
ఒకతను బావి తవ్వుదామనుకున్నాడు. మరొకతన్ని సలహా అడిగితే ఒకచోట తవ్వమని చెప్పాడు. పదిహేను అడుగుల లోతు తవ్వాక దానిలో నీళ్లు పడకపోయేసరికి అతడు నిరాశ చెందాడు. ఇంతలో అక్కడికి వేరొకతను వచ్చి, ఇతని తెలివితక్కువతనాన్ని హేళన చేసి తనకు తోచిన మరొకచోట తవ్వమని సలహా ఇచ్చాడు. ఇతను అక్కడకు వెళ్లి మళ్లీ తవ్వడం మొదలు పెట్టాడు. ఈసారి ఇరవై అడుగుల లోతు తవ్వాడు. కానీ నీరు పడలేదు. ఇంకొకతను వచ్చి మరొకచోట తవ్వమని చెప్పాడు. అక్కడ ముప్పై అడుగుల లోతు తవ్వాడు. కానీ నీరు పడలేదు. దాంతో నిరాశా నిస్పృహలతో ఆ పని వదిలేసి వస్తుండగా, నాల్గవ అతను వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘నువ్వు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు.
కానీ తప్పుదారి పట్టడం వల్ల నీకు నీళ్లు పడలేదు. నేను చెప్పిన చోట తవ్వితే తప్పకుండా నీళ్లు పడతాయి. అయితే, పలుగుతో కాదు, పారతో వెడల్పుగా తవ్వు’’ అని సలహా ఇచ్చాడు. అతను అలాగే చేశాడు. అలా 45 అడుగులలోతు తవ్వాడు. కానీ లాభం లేకపోయింది. దాంతో గట్టిగా నిట్టూర్పు విడిచి, పలుగు, పారా విసిరి అవతల పారేసి, ఇంటి దారి పట్టాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ, అతను అలా నాలుగైదు చోట్ల తవ్వడం వల్ల అనుకున్న ఫలితాన్ని పొందలేకపోయాడు. అదే ఒకేచోట లోతుగా తవ్వి వుంటే తప్పకుండా నీళ్లు పడి ఉండేవి. కొందరు ఇదేవిధంగా ఒకటి కాదని మరొకటి మారుస్తూ అనేక అంశాలను పట్టుకుని వదిలేస్తుంటారు. దాని మూలంగా దేనిలోనూ పట్టు సాధించలేకపోతారు. అలా కాకుండా ఒకేదానిని నిశితంగా అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చునని చెప్పేవారు.
– డి.వి.ఆర్