అర్ధసత్యాలను నమ్మొద్దు!
దశోపనిషత్తుల్లో రెండవది కేనోపనిషత్తు. ఈ కేనోపనిషత్తు ఆత్మ అంటే ఏమిటో, బ్రహ్మమంటే ఏమిటో వివరిస్తుంది. ఆత్మ శక్తితోనే చెవి వినగలుగుతోంది. మనస్సు గ్రహిస్తోంది. వాక్కు పలుకుతోంది. ప్రాణం ఉంటోంది. కన్ను చూస్తోంది. ఈ సత్యాన్ని, ఆత్మ తత్వాన్ని తెలుసుకున్నవారు అమృతత్వాన్ని పొందుతారు.
ఈ ఆత్మను... అనగా బ్రహ్మపదార్థాన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పాలి... అంటే, దానిని కళ్లతో చూడలేము. వాక్కుతో చెప్పలేము. మనసుతో తెలుసుకోలేము. అది మనకు తెలిసిన వాటన్నింటికీ వేరైనది. తెలియని వాటికి పైన ఉంటుంది. అయితే, తెలియనిదానిని గురించి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించి అదే సత్యం అనుకుంటారు. నలుగురు గుడ్డివాళ్లు ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒకడు తొండం పట్టుకుని తొండమే ఏనుగు అన్నాడు. మరొకడు తోక పట్టుకొని తోకే ఏనుగు అన్నాడు. ఇంకొకడు కాలు, మరొకడు దంతాన్ని పట్టుకుని అనే ఏనుగు అనుకున్నారు. వారికి తెలిసిన పాక్షిక సత్యాన్ని అజ్ఞానంతో అహంకారంతో సంపూర్ణ సత్యంగా ప్రకటిస్తున్నారు.
పాక్షిక సత్యాన్ని విని మోసపోవద్దని చెప్పడం కేనోపనిషత్తు విశిష్టత. దేనిని మాటలతో చెప్పలేమో, దేనితో మాటలు ఏర్పడ్డాయో అదే అసలైన బ్రహ్మపదార్థం. భ్రమతో అనుకునేది నిజమైనది కాదు. ఏది మనస్సుకు తెలియదో, దేనివల్ల మనస్సు అన్నిటినీ తెలుసుకోగలుగుతోందో అనే అసలైన బ్రహ్మం. దేనిని కళ్లతో చూడలేమో, దేనివల్ల కళ్లు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మం. దేనిని చెవితో వినలేమో, దేనివల్ల చెవి వినగలుగుతోందో అదే బ్రహ్మం.
దేనిని ప్రాణం బతికించలేదో ప్రాణం దేనివల్ల ఉంటున్నదో అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి. అంతేకానీ, పాక్షిక సత్యాలను తాత్కాలిక ఫలితాలను నమ్మి మోసపోవద్దని కేనోపనిషత్తు చెబుతోంది. మాటలతో, మనసుతో, చూపుతో, వినికిడితో, ప్రాణంతో పరబ్రహ్మజ్ఞానం కలిగినట్లు భావించరాదు. అంతరిక్షంలోకి పోయే వాహనంలో కొన్ని భాగాలు ఎక్కడికక్కడ విడిపోయి పడిపోతూ ఉంటాయి. అసలైన ఉపగ్రహాన్ని పైకి చేర్చటమే వాటి పని. అంతేకాని అవి ఉపగ్రహం కావు. వాక్కు, మనస్సు, కన్ను, చెవి, ప్రాణం అలాంటివి. సగుణపాసన అలాంటిదే అని కేనోపనిషత్తు స్పష్టంగా చెబుతోంది.