పురుషులు పెట్టుకునే వివాహేతర సంబంధాల కన్నా, స్త్రీలు పెట్టుకునే వివాహేతర సంబంధాలు భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయని, ఆఖరికి.. పిల్లలు, భర్త ప్రాణాలను సైతం అలాంటి మహిళలు ఫణంగా పెడతారని తమిళ దర్శక దిగ్గజం కె.భాగ్యరాజ్ అనడంపై ఇప్పుడు పెద్ద వివాదమే రాజుకుంది. అభ్యంతరకరమైన అతడి వ్యాఖ్యలపై మహిళాలోకం మండిపడుతోంది.
యావద్దేశాన్ని షాక్‌కి గురిచేసిన ఘటన ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులోని పొల్లాచ్చిలో బయటపడింది. ఇప్పుడు మళ్లీ దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి, ఆగ్రహావేశాలకు లోను చేసిన ఘటన ఒకటి నిన్న అదే తమిళనాడులోనే జరిగింది! రెండిటికీ ఉన్న సంబంధం.. ‘కరుత్తుగళై పదివు సెయ్’ అనే తమిళ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్.
ఈ సినిమా కథకు మూలం పొల్లాచ్చి ఘటన. ఒక గ్యాంగ్ గత రెండేళ్లుగా ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్‌ల ద్వారా అమాయకులైన స్కూలు బాలికల్నీ, కాలేజీ అమ్మాయిల్నీ, మహిళా టీచర్‌లనీ వలపన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ లోబరుచుకోవడం పొల్లాచ్చి ఘటన అయితే, మంగళవారం చెన్నైలోని ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో ఒకప్పటి దర్శక దిగ్గజం కె. భాగ్యరాజ్.. మహిళలపై తీవ్రమైన ఆరోపణలు చేయడం తాజా ఘటన. ‘‘అసలు ఇలాంటి నేరాలు మహిళల వల్లే జరుగుతున్నాయి’’ అని ఆయన అన్నారు!
స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియా అకౌంట్‌లు అందుబాటులోకి వచ్చాక పెరిగిన అక్రమ సంబంధాలకు, అవినీతి వ్యవహారాలకు మహిళలే ప్రధాన కారణం అని కూడా భాగ్యరాజ్ అన్నారు. అంతేకాదు, పురుషులు పెట్టుకునే వివాహేతర సంబంధాల కన్నా, స్త్రీలు పెట్టుకునే వివాహేతర సంబంధాలు భయంకరమైన పరిస్థితులకు దారి తీస్తాయని, ఆఖరికి.. పిల్లలు, భర్త ప్రాణాలను సైతం అలాంటి మహిళలు ఫణంగా పెడతారని అన్నారు! దీనిపై ఇప్పుడు పెద్ద వివాదమే రాజుకుంది.
నిజానికి అది ఆడియో ఫంక్షన్‌లా లేదు. పనికట్టుకుని మహిళల్ని దూషించడానికి భాగ్యరాజా ఈ ఆడియో ఫంక్షన్‌ను అడ్డుపెట్టుకున్నారా అనే సందేహం కలిగించేలా ఆయన కామెంట్స్ చేశారు. ఒక తమిళ సామెతను కూడా ఈ సందర్భంగా చెప్పారు. ‘‘ఊసి ఇదమ్ కుడుకామ నూల్ నొనళాదు’’ (సూది కనుక సందు ఇవ్వకపోతే దారం అందులోకి దూరలేదు) అన్నారు. ‘‘ఆడవాళ్లు చనువిస్తేనే మగవాళ్లు చొరవ చూపుతారు. అలాంటప్పుడు మగవాళ్లనెందుకు తప్పు పడతాం? పురుషుడు తప్పు చేస్తే ఆ తప్పు అతడితోనే ఉండిపోతుంది.
స్త్రీ తప్పు చేస్తే అది కుటుంబం మొత్తానికీ చుట్టుకుంటుంది.ఉదాహరణకు మగాడు ‘చిన్నింటి’ కోసం ఏదైనా చెయ్యనివ్వండి, ఎంతైనా ఖర్చుపెట్టనివ్వండి, తన భార్యకు ఏ కష్టమూ రానివ్వడు. ఏ ఇబ్బందీ కలిగించడు. అదే స్త్రీ ఒక అనైతిక సంబంధం పెట్టుకుంటే బిడ్డల్నీ, భర్తనీ చంపేస్తుంది’’ అని తీవ్రాతి తీవ్రమైన విమర్శలతో మహిళల్ని భాగ్యరాజ్ కించపరిచారు. 20 నిమిషాల తన ప్రసంగం మొత్తం మహిళల నైతికతను శంకించేందుకు ప్రోత్సహించేలా మాత్రమే సాగింది.
‘‘తండ్రి తన కూతురికి ఆమె భద్రత కోసం సెల్‌ఫోన్ కొనిస్తాడు. కూతురు ఆ సెల్‌ఫోన్‌తో చాటింగ్ చేస్తూ తనే స్వయంగా ప్రమాదంలోకి కూరుకుపోతుంది’’ అని ప్రసంగాన్ని ముగించారు. ఆడియో ఫంక్షన్‌లో భాగ్యరాజ్ మాట్లాడిన ప్రతి మాటకూ చప్పట్ల వర్షం కురిసింది. అయితే కొన్ని గంటల తర్వాత దేశవ్యాప్తంగా అతడిపై తిట్లు, చీత్కారాల వడగండ్లు మొదలయ్యాయి. భాగ్యరాజ్ ఉద్దేశాలను జీర్ణం చేసుకోడానికి అంత టైమ్ పట్టిందంటే అతడెంతగా ఒళ్లు మరిచి మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు.
అన్నిటికన్నా దారుణాతిదారుణమైన మాట.. స్త్రీలే తమపై అఘాయిత్యానికి పురుషుల్ని ప్రేరేపిస్తారట!! భాగ్యరాజ్ తమిళంలో అన్న ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో అన్ని భాషల్లోకీ నెమ్మది నెమ్మదిగా తర్జుమా అవుతున్న కొద్దీ ఆగ్రహజ్వాలలు అన్నివైపుల నుంచి ఆయన్ని చుట్టుముట్టడం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇప్పటికే తమిళనాడు మహిళా కమిషన్‌కు ఒక లేఖ రాశారు. ‘‘అతడి పురుషాహంకార, స్త్రీద్వేష వ్యాఖ్యలపై, ఆమోదయోగ్యం కాని అతడి ధోరణిపై తక్షణం చర్య తీసుకోవాలి’’ అని పద్మ ఆ లేఖలో కోరారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా భాగ్యరాజ్ కామెంట్‌లపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అసలు ఇలాంటి కామెంట్ల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
సినీ దర్శకుడు, నటుడు, రచయిత, సంగీత దర్శకుడు, నిర్మాత అయిన కృష్ణస్వామి భాగ్యరాజ్‌కు మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసిన ‘ముంధనై ముడిచ్చు’, ‘చిన్నవీడు’ వంటి చిత్రాలలో ఔన్నత్యం గల మహిళల పాత్రలు కనిపిస్తాయి. అలాంటిది 66 ఏళ్ల వయసులో భాగ్యరాజ్ ఇలా ఎందుకు మాట్లాడినట్లు?! దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఒక్క భాగ్యరాజ్ తప్ప. అయితే అతడు నోరు విప్పాలని ఎవరూ అనుకోవడం లేదు.
చెప్పి చెప్పి అలసిపోయాం
‘‘రేప్ జరగడానికి కారణం స్త్రీలే’ అని స్త్రీలను నిందించడం మానేయమని పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లకు చెప్పి అలసిపోయాం. ‘సూది అనుమతిస్తేనే, దారం లోపలకి వచ్చింది’ అనే తరహాలో మాట్లాడటం దయచేసి మానేయండి ప్లీజ్. ఈ ఆలోచనా విధానం వల్ల చాలామంది అమ్మాయిలు చనిపోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లే రేప్‌కి కారణం స్త్రీలు అంటున్నారు’’ అని గాయని చిన్మయి ట్వీట్ చేశారు. భాగ్యరాజా మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి, తన అభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చారు. అలాగే భాగ్యరాజా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసిన కొందరి ట్వీట్లను కూడా చిన్మయి రీట్వీట్ చేశారు.
- చిన్మయి, గాయని
మనువాద ప్రతినిధి
అతను ఈ రకమైన కామెంట్ చేయడం అవగాహన లేమి. మాతృ పరంపరను గుర్తించిన ద్రవిడ సంస్కృతిని అర్థం చేసుకోనితనం. అతను మనువాద, పితృస్వామ్య ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. కట్నంకోసం పురుషులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, కట్నం కోసం ఆడవాళ్లను చంపడం గురించి ఎందుకు మాట్లాడరు? నేరం ఎవరు చేసినా నేరమే! ఆడవాళ్ల మీద మగవాళ్లు వ్యవస్థీకృతంగా చేస్తున్న దారుణాలు, హింస గురించి ఎందుకు మాట్లాడరు? సెల్‌ఫోన్లు తప్పు అయితే మొత్తానికే తీసిపారేయండి అంతే కాని అది ఆడవాళ్ల దగ్గరుంటే తప్పు.. మగవాళ్ల దగ్గరుంటే కాదా?
– దేవి, సామాజిక కార్యకర్త
తప్పు వాళ్లది కాదు
స్త్రీలు, పురుషులతో సమానంగా హక్కులు పొందడం, అన్ని రంగాల్లో వాళ్ల సమస్థాయిలో ఉండడం మగవాళ్లకు మింగుడుపడ్డంలేదు. తప్పు వాళ్లది కాదు.. మనువాద సంస్కృతిలో పుట్టి పెరిగి.. దాన్నే జీర్ణించుకున్నారు కాబట్టి ఇలాంటి మాటలే మాట్లాడ్తారు. మనువాద సంస్కృతి ప్రభావం వల్ల స్త్రీ ఎదుగుదల పరిస్థితులు వాళ్లకు అర్థంకావు.అర్థమయ్యేలా చేయాల్సిన పాలక, పోలీస్, న్యాయ వ్యవస్థలూ తమ పాత్ర సరిగ్గా పోషించట్లేదు.సెల్‌ఫోన్.. అందరికీ అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టూల్. పెరిగిన అవసరాల్లో అది అందరికీ అత్యంత అవసరం.
దానికి, స్త్రీల ప్రవర్తనకు లింక్ పెట్టడమేంటి? ఆయన అజ్ఞానం, అహంకారం బయటపడ్డం తప్ప ఇంకేం లేదు. ఈ దుస్థితి పోవాలంటే సమాజంలో సమూలమైన మార్పు రావాలి. స్త్రీ, పురుష సమానత్వం గురించి రాజ్యాంగం చెప్పిన విషయాలను.. అసలు ఆ మాటకొస్తే రాజ్యాంగం కచ్చితంగా అమలయ్యేలా చూస్తే చాలు.. ఇలాంటి అభిప్రాయాలు, మాటలు వినిపించవు.
– గెడ్డం ఝాన్సీ నేషనల్ కన్వీనర్, దళిత స్త్రీ శక్తి
Comments
Please login to add a commentAdd a comment