర్. అందువల్ల అతనికి ఢిల్లీలో సన్నిహితులెవరూ లేరు. భార్య సుధా కాశ్యప్ (62) ఆరు నెలలుగా అనారోగ్యంగా బాధపడుతోంది. ముందు రోజు రాత్రి ఎప్పటిలాగే ఆహారం తీసుకుంది. హాయిగా నిద్రపోయింది.
అదే గాఢ నిద్ర అని తెల్లవారే వరకు జస్పాల్‌సింగ్‌కు తెలియదు. నిద్ర లేవగానే ఆమె ఎప్పటిలాగే పిలవకపోవటంతో, జస్పాల్‌కు విషయం అర్థమైంది. నలభై సంవత్సరాలుగా కలిసి జీవించిన తన సహచరి, తన నుంచి దూరం కావటంతో జస్పాల్‌కు ప్రపంచమంతా చీకటిగా కనిపించింది. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయలేకపోయాడు. అందుకే పోలీసులను బంధువులుగా ఆహ్వానించాడు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్, కాన్‌స్టేబుల్స్ ఆయన ఇంటికి చేరుకుని, ఆ ఇంటి బిడ్డగా వారి ఆచారాలను అనుసరించి, కర్తవ్యం నెరవేర్చారు. పోలీసులంటే చట్టం, న్యాయం కాపాడేవారు మాత్రమే కాదు, అవసరమైతే ఒక ఇంటి వారసుడిగా అంత్యక్రియలు కూడా నిర్వహించగలమని చూపారు.
Comments
Please login to add a commentAdd a comment