ఆ బలం గురువుదే! | Devotional information | Sakshi
Sakshi News home page

ఆ బలం గురువుదే!

Published Sun, Sep 10 2017 12:11 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

ఆ బలం గురువుదే!

ఆ బలం గురువుదే!

నీటి ఒడ్డున ఇసుకలో తాబేలు గుడ్లుపెడుతుంది. తర్వాత వాటిని ఇసుకతో కప్పేసి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. తరువాత ఆ గుడ్లను గురించి ఆలోచిస్తూ అవి పిల్లలు కావాలనుకుంటుందట. తాబేటి స్మరణబలం చేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలవుతాయి. అది స్మరణదీక్ష. గురువుగారు ఒక్కసారి స్మరిస్తారు. స్మరణబలంతో శిష్యుడిని అనుగ్రహిస్తారు.

శివాజీ మహరాజ్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నాడని తెలుసుకున్న ఆయన గురువు సమర్ధ రామదాసు ఒక్కసారి శిష్యుణ్ణి స్మరించారు. శివాజీకి గురువుగారిని చూడాలనిపించి వెళ్ళి కలిసాడు. వచ్చిన శిష్యుడిని చూసొ ‘శివాజీ! చాలా బలమున్నవాడివి కదూ, ఇన్ని రాజ్యాలు ఏర్పాటు చేసావు కదూ, నీకు నీవు చాలా గొప్పవాడిననుకుంటున్నావు కదూ !’ అని ఓ నల్లరాయిని చూపించి ‘ఏదీ దాన్ని బద్దలు కొట్టు’ అన్నాడు. వెంటనే శివాజీ ‘గురువుగారి ఆజ్ఞ’ అంటూ దానిని బద్దలుకొట్టాడు. దానిలోపల కాసిన్ని నీళ్ళు, ఆ నీళ్ళలోంచి ఒక కప్ప బయటపడ్డాయి.

తెల్లపోయిన శివాజీ ‘నల్లరాయిలో నీళ్ళు, ఆ నీళ్ళలోకి ఈ కప్ప ఎలా వచ్చాయి!’ అని అడిగాడు. ‘రాతిలో నీళ్లుంచి ఆ  నీళ్ళలో కప్పనుంచినవాడే నిన్నిక్కడ ఉంచి నీలో బలం కూడా ఉంచాడు. ఆ బలం నీదికాదు’ అన్నారు గురువుగారు. ‘గురువుగారూ, అర్థమయింది. నేను అహంకరించాను. నన్ను మన్నించండి’ అన్నాడు. స్మరణచేత అనుగ్రహిస్తారు గురువులు. ఇవన్నీ గురువు శిష్యుడిని అనుగ్రహించే లేదా ఉపదేశం చేసే విధానాలు. అందుకే అంతేవాసిత్వం అంటారు. ఎప్పుడూ గురువు చెంత ఉండి సేవచేస్తూ, శిష్యుడు గురువు మనసులోస్థానం సంపాదిస్తాడు. వాడు నామాట వింటున్నాడని తెలుసుకున్న గురువు ఏ శిష్యుడిపట్ల ప్రీతిపొందుతాడో అతనిని అంతేవాసి అంటారు. ఆ ప్రక్రియను అంతేవాసిత్వం అంటారు.

ఇది గురుశిష్యుల మధ్య ఉండే అద్భుతమైన అనుబంధం. శిష్యుడికి గురువుగారికన్నా గొప్పది ఈ ప్రపంచంలో మరేదీ లేదు. గురువుగారు స్నానం ముగించి రాగానే పంచె చేతికి అందిస్తాడు. గడపదాటంగానే చెప్పుల జత తీసుకొచ్చి అక్కడ పెడతాడు. అదేమిటి చెప్పులు మోస్తున్నాడని గింజుకోనక్కరలేదు. ఆయనకు గురువుకన్నా అధికుడు లేడు. పరమేశ్వరుడి పాదాలకు పాదుకలు అమర్చుతున్నాడంతే. అదే శిష్యుడి భావన. ఆ సంస్కారం అర్థం చేసుకోవాలి. అలా సేవలు చేయించుకోవాలని గురువుగారికి మోజేమీ ఉండదు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. అది శిష్యుడి వినయం.

ఒకసారి విశ్వామిత్రుడు ‘రామలక్ష్మణులారా !’ అని ఎందుకో పిలిచాడు. ఆ పిలుపులో ఏదో గౌరవభావం ఉందనిపించింది రాముడికి. ఎందుకని! మారీచుడిని మారణాస్త్రంతో కొట్టాడు. రాక్షస సంహారం చేసాడు. ఇదంతా చూసి ఇంద్రాదులు ప్రశంసలతో ముంచెత్తారు. రాముడిలో ఇదంతా ఏమయినా మార్పు తీసుకొచ్చిందేమోనన్న సందేహంతో ఆ పిలుపులో తేడా ఏమయినా వచ్చిందా! ఏమో! రాముడికి మాత్రం అనుమానమొచ్చిన మరుక్షణం చేతులు కట్టుకుని వచ్చి ‘‘గురువుగారూ! మీరు శాసకులు, మీరు పరబ్రహ్మ. మీరు మర్యాదగా పిలవకూడదు. మీరు శాసనం చెయ్యండి. అది చెయ్‌ అనండి.

మీరు ఏది చెప్పారో అది చెయ్యడమే నా జీవితానికి సార్ధక్యం. మీ నుండి అభ్యర్థనను నా జీవితమందు వినకుండెదను గాక!’’ అన్నాడు. అదీ గురువును ఉపాసన చేయడం అంటే. చెయ్యకూడనిదేదీ గురువు చెప్పడు. గురుశిష్యుల అనుబంధం అంత అద్భుతంగా ఉంటుంది. ఆచార్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అంటే–పరమేశ్వరుడి చేతిని శిష్యుడికి అందించగలడు. కారణం – భక్తితత్పరుడైన గురువు మాటకు పరమేశ్వరుడు కూడా వశవర్తి అయిపోతాడు. అంత పెద్ద ఏనుగు మావటికి లొంగిపోయి తనను కట్టడానికి ఇనుపగొలుసులను తొండంతో ఎత్తి మావటి చేతికి అందించినట్లు తనను అనువర్తించే శిష్యుడికి గురువు కూడా అలా వశవర్తి అయిపోతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement