గర్భాశయానికి ఇరుపక్కలా బాదం పప్పు సైజులో ఉండే అండాశయాలు అండాలను ఉత్పత్తి చేయడంతో పాటు స్త్రీ హార్మోన్లు అయిన ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్‌లను విడుదల చేస్తుంటాయి. స్త్రీలలో నెలసరికి ఈ హార్మోన్‌లే కారణం. ఈ హార్మోన్లు సరిగ్గా విడుదల అయినంత కాలం అనేక గైనిక్ సమస్యలకు దూరంగా ఉండటంతో పాటు సంతానలేమి సమస్య కూడా బాధించదు. అండాశయాలలో కణాలు అపరిమితం గా పెరిగి పక్కనున్న కణజాలాలకు, ఇతర భాగాలకు వ్యాపించడాన్ని ‘ఒవేరియన్ క్యాన్సర్’ అంటారు. అపరిమితంగా పెరిగిపోయే ఈ కణాలను బట్టి ఈ క్యాన్సర్‌ను మూడు రకాలుగా విభజించారు.
1. ఎపిథీలియల్ ఒవేరియన్ క్యాన్సర్
వయసు పైబడిన స్త్రీలలో దాదాపు 90% వరకు ఈ క్యాన్సర్ వస్తుంటుంది.
2. జెర్మ్‌సెల్ ట్యూమర్ ఒవేరియన్ క్యాన్సర్
వయసులో ఉండే అమ్మాయిల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ఇది. ఈ క్యాన్సర్ కణాలు అండాల నుంచి పుడతాయి.
3. సెక్స్‌కార్డ్ స్ట్రోమల్ ట్యూమర్ ఒవేరియన్ క్యాన్సర్
ఈ క్యాన్సర్ కణాలు అండాలలో హార్మోన్స్ ఉత్పత్తి అయ్యే దగ్గర్నుంచి తయారవుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ హార్మోన్లు చాలా ఎక్కువగా, దీర్ఘకాలికంగా ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. స్త్రీలలో వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్‌ది మూడో స్థానం. గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ల తర్వాత ఈ క్యాన్సర్లే ఎక్కువ.
ఇక్కడ పేర్కొన్న మూడు రకాలే కాకుండా వాటిలోనూ ఇంకా ఎన్నో సబ్–టైప్స్ ఉంటాయి. స్త్రీలలో 50 ఏళ్లు పైబడ్డాక ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌ను ఒక సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటూ ఉంటారు. ఎందుకంటే పొత్తికడుపు లో చాలా లోపలికి ఉండే అండాశయాల క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు కూడా చాలా ఆలస్యంగా బయటపడుతూ ఉంటాయి.
ఎవరెవరిలో...
►పిల్లలు కలగని మహిళల్లో
►బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన మహిళల్లో
►సంతానం కోసం చాలా ఎక్కువగా మందులు వాడిన వారిలో
►హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీని దీర్ఘకాలికంగా తీసుకున్నవారిలో
►కొవ్వు పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారిలో
►క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి, 50 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు కొంత ఎక్కువ అనే చెప్పవచ్చు.
గైనకాలజిస్ట్ దగ్గరికి గైనిక్ చెకప్స్‌కు వెళ్లినప్పుడు ఈ క్యాన్సర్ అంత త్వరగా బయటపడకపోవచ్చు. అందుకే అనుమానంగా ఉంటే అల్ట్రాసౌండ్ పరీక్షతో పాటు బ్లడ్‌టెస్ట్‌లు, సీఏ 125, పాప్ టెస్ట్ మొదలైనవాటితో పాటు సీటీ, ఎమ్మారై వంటివి కూడా చేస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమయ్యే బీఆర్‌సీఏ–1 జీన్ మ్యుటేషన్‌లో తేడాలున్నప్పుడు ఈ క్యాన్సర్ పరీక్షలు 25 ఏళ్ల వయసు నుంచే చేయించడం మంచిది. మెనోపాజ్ దశకు ముందు నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్ ను మాత్రమే 5 నుంచి 10 ఏళ్ల కంటే ఎక్కువగా తీసుకుంటే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరగవచ్చు. ప్రోజెస్టిరాన్ హార్మోన్ కాంబినేషన్‌లో ఈస్ట్రోజెన్ తీసుకుంటే ఆ ముప్పు కొంతవరకు తగ్గవచ్చు. అన్ని క్యాన్సర్లలోలాగే ఈ క్యాన్సర్‌లో కూడా నాలుగు స్టేజ్‌లు ఉంటాయి.
స్టేజ్ 1: ఒకటి లేదా రెండు అండాశయాలకు మాత్రమే పరిమితం.
స్టేజ్ 2: గర్భాశయానికీ వ్యాప్తి చెందడం
స్టేజ్ 3: అండాశయాలు, గర్భాశయంతో పాటు లింఫ్ నాళాలు, పొత్తికడుపు లైనింగ్‌కు వ్యాప్తి చెందడం.
స్టేజ్ 4: పైవాటితోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు సోకడం.
ఈరోజుల్లో వాడే బర్త్‌కంట్రోల్ పిల్స్ (పిల్లలు పుట్టకుండా ఉండేందుకు వాడే టాబ్లెట్ల) వల్ల ట్యూబల్ లిగేషన్, హిస్టరెక్టమీ అయిన మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంత తక్కువగా ఉండవచ్చు.
చికిత్స
స్టేజ్‌లపై ఆధారపడి సర్జరీతో పాటు ఇతర థెరపీలను ఎంతకాలం ఇవ్వాలో నిర్ణయిస్తారు. నోటిద్వారా, ఐవీ ద్వారా లేక నేరుగా పొట్టలోకే ఇచ్చే కీమోతో పాటు టార్గెటెడ్ థెరపీలు కూడా ఉంటాయి. పెళ్లికాని అమ్మాయిలు ఈ క్యాన్సర్‌కు ఇచ్చే కీమో, రేడియోథెరపీల కారణంగా మెనోపాజ్ లాంటి లక్షణాలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే వీరి అండాలను చికిత్సకు ముందే తీసి, భవిష్యత్తులో సంతానభాగ్యం పొందడానికి భద్రపరిచే సౌకర్యాలు ఉన్నాయి.
ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు:
ఈ క్యాన్సర్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అంతేకాకుండా అవి అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షఅ న్స్‌లా అనిపించవచ్చు. మొదట్లో లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడం వల్ల తొలిదశలో ఈ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టం కావచ్చు.
►పొత్తికడుపు ఉబ్బినట్లుగా ఉండి, నొప్పిగా ఉండటం.
►అజీర్తి, వికారం, తేన్పులు లాంటి జీర్ణ సంబంధ సమస్యల్లాంటి లక్షణాలు.
►యోని స్రావాలు అసాధారణంగా ఉండటం. ∙మూత్రం ఎక్కువగా లేదా త్వరగా రావడం.
►అలసట, జ్వరం ∙ఎక్కువగా లేదా ఇంతకుముందులా తినలేకపోవడం. కొంచెం తినగానే పొట్ట నిండినట్లుగా ఉండటం.
►ఊపిరి కష్టంగా ఉండటం. ∙కలయిక కష్టంగా ఉండటం.
►వెన్నునొప్పి లేదా నడుమునొప్పిగా అనిపించడం.
►అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం.
►ఈ క్యాన్సర్‌లో పై లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment