జయహో భక్త హనుమాన్‌ | Devotees worship Lord Hanuman as the ideal Goddess | Sakshi
Sakshi News home page

జయహో భక్త హనుమాన్‌

Published Sun, May 26 2019 1:46 AM | Last Updated on Sun, May 26 2019 1:46 AM

Devotees worship Lord Hanuman as the ideal Goddess - Sakshi

సప్త చిరంజీవులలో ఒకడు, శ్రీరాముడికి ప్రియ భక్తుడు. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటి మరీ లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు.

ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకు వచ్చి కదన రంగాన వివశుడై పడి ఉన్న లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు అయిన వీర హనుమాన్‌ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా?

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఆయన్ని ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. వాయుదేవుడి వరప్రసాదంగా జన్మించాడు కనుక వాయుపుత్రుడని, పవన సుతుడనీ అంటారు. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి పేర్లతో కూడా ఆరాధిస్తారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన హనుమంతుడు తాను స్వయంగా అంతులేని పరాక్రమవంతుడయ్యి కూడా శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.

ఆయనకు శ్రీరాముడంటే ఎంతటి భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి మరీ వారిని ఆరాధించాడు.  ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చే బాధలూ తొలగిపోతాయి. బుద్ధి బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. అందుకే హనుమజ్జయంతి పర్వ దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని అర్చిస్తారు.

‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతీం సమత రాక్షసాంతకం’
అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూంటుందో అక్కడ కళ్లనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట హనుమంతుడు. దీనిని బట్టి శ్రీరామ నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు.

సూర్యాంజనేయం
సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం. అది మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి. హనుమంతునికి రాముని తర్వాత సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు. ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరితే ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. దీని అర్థం ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించటం వాళ్ల మొదటి అనుబంధం.

సూర్య శిష్యరికం
 బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి విద్యను అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా అంగీకరించాడు.

సూర్యుని దగ్గర హనుమంతుడు విద్యను అభ్యసించేందుకు ఉదయాద్రిపై ఓ పాదం, అస్తాద్రిపై ఓ పాదం ఉంచి వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు. సూర్యుని శిష్యరికం వల్లే శ్రీరాముని మొదటి సమాగమంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతో, సింహికను శక్తితో, సురసను యుక్తితో జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

సూర్యపుత్రునికి స్నేహితుడు
సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే.వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావనా లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య.

అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది.హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడే. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాభాగ్యం హనుమకి దక్కింది. శ్రీరామునితో పరిచయమైన నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.
– కృష్ణ కార్తీక

హనుమధ్యాన శ్లోకాలు
►హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో  కొలిచిన వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

►విద్యా ప్రాప్తికి  పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్దోష వినాశన! సకల విద్యాం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!

► ఉద్యోగ ప్రాప్తికిహనుమాన్‌ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

►కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్‌ అసాధ్యం తమకిమ్‌ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్‌ సాధయప్రభో!!

►ఆరోగ్యానికి ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

►సంతాన ప్రాప్తికి పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్‌! సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!

►వ్యాపారాభివృద్ధికి సర్వ కళ్యాణ దాతరమ్‌ సర్వాపత్‌ నివారకమ్‌! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్‌!!

►వివాహ ప్రాప్తికి యోగి ధ్యే యాంఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!! ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement