కస్టర్డ్ కలపండి.... టేస్ట్ పెంచండి..!
పాలు, పంచదార, గుడ్డు కలిపి చేసే సాస్... కస్టర్డ్. దీనిని స్వీట్ డిష్‌ల మీద రంగరించి, ఆరగించి చూడండి. అది మీకెంతో ‘ఇష్ట'మైన టేస్ట్ అయిపోతుంది! మళ్లెప్పుడైనా స్వీట్ ఫుడ్ మీదకు మనసు మళ్లితే కచ్చితంగా మీకు కస్టర్డ్ గుర్తుకొచ్చి తీరుతుంది. ప్రతి ఒక్కరూ ఆస్వాదించవలసిన మస్ట్ ఈట్... కస్టర్డ్ డిష్‌లే ఇవన్నీ.
కస్టర్డ్ ఫ్రూట్ టార్ట్స్
కావలసినవి: మైదా - 400 గ్రా, బటర్ - 150 గ్రా, చక్కెర - 150 గ్రా, కోడిగుడ్లు - 2, పాలు - అర లీటరు, కస్టర్డ్ పౌడర్ - 2 చెంచాలు, వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా, ఉప్పు - తగినంత, పచ్చద్రాక్షలు- నల్లద్రాక్షలు - స్ట్రాబెర్రీస్ - కావలసినన్ని
తయారీ విధానం: మైదాపిండిలో బటర్, సగం చక్కెర, కోడిగుడ్ల సొన, చిటికెడు ఉప్పు వేసి కేక్ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కప్‌కేక్ మౌల్డ్స్‌లో వేసి బేక్ చేస్తే ఫొటోలో చూపిన ఆకారంలో వస్తాయి. అవన్ లేకపోతే చిన్న చిన్న కప్స్‌లో పిండి వేసి, కేక్ గిన్నెలో నీళ్లు పోసి, అందులో కప్స్ పెట్టి ఉడికించుకోవచ్చు. తర్వాత నాలుగు చెంచాల చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ కలపాలి. మిగతా పాలలో మిగిలిన చక్కెర వేసి స్టౌమీద పెట్టాలి. మరిగాక కస్టర్డ్ కలిపిన పాలను వేయాలి. చిక్కగా అయ్యాక దించేసి చల్లార్చాలి. ఆపైన ఈ మిశ్రమాన్ని బేక్ చేసుకున్న మైదా టార్ట్స్‌లో వేసి, పైన ఫ్రూట్స్ పెట్టి సర్వ్ చేయాలి.
కస్టర్డ్ క్రీమ్ బిస్కట్స్
కావలసినవి: మైదా - 100 గ్రా, బటర్ - 100 గ్రా, చక్కెర - 50 గ్రా, కస్టర్డ్ పౌడర్ - 50 గ్రా, వెనిల్లా ఎసెన్స్ - 1 చెంచా
ఫిల్లింగ్ కోసం: ఐసింగ్ షుగర్ - 150 గ్రా, బటర్ 75 గ్రా
తయారీ: చక్కెరను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఓ బౌల్‌లో మైదా, చక్కెర పొడి, బటర్, కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి. బటర్ వల్ల వచ్చే కన్సిస్టెన్సీ సరిపోతుంది. లేదంటే కొద్దిగా పాలు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడీ మిశ్రమాన్ని బిస్కట్ మౌల్డ్స్‌లో వేసి అవన్‌లో బేక్ చేసుకోవాలి. అవన్ లేనివాళ్లు గుండ్రంగా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఐసింగ్ షుగర్‌లో బటర్ వేసి కలిపి, ఈ క్రీమ్‌ని రెండు బిస్కట్ల మధ్యలో పెట్టి ఒత్తాలి.
మిక్స్‌డ్ ఫ్రూట్ కస్టర్డ్
కావలసినవి: పాలు - 1 లీటరు, కస్టర్డ్ పౌడర్ - 4 చెంచాలు, చక్కెర - ఒక కప్పు, యాపిల్ - 1, మామిడిపండు - 1, తెల్లద్రాక్షలు - 10, నల్లద్రాక్షలు - 10, దానిమ్మ గింజలు - పావుకప్పు, సపోటాలు - 3, అరటిపండు - 1, డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని
తయారీ: పావుకప్పు చల్లని పాలలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. మిగతా పాలలో చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. చక్కెర కరిగి, పాలు కూడా బాగా మరిగాక కస్టర్డ్ కలిపిన పాలు వేసి, చిక్కగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించాలి. తర్వాత దించేసి చల్లార బెట్టాలి. ద్రాక్షపండ్లను తప్ప మిగతా అన్ని పండ్లనూ చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. చివరగా డ్రైఫ్రూట్స్‌తో పాటు మిగతా అన్ని పండ్లనూ పాలలో వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లగా అయ్యాక సర్వ్ చేయాలి.
బేక్డ్ చాక్లెట్ కస్టర్డ్
కావలసినవి: కస్టర్డ్ పౌడర్ - పావుకప్పు, పాలు - 1 కప్పు, చక్కెర - అరకప్పు, కోకోపౌడర్ - అరకప్పు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, ఉప్పు - చిటికెడు, కోడిగుడ్లు - 2
తయారీ: పాలు చల్లగా ఉన్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత స్టౌమీద పెట్టి చిక్కగా అయ్యాక దించేసుకోవాలి. కోడిగుడ్డు సొనలో చక్కెర, కోకో పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కస్టర్డ్ మిశ్రమంలో వేసి మిక్స్ చేయాలి. తర్వాత అవన్‌లో బేక్ చేసుకోవాలి.
పంప్‌కిన్ కస్టర్డ్ పై
కావలసినవి: గుమ్మడి గుజ్జు - ఒకటిన్నర కప్పు, చక్కెర - ముప్పావు కప్పు, కోడిగుడ్లు - 2, క్రీమ్ - 1 కప్పు, పాలు - అరకప్పు, కస్టర్డ్ పౌడర్, పావుకప్పు, దాల్చినచెక్క పొడి - 1 చెంచా, శొంఠి అల్లం పొడి - అర చెంచా, ఉప్పు - అర చెంచా
తయారీ: ఓ బౌల్‌లో కోడిగుడ్ల సొన, క్రీమ్, పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి బాగా బీట్ చేయాలి. గుమ్మడి గుజ్జులో చక్కెర కలిపి స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకం లాగా అవుతున్నప్పుడు దించేసుకుని ఉప్పు, దాల్చినచెక్క పొడి, శొంఠి పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత కోడిగుడ్డు-పాల మిశ్రమంలో వేసి కలపాలి. తర్వాత ఈ మొత్తాన్నీ కేక్ గిన్నెలో వేసి బేక్ చేసుకోవాలి. లేదంటే కేక్ గిన్నెలో స్టౌమీద కూడా వండుకోవచ్చు.