మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి ఫొటోలు అప్‌లోడ్ చేస్తుంటారు? ఇదేం ప్రశ్న! అందంగా దిగిన సెల్ఫీలు, అద్భుతం అనిపించిన ప్రకృతి దృశ్యాలు, ఫ్యామిలీ ఫొటోలు.. ఇలాంటివే కదా పోస్ట్ చేస్తాం ఎవరిమైనా! కానీ, కావియా ఇల్లంగ్.. లైంగిక అంశాలు, ఆరోగ్యం, స్త్రీల దేహధర్మాలు, కాలకృత్యాలు, ఇంటా బయట మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇలాంటి వాటిని ఇలస్ట్రేషన్లుగా గీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు. ముంబయ్‌కి చెందిన ఈ ఆరిస్ట్ ‘100 డేస్ ఛాలెంజ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకొని మన సామాజిక వ్యవస్థలోని వివక్షల్ని ఉతికేసే పనిలో పడ్డారు.
‘‘స్త్రీలు చాలా వరకు ఫిల్టర్ చేసిన సెల్ఫీలు, సందర్శన స్థలాలు, ఫిట్‌నెస్ లక్ష్యాల విజయాలు, స్టైలిష్ దుస్తులు, ఫ్యాన్సీ రెస్టారెంట్స్ పోస్టులు పెడుతుంటారు. అయితే.. రంగుకాగితాలు అంటించి కళ్లద్దాలుగా పెట్టుకున్న సోషల్ మీడియాలో ఒక సీరియస్ ఇష్యూ చేరితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అదీ సంక్లిష్ట బాంధవ్యాలు, దైనందిన యాంత్రికత, మానసిక ఆరోగ్యం, వ్యసనంగా మారిన మొబైల్ ఫోన్ల వాడకం, లైంగికత్వం, శారీరక ప్రతికూలత.. వంటి అంశాలను అర్ధవంతంగా చూపించాలనుకున్నాను. మనుషుల మనసుల్లో దాగి ఉన్న మురికిని ప్రక్షాళన చేయడానికి ఆన్‌లైన్ వేదిక వీలు కలిపిస్తుందని భావించాను’’ అంటారు కావియా!
కావియా ‘100 డేస్ ఆఫ్ డర్టీ లాండ్రీ’ (#100daysofdirtylaundry) ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని 2017 జూన్ 6న మొదటిసారి అప్‌లోడ్ చేసింది. చాలామంది ఈ ఇలస్ట్రేషన్‌లను మొదట తేలికగా తీసుకున్నారు. కానీ, ఇది మనిషి లోలోతుల్లోని పేగులను కదిలించే ఉద్యమం. మహిళల శరీరంలో లోపాలుగా భావించే అంశాలను కావియా బట్టబయలు చేస్తున్నారు. బ్యూటీ పేరుతో నరకాన్ని పంటిబిగువున భరిస్తున్న ఆకృతులను తన రేఖలలో ఆవిష్కరిస్తున్నారు.
మోసపూరిత బంధాలు, ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్.. ఒకటేమిటి ఇవి కూడా ఓ సమస్యలేనా అని అంతా భావించే పెద్ద పెద్ద అంశాలను ‘డర్టీ లాండ్రీ’గా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కావియా. వీటిని చూడటం, తెలుసుకోవడం అసౌకర్యంగానే అనిపించవచ్చు. కానీ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయం అని ఒప్పుకోక తప్పదు.
– ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment