![మనల్ని దేవుడికి దగ్గర చేసే సాధనాలు.... - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/1/61378923763_625x300.jpg.webp?itok=2B72NISi)
మనల్ని దేవుడికి దగ్గర చేసే సాధనాలు....
సాయినాథుడు తన భక్తుల నుంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని దక్షిణగా కోరారు. అవి తనకిస్తే బతుకుల్ని తీయబరుస్తానని అభయమిచ్చారు. మనం చేసే పనిలో కూడా మనం చూపే భక్తిశ్రద్ధలే ఆ పనిలో రాణించేలా చేస్తాయి. భక్తి, శ్రద్ధ, సబూరి...ఇవి రెండూ కలిస్తే కలిగేది మేలిమి విశ్వాసం. ఇవే మనల్ని భగవంతునికి దగ్గర చేసే సాధనాలు. ఇటువంటి శ్రద్ధాభక్తులు ఎవరికైతే ఉంటాయో, వారే మహనీయులుగా మారతారు.
ఓ బాటసారి దూరపు ప్రయాణానికి బయల్దేరాడు. భగవంతుడంటే అతనికి ఏ మూలో కొద్దిగా భక్తి ఉంది. మార్గమధ్యంలో ఎక్కడా ఆపదల బారిన పడకుండా ఉండేందుకు భగవన్నామస్మరణ చేసుకుంటూ కాలినడకన సాగిపోతున్నాడు. ప్రయాణంలో అక్కడక్కడా చిన్నచిన్న ఆటంకాలు కలిగినా అవన్నీ భగవంతుడి దయవల్ల తొలగిపోయాయని సంతోషపడ్డాడు. ఒకచోట పెద్ద నదిని దాటవలసి వచ్చింది. అక్కడ పడవ, తెప్ప వంటి సాధనాలేవీ లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటూఇటూ తిరగసాగాడు.
అంతలో అతని అదృష్టంకొద్దీ సమీపంలో ఒక సిద్ధుడు కనిపించాడు. బాటసారి ఆశగా ఆయన వైపు వెళ్లి తన సమస్యను చెప్పాడు. సిద్ధుడు బాటసారి చెప్పింది శ్రద్ధగా విని, ‘ఇది నిన్ను నదిని దాటిస్తుంది’ అంటూ ఒక తాయెత్తును అతని చేతిలో పెట్టాడు. సిద్ధుని మాటతీరు, గాంభీర్యం బాటసారిలో ఆయనపై ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. ఆయనకు నమస్కారం చేసి తాయెత్తును జాగ్రత్తగా పట్టుకుని బాటసారి నదిపై నడక సాగించాడు. తన సమస్య తీరినందుకు అతను ఎంతగానో సంతోషించాడు. తను నదిపై ఎలా నడవగలుగుతున్నానా అని ఆశ్చర్యానందాలకు గురయ్యాడు. సరిగా నదిపై సగం దూరం వెళ్లగానే అతనిలో చిన్న సందేహం కలిగింది.
తనను నదిని దాటించగల అద్భుతశక్తిని ఇచ్చిన తాయెత్తులో అసలేముంది? అందులోని ఏ శక్తి తనను నది దాటిస్తోంది? అదేమిటో చూడాలనే కుతూహలం అతనిలో కలిగింది. ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేకపోయాడు. ఇంకొక్క పది అడుగులు వేస్తే అతను నదికి ఆవలివైపు చేరిపోయేవాడే. కాని అతనిలో కలిగిన కుతూహలం అతనిని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే చేతిలోని తాయెత్తును విప్పి చూశాడు.
అందులో ‘సాయి... సాయి’ అనే మంత్రాక్షరాలు మాత్రమే ఉన్నాయి. బాటసారిలో ఒక్కసారిగా తృణీకారభావం కలిగింది. ‘ఓస్... సాయి అనే పేరు నన్ను నదిని దాటిస్తుందా? ఇంకా ఏదో గొప్ప మంత్ర తంత్రాలేవో నన్ను నదిని దాటిస్తున్నాయనుకున్నాను’ అని తేలికగా అనుకున్నాడు. అప్పటివరకు విశ్వాసంతో పడిన అతని అడుగులు అవిశ్వాసంతో ఒక్కసారిగా తడబడ్డాయి. అంతే, అతను నీటిలో మునిగిపోయాడు.
శ్రీసాయి సచ్చరిత్రలో బాబా చెప్పినట్లు... ఈ దేహం కొన్నాళ్లకు శిథిలమవుతుంది. ఊపిరి గాలిలో కలుస్తుంది. అయినా ఈ శరీరం శాశ్వతమనే గొప్ప భ్రమను మనిషి విడువలేడు. ఆ భ్రమ తొలగాలంటే, అతనిలో ఆ జ్ఞానం కలగాలంటే ఆధ్యాత్మికతను ఆశ్రయించటం ఒక్కటే మార్గం. అశాశ్వత తత్వానికి శాశ్వత నిద్రలో ఉన్న శవాన్ని మించిన ఉదాహరణ లేదు. అయినా మనం సత్యాన్ని అంటిపెట్టుకోం. ప్రాణం విడిచిన వారితో గతానుభవాలు, సంబంధాలు గుర్తు చేసుకుని మరీ విలపిస్తాం.
రోజులు గడిచేకొద్దీ మళ్లీ మామూలు మనుషులమవుతాం. మనుషుల్ని దేహస్వరూపులుగా కాకుండా ఆత్మస్వరూపులుగా భావించినప్పుడే అందరిలోనూ భగవంతుడిని చూడగలుగుతాం. అందుకే ఈ శరీరాన్ని ధర్మకార్యాచరణకే వినియోగించాలి. సత్కర్మలు ఆచరించాలి. పరమాత్మకోసం ఆరాటపడాలి. అదే నిజమైన భక్తి. అదే నిజమైన ఆధ్యాత్మిక దృక్పథం. అది అలవడాలంటే భక్తి, శ్రద్ధలను కలిగి ఉండాలి. అప్పుడే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది.
-డా.కుమార్ అన్నవరపు
సాయి సూక్తి:
ఈ ప్రపంచమంతా దేవుడే ఆవరించి ఉన్నాడు. అందుకే నాకు ఎవరూ శత్రువులు, మిత్రులు లేరు. అందరిలో సమభావంతో జీవించడమే నా తత్వం. భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు మనుషుల చేత అద్భుతకార్యాలను చేయిస్తాయి. అయితే ఆ నామస్మరణలో భక్తిశ్రద్ధలు ముఖ్యం. అవి లేకుండా పవిత్ర నామాల్ని ఎన్నిసార్లు స్మరించినా కలిగే ఫలితం నిష్ఫలం.