మా పెద్దమ్మకు 67 ఏళ్లు. ఆమె చాలా కాలంగా డయాబెటిస్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఒకరోజు స్పృహతప్పి పడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. డాక్టర్లు ఆమెకు రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ రోగులలో రక్తంలో చక్కెర పాళ్లు అధికంగా ఉంటాయి కదా? ఇలా షుగర్ తగ్గడం కూడా జరుగుతుందా?
- సుధీర్, కర్నూల్
వృద్ధులలో తాము వాడాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో చక్కెరను నియంత్రించే మాత్రలు వాడినప్పుడు ఒక్కోసారి వాళ్ల రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా పడిపోవచ్చు. ఈ కండిషన్‌ను హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల మత్తుగా ఉన్నట్లుండటం, బలహీనత, భ్రాంతులు, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల వల్ల వృద్ధులు పడిపోతే ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి.
డయాబెటిస్ రోగులను మామిడి, అరటి, సపోటా వంటి పండ్లు తినవద్దంటారు. నాకు ఇటీవలే డయబెటిస్ వచ్చింది. నేనెప్పటికీ ఆ పండ్లు తినకూడదా?
- జగన్నాథరావు, అనకాపల్లి
మామిడి, అరటి, సపోటా వంటి పండ్లలో చక్కెర పాళ్లు అధికంగా ఉంటాయి. అంతమాత్రాన డయాబెటిస్ ఉన్నవారు ఆ పండ్లు తినకూడదనేది అపోహ మాత్రమే. మనం తినే పిండిపదార్థాల వల్ల రక్తంలోకి చక్కెర వస్తుంది. దానితోపాటు చక్కెర ఎక్కువగా ఉండే ఆ పండ్లు తింటే రక్తంలో చక్కెరపాళ్లు మరింత పెరుగుతాయనే ఆందోళనతో కొందరు అలాంటి సలహా ఇస్తారు. కాబట్టి మనం తీసుకునే పిండిపదార్థాలను అంటే అన్నం, చపాతీ వంటి వాటిని కొంత తగ్గించుకొని.. ఆ మేరకు ఈ పండ్లను తీసుకుని మన జిహ్వను తృప్తిపరచుకోవచ్చు. సగం అరటిపండు 83 గ్రాముల మామిడి 190 గ్రాముల పుచ్చకాయ ముక్కలు 180 గ్రాముల స్ట్రాబెర్రీ 80 గ్రాముల సపోటా 124 గ్రాముల పైనాపిల్ ముక్కలు... ఇవన్నీ 15 గ్రాముల కార్బోహైడ్రేట్లకు సమానం. ఆయా పండ్లను ఏ పరిమాణంలో తీసుకుంటే అవి 15 గ్రాములవుతాయో తెలిసింది కదా! దీన్నిబట్టి ఏ పండునూ పూర్తిగా వదిలేయకుండా... అవి తినాలనిపించినప్పుడు మనం ఆహారంగా తీసుకునే కార్బోహైడ్రేట్లను తగ్గించి, పైన పేర్కొన్న మోతాదులో ఆస్వాదించండి.
డాక్టర్ రాహుల్ అగర్వాల్
సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్స్, మాధాపూర్, హైదరాబాద్
డయాబెటిస్ కౌన్సెలింగ్
Published Mon, May 4 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement
Advertisement