డేంజరస్ డెంగ్యూ! | Dengue Dangerous! | Sakshi
Sakshi News home page

డేంజరస్ డెంగ్యూ!

Published Wed, Sep 7 2016 11:13 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM

డేంజరస్  డెంగ్యూ! - Sakshi

డేంజరస్ డెంగ్యూ!

నేను డెంగ్యూని. యుద్ధరంగంలో హెలికాప్టర్లు తిరిగినట్లుగా రొద పెడుతూ తిరగుతుంటాయి మా వాహనాలు. ఆ వాహనాల పేర్లే దోమలు. ఏడిస్ ఈజిప్టై అనే ఒక రకం హెలికాప్టర్‌లో డెంగ్యూ అనే వ్యాధి కలిగించే నేను ఎగురుతూ ఉంటాను. ఆ శత్రువుల శరీరం కనిపించగానే నా వాహనానికి ఉన్న మాండిబుల్ అనే సిరంజి లాంటి సూది సహాయంతో శత్రువు ఒంటిలోకి దూరిపోతుంటా. ఇదే పని నా మిత్రుడు మలేరియా కూడా చేస్తుంటాడు. అయితే వాడు ఎక్కే వాహనం వేరే. ఆ హెలికాప్టర్ పేరు ఎనాఫిలస్. అతడి వాహనం రాత్రిపూటా, పగటి పూటా... ఇలా రెండు వేళలల్లోనూ ఎగురుతుంటుంది. కానీ నా హెలికాప్టర్ సాధారణంగా పగటివేళే ఎక్కువగా ఎరుగుతుంది. నా హెలికాప్టర్ మీద పులిలాగే చారికలుంటాయి. అందుకే నా హెలికాప్టర్‌ను టైగర్ మస్కిటో అని కూడా అంటుంటారు. నాకు చికిత్స లేదు. నేను సెల్ఫ్‌లిమిటింగ్. అంటే నా అంతట నేనే తగ్గిపోతానని చెబుతున్నా కూడా నేను వచ్చి వెళ్లాకనైనా డాక్టర్‌ను కలవడం మంచిది.  నేను వచ్చి తగ్గానని తెలిశాక కూడా డాక్టర్‌ను కలవకపోతే ప్రమాదమని గుర్తుంచుకోండి... నేను మామూలు వ్యాధిని కాదు. ‘డెంగ్యూని’!


నేను (అంటే డెంగ్యూ వైరస్‌ని) ఒక ఆరోగ్యవంతుడైన మనిషిలో ప్రవేశిస్తాను. అంతే... నేను ప్రవేశించిన 2 నుంచి 7 రోజుల్లోపు ఆ వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి. చాలా వైరస్‌లలాగే నేను కూడా సెల్ఫ్‌లిమిటింగ్ డిసీజ్‌నే. కాకపోతే ఈలోపల ప్లేట్‌లెట్లు ఉండాల్సిన సంఖ్య కంటే తగ్గితే ఒక్కోసారి నా శత్రువుకు నేను ప్రమాదకరంగా కూడా పరిణమించవచ్చు.

తీవ్రతను బట్టి నేను మూడు రకాలు...
1.    అన్ డిఫరెన్షియేటెడ్ ఫీవర్ - ఇతర ఫీవర్స్‌లాగానే అనిపించే జ్వరం.
2.   డెంగ్యూ హెమరెజిక్‌ఫీవర్ - అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కావడం.
3.   డెంగ్యూ హెమరెజిక్ షాక్ - అవయవాల్లో అంతర్గత రక్తస్రావంతో పాటు... బీపీ పడిపోయి షాక్‌లోకి వెళ్లడం.

 
నేను సోకితే కనిపించే సాధారణ లక్షణాలు

జ్వరం, తలనొప్పి (ముఖ్యంగా నుదురు ప్రాంతంలో), కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, రాష్, ఒంటి పై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ల నుంచి రక్తం కారడం, రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం. మలేరియాలో అయితే నిర్ణీత సమయానికి ప్రతిరోజూ వస్తూ ఉంటుంది. కానీ నాలో మాత్రం జ్వరం ఎప్పుడైనా రావచ్చు.


డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్‌లో... రక్తంలోని ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడం వల్ల అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరుగుతుంది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఈ అంతర్గత రక్తస్రావం లక్షణాలు ముందుగా కనుగొనడానికి టోర్నికేట్ అనే పరీక్షను నిర్వహించవచ్చు. చర్మం పై ఎర్రని మచ్చలు కనబడుతున్నా, కళ్లలో, నోటిలో మచ్చలు వచ్చినా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా, ఇంజెక్షన్ ఇచ్చినచోట లేదా ఇతర ప్రదేశాల నుంచి రక్తస్రావం జరుగుతున్నా, వాంతుల్లో రక్తం ఉన్నా లేదా విరేచనం నల్లగా వస్తున్నా (రక్తం కడుపులో ఉన్న యాసిడ్‌తో కలిసినప్పుడు నల్లగా మారుతుంది) డెంగ్యూ హెమరేజిక్ జ్వరంగా అనుమానించాలి. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే... కొందరు ఒంట్లో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల ఐరన్ టాబ్లెట్లు వాడుతుంటారు. వాళ్లకు మలం నల్లగానే వస్తుంది. ఇలా ఐరన్ టాబ్లెట్లు వాడే వారు ఈ లక్షణాలన్ని తెలుసుకొని ఆందోళన పడాల్సిన అవసరం లేదు.


షాక్ సిండ్రోమ్‌లో... నేను సోకినప్పుడు జరిగే అంతర్గత రక్తస్రావం వల్ల కాళ్లు, చేతులు, ముఖం వాయడం జరగవచ్చు. అంతేకాకుండా పొట్టలో, ఊపిరితిత్తుల బయట, గుండె చుట్టూ నీరు చేసి ఆయాసం పెరగవచ్చు. సాధారణంగా రెండు నుంచి ఏడు రోజుల జ్వరం వచ్చి తగ్గిన తరువాత ప్లేట్‌లెట్స్ పడిపోవడం, ఫలితంగా అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగడంతో పాటు బీపీ తగ్గిపోయి మూత్రం సరిగా రాకపోవడం, షాక్ లాంటి చాలా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఎవరైనా జ్వరం తగ్గిపోయింది కదా ఇంకేం ఉండదులే అని అనుకోకూడదు. అలా భావించి వైద్యుడి దగ్గరకి వెళ్లకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వచ్చింది నా కారణంగా కలిగిన జ్వరం అని తెలిశాక ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది.

నివారణ ఎంతో మేలు...
ఏ వ్యాధి విషయంలోనైనా చికిత్స కంటే నివారణ మేలు. నేను వచ్చేందుకు దోహదపడే టైగర్‌దోమ రాత్రిపూట కాకుండా పట్టపగలే స్వైర విహారం చేస్తుంది. నిల్వ నీటిలో సంతానోత్పత్తి చేసుకుంటుంది. ఈ ప్రక్రియకు పదిరోజుల వ్యవధి పడుతుంది. కాబట్టి ఇల్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ అనేదే జరగకుండా ఒకరోజు నీటిని పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే గా పాటించాలి.


ఇంట్లోని మూలల్లో.. చీకటి ప్రదేశంలో, చల్లని ప్రదేశంలో నా చారల లైవ్ హెలికాప్టర్ అయిన ఎడిస్ ఎజిప్టై విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఇల్లంతా వెలుతురు, సూర్యరశ్మి పర్చుకునేలా చూసుకోవాలి. అదే సమయంలో బయటి నుంచి దోమలు రాకుండా కిటికీలకు మెష్ అమర్చుకోవాలి.

 
ఈ దోమ నిల్వ నీటిలో గుడ్లు పెడ్తుంది కాబట్టి కొబ్బరి చిప్పలు, డ్రమ్ములు, బ్యారెల్స్, టైర్లు, కూలర్లు, పూలకుండీల కింద పెట్టే ప్లేట్లు మొదలైన వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రమ్ములు, బ్యారెల్స్ మొదలైన వాటిని బోర్లించి పెట్టడం మంచిది. అలాగే వాడని టైర్లను తడిలేకుండా చేసి ఎండలో పడేయాలి. తాగు నీకు కాకుండా మిగతా అవసరాల కోసం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి. దీనివల్ల ఎడిస్ ఎజిప్టై గుడ్డు పెట్టకుండా నివారించ వచ్చు.  ఇంట్లో ఉన్నప్పుడూ ఒంటి నిండా ఉండే దుస్తులనే ధరించాలి. హాఫ్ స్లీవ్స్ కంటే ఫుల్ స్లీవ్స్ ఉత్తమం. కాళ్లనూ కవర్‌చేసే పైజామాలు, సాక్స్ వేసుకుంటే మంచిది.  నా లైవ్ హెలికాప్టర్లు ముదురు రంగులకు తేలిగ్గా ఆకర్షితమవుతాయి. కాబట్టి లేత రంగుల దుస్తులను ధరించడం మేలు.  పగలు కూడా మస్కిటో కాయిల్స్ వాడవచ్చు. కొందరికి ఈ వాసన సరిపడకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అవి సరిపడనివారు, పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా వహించాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడటం చాలా ఉత్తమమైన మార్గం.

 

ప్రమాద హెచ్చరికలు
ఇంట్లో ఎవరైనా విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్తున్నా, నలుపు రంగులో  మలవిసర్జనమవుతున్నా, ముక్కులోంచి కానీ, చివుళ్లలోంచి కానీ చర్మంలోపల కానీ బ్లీడింగ్ అవుతున్నా, దాహంతో గొంతెండి పోతున్నా, చెమటలు పట్టి శరీరం చల్లబడిపోయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

 

డెంగ్యూలో కనిపించే ఇతర లక్షణాలు
సివియర్ డీహైడ్రేషన్, నిరంతరంగా బ్లీడింగ్ అవడం, ప్లేట్ లెట్స్ తక్కువవుతుంటాయి. దీనివల్ల రక్తం గడ్డకట్టదు. రక్తపోటు పడిపోతుంది. లివర్ ఎన్‌లార్జ్ అయి డ్యామేజ్ అయ్యే ప్రమాదమూ ఉంటుంది.  హార్ట్‌బీటింగ్ నిమిషానికి 60 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చు. బ్లీడింగ్, ఫిట్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. పూర్తి ఇమ్యూన్ సిస్టమే డ్యామేజ్ అవుతుంది.  హార్ట్‌బీట్ 60 కంటే తక్కువగా పడిపోవడం అన్నది ప్రమాదకరమైన సూచన. ఇలాంటి పరిస్థితి వస్తే ఇంటెన్సిక్ కేర్‌లో ఉంచాల్సిన అవసరం పడవచ్చు.

 

చికిత్స ఇలా
నేను వైరస్‌ను కాబట్టి డెంగ్యూకు నిర్దిష్టమైన మందులు లేవు. కాకపోతే లక్షణాలకు చికిత్స చేస్తుంటారు. రోగి తాలూకు లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి వచ్చిన వ్యక్తి బీపీ పడిపోకుండా ముందునుంచి  ఓఆర్‌ఎస్ ఇవ్వవచ్చు. షాక్‌లోకి వెళుతున్న వ్యక్తికి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. రక్తస్రావం జరుగుతున్న వ్యక్తికి తాజా రక్తాన్ని, ప్లేట్‌లెట్స్‌ను, ప్లాస్మా ఎఫ్‌ఎఫ్‌పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా) అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్ కౌంట్ సాధారణంగా 20 వేల కంటే తక్కువకు పడిపోతే ప్రమాదం. కాబట్టి మరీ తక్కువకు ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోయినప్పుడు ఎప్పుడు వాటిని ఎక్కించాలో డాక్టర్ నిర్ణయిస్తారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నేను (డెంగ్యూ) ఎవరికైనా సోకవచ్చు. ముఖ్యంగా గర్భిణీల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వారిలో జ్వరం వస్తే అది డెంగ్యూకావచ్చేమోనని అనుమానించి తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక్కడ గుర్తుంచుకోడాల్సిన విషయం ఏమిటంటే... సాధారణ జ్వరం వచ్చిన వారికి ఇచ్చినట్లుగా డెంగ్యూ బాధితులకు ఆస్పిరిన్, బ్రూఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. సాధారణంగా ఆస్పిరిన్ రక్తాన్ని పలచబారుస్తుంది. నేను సోకితే  ప్లేట్‌లెట్స్ తగ్గి రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆస్పిరిన్ వంటి మందులు తీసుకుంటే రక్తస్రావం జరిగే అవకాశాలను పెంచుకున్నట్లే! కాబట్టే ఈ జాగ్రత్త పాటించాలి. అయితే గుండెజబ్బులు ఉన్నవారు ఆస్పిరిన్ మామూలుగానే వాడుతుంటారు. ఇలాంటివారు డెంగ్యూజ్వరం వచ్చినప్పుడు రక్తాన్ని పలచబార్చే మందులు వాడవద్దు.

 
ప్లేట్‌లెట్లు లక్ష కంటే తగ్గినప్పుడు ప్రతి రోజూ పరీక్ష చేయించుకోవాలి. అయితే రోజుకు ఒకసారి మాత్రమే ఈ పరీక్ష చేయించుకోవాలి. జ్వరం తగ్గాక ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి పెరిగాక, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతాయి. అయితే ప్లేట్‌లెట్ల సంఖ్య 20,000 కంటే తగ్గితే హాస్పిటల్‌లో చేరడం అవసరం.

 

డాక్టర్ అనిల్ కోటంరెడ్డి
వెల్‌నెస్ కన్సల్టెంట్,కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement